10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్

10 లక్షల మంది రైతులకు .. పీఎం కిసాన్ సాయం కట్
  • కొర్రీలు పెడుతు సాయానికి కేంద్ర ప్రభుత్వం కోత
  • 2019 ఫిబ్రవరి వరకు పాస్​బుక్స్ ఉన్నోళ్లకే స్కీం వర్తింపు
  • నాలుగేండ్లలో తగ్గిన 6 లక్షల మంది లబ్ధిదారులు
  • భూమి అమ్ముకున్నోళ్లను లిస్ట్ నుంచి తొలగిస్తూ.. కొత్త వాళ్లను మాత్రం చేర్చట్లేదు

కరీంనగర్, వెలుగు: రాష్ట్రంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందరికీ అందడం లేదు. రకరకాల నిబంధనల పేరిట కొర్రీలు పెడుతూ కేంద్ర ప్రభుత్వం ఏటేటా లబ్ధిదారుల సంఖ్యను తగ్గిస్తూ వస్తున్నది. 2019 ఫిబ్రవరి నాటికి ఎన్​రోల్ చేసుకున్నవాళ్లకు మాత్రమే కేంద్రం సాయం అందిస్తున్నది. ఆ తర్వాత కొత్తగా భూమి కొనుగోలు చేసినవాళ్లకు, విరాసత్ ద్వారా భూమిని పొందినవాళ్లకు కూడా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందడం లేదు. 

కటాఫ్ తేదీ తర్వాత 2020 – 21లో  రాష్ట్రంలో36.36 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే ప్రస్తుతం ఆ సంఖ్య 30.39 లక్షలకు చేరుకుంది. నాలుగేళ్లలో సుమారు 6 లక్షల మంది లబ్ధిదారుల పేర్లను పీఎం కిసాన్ సమ్మాన్ నిధి జాబితా నుంచి తొలగించిన కేంద్రం.. కొత్తవాళ్లను మాత్రం చేర్చకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో రైతు బంధు లబ్ధిదారుల డేటాను ఏడాదికోసారి అప్ డేట్ చేస్తుంటే.. కేంద్రం మాత్రం కొత్త లబ్ధిదారులను పట్టించుకోవడం లేదు.

10 లక్షల మంది అర్హులకు అందని సాయం..

పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ కింద ఐదెకరాల్లోపు భూమి ఉన్న  రైతులకు ఏటా 6 వేలు సాయం కేంద్రం అందజేస్తున్నది. ఈ స్కీమ్ కు ఫ్యామిలీని యూనిట్ గా తీసుకుని కుటుంబ సభ్యుల్లో ఒక్కరికి మాత్రమే వర్తింపజేస్తున్నది. ఇన్​కం ట్యాక్స్ చెల్లించేవారికి, ఆధార్‌‌‌‌ కార్డును బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేయని రైతులకు ఈ పథకం వర్తించడం లేదు. 2019 మార్చి తర్వాత వ్యవసాయ భూములు కొత్తగా కొనుగోలు చేసిన పట్టాదారులకు సాయం అందడం లేదు

. అలాగే తల్లిదండ్రులు చనిపోతే వారి భూమి వారసుల పేరిట మారిన తర్వాత.. సదరు వారసులకు సమ్మాన్ నిధి జమ కావడం లేదు. కొత్తగా భూములు కొనుగోలు చేసిన అర్హులైన లబ్ధిదారులు, విరాసత్ ద్వారా భూమి పొందిన వారు, భూములను భాగ పంపకాలు చేసుకుని కుటుంబాలు వేరైనవారు ఇలా సుమారు 10 లక్షల మంది అర్హులకు ఈ సాయం అందడం లేదని సమాచారం. కొత్తగా భూమి కొనుగోలు చేసిన రైతులకు ఏటా ఒక సారి అప్లికేషన్ పెట్టుకునే అవకాశం ఇవ్వాల్సి ఉండగా.. కేంద్ర ప్రభుత్వం అవేమి పట్టించుకోవం లేదు.

