- పీఎం మిత్ర, పీఎల్ఐ స్కీమ్‌లతో వచ్చే చాన్స్ వెల్లడించిన కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచన
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి మిత్ర మెగా టెక్స్‌టైల్ పార్కుల వల్ల మనదేశ టెక్స్‌టైల్స్ రంగానికి 95 వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తాయని కేంద్రం అంచనా వేస్తోంది. రాబోయే 3–-5 ఏళ్లలో మానవ నిర్మిత వస్త్రాలు, సాంకేతిక వస్త్ర ఉత్పత్తుల కోసం పీఎల్‌ఐ పథకాన్ని తీసుకొచ్చామని కేంద్ర జౌళి శాఖ కార్యదర్శి రచనా షా సోమవారం తెలిపారు. టెక్స్‌టైల్స్ రంగం ఈ రెండు పథకాలతో పాటు ఎఫ్‌డీఐ (విదేశీ ప్రత్యక్ష పెట్టుబడి) వంటి అనేక ఇతర మార్గాల నుంచి కూడా పెట్టుబడులను ఆకర్షిస్తుంది.
మానవ తయారీ వస్త్రం, దుస్తులు, సాంకేతిక వస్త్రాలకు సంబంధించిన "సన్‌రైజ్ రంగాలను" ప్రోత్సహించడంపై ప్రభుత్వం దృష్టి పెట్టిందని ఆమె వివరించారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో జరగనున్న భారత్ టెక్స్ 2025 మెగా టెక్స్‌టైల్స్ ఈవెంట్లో అవగాహన ఒప్పందాలు మాత్రమే కాకుండా పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నట్టు తెలిపారు. "మన దగ్గర ఏడు టెక్స్‌టైల్ పార్కులు ఉన్నాయి. వాటిలో ప్రతి ఒక్కటి 10వేల కోట్ల రూపాయల పెట్టుబడిని ఆకర్షించగలుగుతుంది. మొత్తం దాదాపు 70వేల కోట్ల రూపాయలు వస్తాయి.
సాంకేతిక వస్త్రాలు, ఎంఎంఎఫ్ ఫైబర్ కోసం పీఎల్ఐ పథకం రానుంది. దీని కింద మరో 25వేల కోట్ల రూపాయల పెట్టుబడులు రావొచ్చు. పీఎల్ఐ కింద పెట్టుబడిలో కొంత భాగం ఇప్పటికే వచ్చింది. రాబోయే 3-–5 సంవత్సరాలలో ఈ పెద్ద పెట్టుబడులు వస్తాయని భావిస్తున్నాం. పథకాలే కాకుండా ఇతర మార్గాల్లోనూ పెట్టుబడులు వస్తాయి. వీటిలో ఎఫ్‌డీఐలు, ఇతర వనరులు ఉంటాయి”అని రచన వివరించారు.
ఏడు రాష్ట్రాల్లో ఏడు పార్కులు
ప్రధానమంత్రి మిత్ర పథకం కింద ఏడు మెగా టెక్స్‌టైల్స్ పార్కులు తమిళనాడు (విరుధ్‌నగర్), తెలంగాణ (వరంగల్), గుజరాత్ (నవసారి), కర్ణాటక (కల్బుర్గి), మధ్యప్రదేశ్ (ధార్), ఉత్తరప్రదేశ్ (లక్నో/హర్దోయ్) మహారాష్ట్ర (అమరావతి)లో ఉన్నాయి. ‘‘కేవలం ఎంఓయూల మాత్రమే కాకుండా ఇతర మార్గాల్లోనూ వ్యాపారాన్ని పెంచే దిశగా ప్రయత్నాలు చేస్తున్నాం. పెద్ద ఎత్తున పెట్టుబడులను రాబడుతాం. 2021లో టెక్స్‌టైల్స్ రంగం కోసం రూ. 10,683 కోట్ల పీఎల్‌ఐ స్కీమ్‌కు ప్రభుత్వం ఆమోదం తెలిపింది.
ఐదేళ్లలో మానవ నిర్మిత వస్త్రాలు, సాంకేతిక వస్త్ర ఉత్పత్తుల ఉత్పత్తిని ప్రోత్సహించే లక్ష్యంతో దీనిని చేపట్టారు. వచ్చే ఫిబ్రవరిలో నిర్వహించనున్న భారత్ టెక్స్ 2025 భారత్ టెక్స్ 2024 కంటే పెద్దదిగా ఉంటుందని భావిస్తున్నాం. భారత్ టెక్స్‌కు హాజరైన వారిని భాగస్వాములుగా కూడా చేరాలని కోరుతాం. పెట్టుబడుల కోసం జాయింట్ వెంచర్‌లను ఏర్పాటు చేస్తాం. భారతీయ మార్కెట్, ఎగుమతి మార్కెట్లకు యాక్సెస్ కల్పిస్తాం’’ అని విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రత్యేక కార్యదర్శి కుమరన్ అన్నారు.