సోలార్ పవర్ ను వినియోగించుకునే దిశగా భారత్ ముందడుగు వేస్తోందని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఇవాళ గుజరాత్ లో పర్యటించిన మోడీ.. 14 వేల 600 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. 24 గంటల సోలార్ విద్యుత్ గ్రామాన్ని అధికారికంగా ఆయన ప్రకటించారు. దీంతో దేశంలో తొలి సంపూర్ణ సోలార్ గ్రామం గుజరాత్ లోని మోధేరా ఆవిష్కృతం అయ్యింది. ఈ సందర్భంగా ప్రధాని మాట్లాడుతూ.. ఇప్పటి వరకు మోధేరా గ్రామం సూర్యదేవ ఆలయానికి మాత్రమే ప్రసిద్ధని..ఇప్పుడు సూర్యదేవ గ్రామంగా కొలుస్తారన్నారు. 21వ శతాబ్ధం నాటికి మన శక్తికి అవసరమైన విద్యుత్ ను ఉత్పత్తి చేసుకోవాలన్నారు. మోధేరా, మోహసానా తో పాటు.. ఉత్తర గుజరాత్ కు కొత్త శక్తి వచ్చిందన్నారు. విద్యుత్, నీరు, రోడ్డు, రైలు, డెయిరీ, స్కిల్ డెవలప్ మెంట్, హెల్త్ కేర్ కు సంబంధించిన చాలా ప్రాజెక్టులు ప్రారంభించామని మోడీ తెలిపారు. సోలార్ తో జనం సొంత విద్యుత్ ను తయారు చేసుకునే సౌకర్యం ఉంటుందన్నారు.
అనంతరం మోధేరాలోని మోధేశ్వరి మాత ఆలయంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. సూర్యమందిరాన్ని గుజరాత్ సీఎం భూపేంద్ర పటేల్ తో కలిసి సందర్శించారు. దేవాలయంలో విద్యుదీకరణ, 3డీ ప్రొజెక్షన్ సౌరవిద్యుత్ తోనే ఏర్పాటు చేశారు. ప్రధాని కలల సాకారం గుజరాత్ ముందు వరుసలో ఉందని సీఎం భూపేంద్ర పటేల్ అన్నారు. 2030 నాటికి పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి ద్వారా దేశ విద్యుత్ అవసరాలు 50 శాతం తీరాలన్న సంకల్పానికి తగ్గట్లు పని చేస్తున్నామన్నారు.
బ్యాటరీ ఎనర్జీ స్టోరేజి సిస్టం ద్వారా స్థానిక సూర్యదేవాలయంతో పాటు.. మోధేరా గ్రామ సౌర విద్యుదీకరణ కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేశాయి. ఈ ప్రాజెక్టు కోసం గుజరాత్ ప్రభుత్వం 18 ఎకరాల భూమి కేటాయించగా.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 80 కోట్ల 66 లక్షల నిధులను కేటాయించాయి. మోధేరా గ్రామంలో 1కిలోవాట్ సోలార్ ప్యానెల్స్ ను లక్షా 30 వేలకు పైగా అమర్చినట్లు అధికారులు తెలిపారు.