వన్యప్రాణులను కాపాడుకుందాం : మోదీ

వన్యప్రాణులను కాపాడుకుందాం : మోదీ
  • వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ పిలుపు 
  • గిర్ అడవుల్లో లయన్ సఫారి.. స్వయంగా ఫొటోలు తీసిన ప్రధాని
  • గిర్ లో ఏసియన్ లయన్స్ సంఖ్య పెరుగుతోంది
  • సింహాల రక్షణలో మహిళలు, గిరిజనుల కృషి భేష్ అని కితాబు   

అహ్మదాబాద్: గుజరాత్ లోని జునాగఢ్ జిల్లా గిర్ వన్యప్రాణుల అభయారణ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం పర్యటించారు. లయన్ సఫారీ చేస్తూ సింహాల ఫొటోలు తీశారు. ప్రపంచ వన్యప్రాణి దినోత్సవం సందర్భంగా ఆయన ఈ మేరకు జంగిల్ సఫారీకి వెళ్లారు. రాష్ట్ర అటవీశాఖ గెస్ట్‌‌హౌస్‌‌ ‘సింగ్ సదన్’ నుంచి బయల్దేరిన ప్రధాని వెంట.. కొందరు మంత్రులు, అటవీ శాఖ సీనియర్ అధికారులు ఉన్నారు. అటవీ ప్రాంతాన్ని పరిశీలిస్తూ ఫొటోగ్రాఫర్ మాదిరిగా ప్రధాని పిక్స్ తీశారు. కొన్ని ఫొటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ‘‘వరల్డ్ వైల్డ్ లైఫ్ డే సందర్భంగా సోమవారం ఉదయం నేను గిర్ ఫారెస్ట్​కి వెళ్లాను. సింహాల ఫొటోలు తీశాను. లయన్ సఫారి చేశాను’’ అని తెలిపారు. జీవవైవిధ్యాన్ని సంరక్షించడానికి ప్రజలంతా కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాబోయేతరాలకు మంచి భవిష్యత్తును ఇవ్వడానికి ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. వన్యప్రాణులను సంరక్షించడంలో ఇండియా చేస్తున్న కృషికి గర్వపడుతున్నట్లు తెలిపారు. గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు వన్యప్రాణులను సంరక్షణకు తీసుకున్న చర్యల గురించి ఆయన గుర్తు చేసుకున్నారు. గత కొన్నేండ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సమన్వయంగా తీసుకుంటున్న చర్యలతో ఆసియా సింహాల సంఖ్య పెరుగుతున్నదని తెలిపారు. ఆసియా సింహాలను సంరక్షించేందుకు గిర్ అడవుల చుట్టూ ఉన్న గిరిజనులు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. అందులోనూ మహిళల పాత్ర బాగుందని కొనియాడారు. 

లయన్ సఫారి.. థ్రిల్లింగ్ గా ఉంది.. 

దట్టమైన అడవి గుండా.. లయన్ సఫారి రైడ్ ఎంతో థ్రిల్లింగ్​గా అనిపించిందని ప్రధాని మోదీ తెలిపారు. సింహాలు ఎంతో స్వేచ్ఛగా తిరగడం చూసి ఆనందం వేసిందని తెలిపారు. సింహాలతో పాటు గిర్ అడవుల్లో ఉన్న కొన్ని చెట్లు, మొక్కలను కూడా మోదీ పరిశీలించారు. వాటి ఫొటోలు తీసుకున్నారు. గిర్ అడవులను సందర్శించిన తర్వాత జామ్​నగర్ రిలయన్స్ రిఫైనరీ కాంప్లెక్స్​లో ఉన్న జంతు సంరక్షణ కేంద్రాన్ని ప్రధాని పరిశీలించారు. అక్కడున్న ఏనుగుల గురించి నిర్వాహకులను అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత మధ్యాహ్నం గిర్ వన్యప్రాణుల అభయారణ్యం హెడ్ ఆఫీస్  ససన్ గిర్‌‌లో నిర్వహించిన నేషనల్ బోర్డ్ ఫర్ వైల్డ్‌‌లైఫ్‌‌ (ఎన్​బీడబ్ల్యూఎల్) కార్యక్రమానికి మోదీ అధ్యక్షత వహించారు. ఈ ప్రోగ్రామ్​లో చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్, వివిధ రాష్ట్రాల సభ్యులు, వన్యప్రాణి సంరక్షణకు కృషి చేస్తున్న పలు ఎన్‌‌జీవోల ప్రతినిధులు హాజరయ్యారు. 

ప్రాజెక్ట్ లయన్ కోసం రూ.2,900 కోట్లు

గుజరాత్‌‌లోని జునాగఢ్‌‌కు 65 కిలోమీటర్ల దూరంలో గిర్ వైల్డ్ లైఫ్ సాంక్చూరీ ఉన్నది. ప్రాజెక్ట్ లయన్ కోసం కేంద్ర ప్రభుత్వం రూ.2,900 కోట్లకు పైగా నిధులు మంజూరు చేసింది. గుజరాత్‌‌లోని 9 జిల్లాల్లోని 53 మండలాల్లో దాదాపు 30,000 చదరపు కిలో మీటర్ల విస్తీర్ణంలో ఆసియాటిక్ సింహాలు నివసిస్తున్నాయి. నేషనల్ ప్రాజెక్టులో భాగంగా.. జునాగఢ్ జిల్లాలోని న్యూ పిపాల్య వద్ద 50 ఎకరాలకు పైగా నేషనల్ రిఫరల్ సెంటర్ ఫర్ వైల్డ్‌‌లైఫ్‌‌ను ఏర్పాటు చేస్తున్నారు. దేశంలోని ప్రధాన నేషనల్ పార్క్స్​లో ఇది ఒకటి. వన్య ప్రాణుల సంరక్షణ కోసం హైటెక్ సదుపాయాలు ఏర్పాటు చేశారు. సింహాలు, ఇతర వన్య ప్రాణులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేస్తుంటారు. ససన్​గిర్​లో జంతువుల కోసం అత్యాధునిక సౌకర్యాలతో కూడిన హాస్పిటల్​ను కూడా ఏర్పాటు చేశారు. గిర్ వైల్డ్ లైఫ్ సాంక్చూరీలో ఆసియా సింహాలతో సహా దాదాపు 2,375 విభిన్న వన్యప్రాణుల జాతులు నివాసం ఉంటున్నాయి.