
- 15వ రోజ్గార్ మేళాలో ప్రధాని నరేంద్ర మోదీ
న్యూఢిల్లీ: దేశంలో ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలు పెరగడానికి కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటున్నదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. 15 రోజోగార్ మేళా పురస్కరించుకొని శనివారం నిర్వహించిన వర్చువల్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వంలోని వివిధ విభాగాలలో నియామకాలకు సంబంధించి 51 వేల మందికి అపాయింట్మెంట్ లెటర్లు పంపిణీ చేశారు. అనంతరం మోదీ మాట్లాడుతూ ఇండియా అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఉందని అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ(ఐఎంఎఫ్) పేర్కొందని చెప్పారు. ఇది యువతకు అపూర్వమైన అవకాశాల సమయమని తెలిపారు. ప్రతి రంగంలోనూ ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు.
కొత్త శిఖరాలకు మహిళా శక్తి
స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా, డిజిటల్ ఇండియా వంటి కార్యక్రమాలు ప్రతిభను ప్రదర్శించడానికి యువతకు ఓపెన్ప్లాట్ఫామ్ను అందిస్తున్నాయని ప్రధాని అన్నారు. ప్రపంచ స్థాయి ప్రమాణాలకు అనుగుణంగా ఉత్పత్తులను తయారు చేసే అవకాశాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్లో ప్రభుత్వం ‘‘మాన్యూఫ్యాక్చరింగ్ మిషన్’’ను ప్రకటించిందని చెప్పారు. ‘‘మాన్యూఫ్యాక్చరింగ్ మిషన్ లక్షలాది ఎంఎస్ఎంఈలు, చిన్న పారిశ్రామికవేత్తలకు సపోర్టు ఇవ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా కొత్త ఉపాధి మార్గాలను కూడా తీసుకొస్తుంది’’ అని మోదీ అన్నారు.
దేశంలో ఇంక్లూజివ్గ్రోత్ అనేది ఒక పెద్ద ప్రధానాంశమని, ప్రతి రంగంలోనూ మహిళల భాగస్వామ్యం పెరిగిందన్నారు. ఈ సంవత్సరం యూపీఎస్సీ పరీక్షలో ఐదుగురు టాపర్లలో ముగ్గురు మహిళలు ఉన్నారని, 90 లక్షలకు పైగా స్వయం సహాయక గ్రూపుల్లో 10 కోట్లకు పైగా మహిళలు పనిచేస్తున్నారని ఆయన అన్నారు. బ్యూరోక్రసీ నుంచి అంతరిక్షం, విజ్ఞాన శాస్త్రం వరకు రంగాలలో ఇండియా మహిళా శక్తి కొత్త శిఖరాలను అధిరోహిస్తున్నదని, గ్రామీణ మహిళల సాధికారతపై కూడా ప్రభుత్వం దృష్టి సారించిందని పేర్కొన్నారు. ఈ దశాబ్దంలో టెక్నాలజీ, డేటా, ఇన్నొవేషన్స్లో ఇండియా గ్రోత్యువత ఎంతో శక్తినిచ్చిందని తెలిపారు.