కొమురవెల్లి, వెలుగు : ఇంట్లో రిపేర్ పని చేయడానికి వచ్చిన ఓ ప్లంబర్ అదే ఇంట్లోని 30 తులాల బంగారు ఆభరణాలు, 30 తులాల వెండిని దోచుకొని ఉడాయించాడు. సిద్దిపేట జిల్లా కొమురవెల్లి మండల కేంద్రంలో శనివారం ఈ ఘటన జరిగింది. బాధితులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొమురవెల్లికి చెందిన అంబడిపల్లి నాగరాజు తన ఇల్లు రిపేర్ కోసం అదేగ్రామానికి చెందిన మేడికుంట మల్లేశంను పిలిచాడు. రిపేర్ పనులు ఉండడంతో కుటుంబసభ్యులు ఇంటి సామాన్లను, వస్తువులను, బంగారు ఆభరణాలను సర్ది బంగ్లాపై ఉన్న మరో రూమ్‌లో భద్రరిచారు. శనివారం ప్లంబర్ మల్లేశంవచ్చి, పని అయిపోయినట్టు నాగరాజు భార్య అర్చనకు తెలిపాడు.
ఇంటిపైన పని చేసిన సామాన్లు ఉన్నాయని చెప్పిన మల్లేశం.. పైకి వెళ్లి, ఓ బ్యాగ్‌తో బయటకు వెళ్లాడు. కొద్ది సేపటి తర్వాత అర్చన బంగ్లాపైకి వెళ్లింది. ఇంటి సామాన్లు భద్రపరిచిన గది తాళం పగలగొట్టి ఉంది. అది గమనించిన అర్చన లోపలికి వెళ్లి చూడగా.. బంగారు, వెండి ఆభరణాలు, డబ్బులు బాక్స్ తాళం కూడా పగిలి ఉంది. చోరీ జరిగిందని గుర్తించిన ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చింది. మల్లేశంపై అనుమానంతో అతడికి ఫోన్ చేసి ఇంటికి రమ్మన్నారు. తర్వాత మళ్లీ ఫోన్ చేయగా ఫోన్ అందుబాటులోకి రాలేదు. దీంతో నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనా స్థలాన్ని ఎస్సై చంద్రమోహన్ పరిశీలించారు. కేసు నమోదు చేసి, నిందితుడి కోసం వెతుకుతున్నామన్నారు.