రూ.2,200 కోట్ల నుంచి రూ.1277 కోట్లకు తగ్గిన సాయం 

2018 డిసెంబర్ లో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ను  కేంద్ర ప్రభుత్వం ప్రారంభించినప్పుడు రాష్ట్రంలో లబ్ధిదారుల సంఖ్య 20,09,462 మంది ఉంటే ఆ ఏడాది వారి ఖాతాల్లో  రూ.405 కోట్లు జమ చేశారు. 2019–20 ఆర్థిక సంవత్సరంలో ఆ సంఖ్య 34,73,883 చేరగా రూ.2,121 కోట్లు అందజేసింది. ఆ తర్వాత 2020–21లో 36,36,780 మంది రైతుల ఖాతాల్లో ఏటా రూ.6 వేల చొప్పున రూ.2,214 కోట్లు జమ చేసింది. 2020–23లో రైతల సంఖ్య 35.81 లక్షలకు తగ్గిపోగా.. ఈ ఏడాది అమాంతం 30,39,181కి చేరింది. 

అంటే ఈ ఒక్క ఏడాదిలోనే 5 లక్షలకుపైగా లబ్ధిదారులను జాబితా నుంచి తొలగించడం గమనార్హం. అలాగే గతంలో ఏటా రూ.2,200 కోట్ల మేర రైతులకు అందజేసిన కేంద్రం.. ఈ ఏడాది రాష్ట్ర రైతులకు రూ.1277 కోట్లు మాత్రమే జమ చేసింది. రాష్ట్రంలో రైతు బంధు స్కీమ్ ప్రారంభమైన రోజుల్లో 2018 వానాకాలం సీజన్ లో 50.2 లక్షల మంది లబ్ధిదారులు ఉంటే.. ఇప్పుడు ఆ సంఖ్య 70 లక్షలకు చేరింది. ప్రతి ఏటా కొత్తగా భూములు కొనుగోలు చేసిన వారి పేర్లను రైతు బంధు జాబితాలో అప్ డేట్ చేస్తున్నారు. రాష్ట్రంలో రైతుబంధు లబ్ధిదారుల సంఖ్య ఇలా పెరుగుతూ పోతుంటే.. పీఎం కిసాన్ సమ్మాన్ నిధి కుటుంబాల సంఖ్యను తగ్గిస్తూ పోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

నా అప్లికేషన్ రిజెక్ట్ చేశారు..

మాది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం లింగోజీగూడెం. మా నాన్న బండారు కర్ణాకర్ రెడ్డి ద్వారా వారసత్వంగా వచ్చిన భూమిని 2021 అక్టోబర్ లో విరాసత్ ద్వారా పట్టా చేసుకున్నాను. ఆ తర్వాత నేను పీఎం కిసాన్ సమ్మాన్ నిధికి ఆన్ లైన్ లో అప్లై చేసుకోగా..  అప్లికేషన్ రిజెక్ట్ అయింది. వాస్తవానికి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి గైడ్​లైన్స్ ప్రకారం.. 2019 ఫిబ్రవరి నెలే కటాఫ్ అయినప్పటికీ పౌతీ/విరాసత్ ద్వారా భూములు పొందినవారికి కిసాన్ సమ్మాన్ నిధి వర్తిస్తుందని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు కూడా స్కీమ్ వర్తింపజేయట్లేదు. ఇది సరికాదు.

బండారు ప్రవీణ్ రెడ్డి, లింగోజిగూడెం, యాదాద్రి జిల్లా

పీఎం కిసాన్ రావట్లే.. 

మాది రంగారెడ్డి జిల్లా కొందర్గు మండలం గంగన్నగూడెం. మా నాన్న మరణాంతరం 2022 సంవత్సరం ఆగస్టులో నాకు 9.-09 ఎకరాలు విరాసత్ ద్వారా సంక్రమించింది. వెంటనే పీఎం కిసాన్ కోసం సంబంధిత పత్రాలు మా స్థానిక మండల వ్యవసాయశాఖ ఆఫీసులో ఇచ్చాను. కానీ ఇప్పటివరకు నాకు పీఎం కిసాన్ డబ్బులు రాలేదు.

 సిద్ధులూరి మురళీధర్ రెడ్డి, గంగన్నగూడెం, రంగారెడ్డి జిల్లా