న్యాయ ప్రక్రియలో కొత్త చట్టాలు గొప్ప ముందడుగు: మోదీ

న్యాయ ప్రక్రియలో కొత్త చట్టాలు గొప్ప ముందడుగు: మోదీ

 

  • వీటితో పౌరులకు సత్వర న్యాయం: ప్రధాని మోదీ

 
చండీగఢ్: కొత్త చట్టాలతో పౌరులకు సత్వర న్యాయం చేకూరుతుందని, న్యాయ ప్రక్రియలో ఇదొక గొప్ప ముందడుగు అని ప్రధాని మోదీ అన్నారు. ఇవి పౌరుల హక్కులను పరిరక్షిస్తున్నాయని పేర్కొన్నారు.  దేశంలోనే కొత్త చట్టాలు 100 శాతం అమలవుతున్న మొదటి అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్​గా చండీగఢ్ నిలిచింది. ఈ సందర్భంగా మంగళవారం చండీగఢ్ లో నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని మోదీ మాట్లాడారు. ‘‘వలసవాదుల కాలం నాటి చట్టాల స్థానంలో భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక సురక్ష సంహిత, భారతీయ సాక్ష్య అధినియం చట్టాలను తీసుకొచ్చాం. రాజ్యాంగ లక్ష్యాలను నెరవేర్చడంలో ఇదొక ముందడుగు. బ్రిటీష్ కాలంలో మొదట  ఐపీసీ, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, సీఆర్ పీసీ చట్టాలను తీసుకొచ్చారు. మన దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆ చట్టాలు అలాగే కొనసాగాయి. కాలానుగుణంగా కొన్ని మార్పులు చేర్పులు చేసినప్పటికీ, అవి వలసవాద కాలం నాటి చట్టాలుగానే మిగిలిపోయాయి. అందుకే వాటికి మేం స్వస్తి పలికాం. మన న్యాయ ప్రక్రియ పారదర్శకంగా, సులభంగా ఉండేలా కొత్త చట్టాలు తెచ్చాం. ఇప్పుడు సైబర్ క్రైమ్ లాంటి నేరాల్లోనూ బాధితులకు సత్వర న్యాయం చేకూరేలా చట్టాలను రూపొందించాం” అని మోదీ తెలిపారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు, హైకోర్టు జడ్జీలకు కృతజ్ఞతలు తెలిపారు.

దేశ నిర్మాణంలో దివ్యాంగులూ భాగస్వాములే..

గత ప్రభుత్వాల పాలసీల వల్ల దివ్యాంగులు వెనకబడ్డారని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాతే వారి అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టామని మోదీ తెలిపారు. మంగళవారం అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా తన వెబ్ సైట్​లో ఆయన హిందీలో ఒక బ్లాగ్ రాశారు. దివ్యాంగులను గౌరవించడం భారతీయ సంస్కృతిలోనే ఉందన్నారు. ఉత్సాహం నిండిన మనసున్న వ్యక్తికి ప్రపంచంలో సాధ్యం కానిది ఏదీ లేదనే శ్లోకాన్ని ప్రస్తావించారు. దేశ నిర్మాణంలో దివ్యాంగులు కూడా భాగస్వాములేనని తెలిపారు. తొమ్మిదేండ్ల క్రితం తాను సుగమ్య భారత్ అభియాన్​ను ప్రారంభించానని.. వికలాంగులు అనే పదానికి బదులు దివ్యాంగులు అనే పదం వాడాలని చట్టంలో మార్పులు చేశామన్నారు. 2047 నాటికి మన దివ్యాంగులు ప్రపంచానికే స్ఫూర్తిగా నిలుస్తారని ఆకాంక్షించారు.