- యూపీలో పలు అభివృద్ధి పనులను ప్రారంభించిన ప్రధాని
ప్రయాగ్‌రాజ్(యూపీ): ఇండియా అంటేనే పవిత్ర స్థలాలకు పుట్టినిల్లు అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. మహా కుంభమేళాను ప్రపంచమంతా చర్చించుకునేలా మహా యజ్ఞంలా నిర్వహిస్తామని ప్రకటించారు. తొలిసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ), చాట్‌బాట్ సేవలను వినియోగించుకుంటామని తెలిపారు. మహా కుంభ మేళాకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కమ్యూనికేట్ చేస్తామని ప్రకటించారు. 2025లో యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహా కుంభమేళా జరగనున్నది. దీనికి సంబంధించి.. 167 అభివృద్ధి ప్రాజెక్టులను మోదీ శుక్రవారం ప్రారంభించారు.
రూ.5,500 కోట్లతో మహా కుంభమేళ కోసం ప్రయాగ్‌రాజ్‌ను ముస్తాబు చేస్తున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మోదీ మాట్లాడారు. ‘‘ప్రయాగ్‌రాజ్‌లో నిర్వహించబోయే మహా కుంభమేళా.. దేశ సంస్కృతి, సంప్రదాయాలను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్తుంది. ఈ ఉత్సవాల్లో తొలిసారి ఏఐ, చాట్‌బాట్ సేవలు వినియోగించుకోబోతున్నాం. ఎలాంటి ప్రమాదాలు జరగకుండా రోబోటిక్ ఫైర్ టెండర్లను ఏర్పాటు చేశాం. ఈ ఉత్సవాలకు సంబంధించిన పూర్తి సమాచారం భక్తులకు తెలియజేస్తాం.
పుణ్య స్నానాలు, పూజా కార్యక్రమాల విషయంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా టెక్నాలజీ సాయంతో భక్తులను గైడ్ చేస్తాం. ఎమర్జెన్సీ టైమ్‌లో సిబ్బంది చేరుకోలేని ప్రాంతాలకు వెళ్లేందుకు మూడు రోబోటిక్ ఫైర్ టెండర్లను అందుబాటులో ఉంచాం. ఈ రోబోలు మెట్లు ఎక్కడంతో పాటు మంటలను సైతం అదుపు చేస్తాయి. 35 మీటర్ల ఎత్తు నుంచి నీటిని స్ప్రే చేసే ఆర్టిక్యూలేటింగ్ వాటర్ టవర్‌లు, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన కెమెరాలు ఏర్పాటు చేశాం’’అని మోదీ తెలిపారు.
కుంభమేళాకు తరలిరండి
దేశప్రజలంతా మహాకుంభ మేళాకు తరలిరావాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ ఉత్సవంలో కులాలు, వర్గాల మధ్య విభేదాలు తొలగిపోతాయన్నారు. ‘‘వచ్చే ఏడాది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు మహా కుంభమేళ జరగనున్నది. 12 ఏండ్లకోసారి కుంభ మేళా నిర్వహిస్తుంటారు. ఈ ఉత్సవాల కోసం కార్మికులు, అధికారులు ఎంతో కష్టపడుతున్నారు.
మహాకుంభ మేళాతో ప్రయాగ్‌రాజ్ భూమిపై ఓ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నది. దేశాన్ని సాంస్కృతికంగా, ఆధ్యాత్మికంగా ఉన్నత స్థితికి తీసుకెళ్తున్నది. ప్రతి రోజూ లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలకు వస్తుంటారు. 45 రోజుల పాటు ఈ ఉత్సవం జరుగుతుంది. ప్రయాగ్‌రాజ్.. మూడు నదుల సంగమం మాత్రమే కాదు.. అంతకంటే ఎక్కువ’’అని మోదీ తెలిపారు. సభలో మాట్లాడటానికి ముందు గంగా, యుమన, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద మోదీ ప్రత్యేక పూజలు చేశారు