ఆర్థిక భద్రత కోసమే ప్రాపర్టీ కార్డులు ఇవి పేదరిక నిర్మూలనకు సాయపడతాయి : ప్రధాని మోదీ

  • 65 లక్షల మందికి వర్చువల్‌‌‌‌గా ప్రాపర్టీ కార్డుల పంపిణీ 

న్యూఢిల్లీ: సర్వే ఆఫ్ విలేజెస్ అండ్ మ్యాపింగ్ విత్ ఇంప్రూవైజ్డ్ టెక్నాలజీ ఇన్ విలేజ్ ఏరియాస్ (స్వామిత్వ) స్కీమ్ కింద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలకు ప్రాపర్టీ కార్డులను పంపిణీ చేశారు. శనివారం వర్చువల్ విధానంలో ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన.. దాదాపు 65 లక్షల మందికి ప్రాపర్టీ కార్డులను అందించారు. దేశంలోని 10 రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల్లోని 230 జిల్లాలకు చెందిన లబ్దిదారులు కార్డులు అందుకున్నారు.

ఈ సందర్భంగా లబ్దిదారులను ఉద్దేశించి ప్రధాని మాట్లాడుతూ.."శనివారం చత్తీస్‌‌గఢ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మిజోరాం, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, యూపీ, జమ్మూకాశ్మీర్, లడఖ్‌‌లలోని 50వేల గ్రామాలకు చెందిన లబ్ధిదారులకు ప్రాపర్టీ కార్డులు పంపిణీ అవుతున్నాయి. వీరందరికీ నా అభినందనలు. ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద సవాళ్లలో ఆస్తి హక్కు ఒకటి. చాలా దేశాల్లో ప్రజల వద్ద తమ ఆస్తులకు సంబంధించిన చట్టపరమైన పత్రాలు లేవని ఇటీవల ఐక్యరాజ్యసమితి స్టడీ వెల్లడించింది. పేదరికం తగ్గాలంటే ప్రజలకు ఆస్తి హక్కులు ఇవ్వడం చాలా ముఖ్యమని స్పష్టంగా చెప్పింది. మన పరిస్థితి కూడా ఇతర దేశాల మాదిరిగానే ఉంది.

గ్రామాల్లోని ప్రజలకు లక్షలాది రూపాయల ఆస్తులున్నా, చట్టబద్ధమైన పత్రాలు లేవు. అందుకే ఆస్తి వివాదాలు తలెత్తుతున్నాయి. చాలాచోట్ల పేదల భూములను బలవంతులు స్వాధీనం చేసుకుంటున్నారు. ప్రాపర్టీ కార్డుల వల్ల ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. అంతేకాదు..  వీటితో బ్యాంక్ రుణాలు ఈజీగా తీసుకోవచ్చు. అన్ని ప్రభుత్వ పథకాలు అందుతాయి. చట్టబద్ధమైన ఆస్తి హక్కులు పొంది లక్షల మంది రుణాలు తీసుకున్నారు. ఈ డబ్బుతో వ్యాపారాలు స్టార్ట్ చేశారు. ప్రాపర్టీ కార్డులు ఆర్థిక భద్రతకు హామీ వంటివి.ఈరోజు  ఇచ్చిన65 లక్షల కార్డులతో  లబ్ధిదారుల సంఖ్య దాదాపు 2.24 కోట్లకు చేరుకుంది" అని ప్రధాని పేర్కొన్నారు.