భోపాల్: గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ చేసిందేమీ లేదని ప్రధాని నరేంద్ర మోదీ విమర్శించారు. రాష్ట్రంలో ఇద్దరు కాంగ్రెస్ సీనియర్ నాయకులు తమ కుమారులకు ప్రాధాన్యత కల్పించేందుకు, పార్టీలో ఆధిపత్యం చేలాయించేందుకు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నారని అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం ప్రధాని మోదీ మధ్య ప్రదేశ్ లో పర్యటించారు.
రాష్ట్రంలోని సియోని జిల్లాలో బీజేపీ నిర్వహించిన బహిరంగ సభలో మోదీ మాట్లాడుతూ.. స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశంలో ఆరు దశాబ్దాలుగా కాంగ్రెస్ అధికారంలో ఉన్నా గిరిజనుల సంక్షేమానికి చేసిందేమీ లేదని మండిపడ్డారు. పేదల కోసం బీజేపీ ప్రభుత్వం.. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం తీసుకొచ్చామని.. దీని ద్వారా 80 కోట్ల మంది పేదలకు ఉచిత రేషన్ అందిస్తున్నామని తెలిపారు. ఈ పథకాన్ని వచ్చే ఐదు సంవత్సరాలకు పొడిగిస్తామని ఆయన చెప్పారు.
2014కు ముందు కాంగ్రెస్ హయాంలో లక్షలు, కోట్ల రూపాయల కుంభకోణాలు జరిగాయని ఆరోపించారు.బీజేపీ ప్రభుత్వ హయాంలో స్కామ్ లు చేయకుండా పొదుపు చేసిన సొమ్ముతో పేదలకు ఉచితంగా రేషన్ అందజేస్తున్నామన్నారు. మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక దేశంలోనే తొలిసారిగా గిరిజనుల సంక్షేమం కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేశామని ప్రధాని మోదీ అన్నారు.
తమ ప్రభుత్వ విధానాల వల్లే దేశంలో ముబైల్ ఫోన్‌లు, ముబైల్ డేటా చౌకగా లభిస్తున్నాయని చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉన్న సమయంలో మొబైల్ ఫోన్‌ల నెలవారీ ఛార్జీలు రూ.300 నుంచి రూ.400లు... ముబైల్ డేటా నెలకు రూ.4,000 నుంచి రూ.5,000లు ఉండేవని చెప్పారు.
జనరిక్ ఔషధ కేంద్రాల ఏర్పాటు చేసి.. వాటి ద్వారా 80 శాతం డిస్కౌంట్‌తో ఔషధాలు విక్రయించడంతో పేద ప్రజలు సుమారు రూ.25,000 కోట్లు ఆదా చేసుకున్నారని మోదీ తెలిపారు.కాంగ్రెస్ కుటుంబ పాలన, స్కామ్ లను అడ్డుకోవాలంటే.. మధ్యప్రదేశ్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడితేనే సాధ్యమవుతుందని.. ప్రజలు బీజేపీ ఓటు వేసి గెలిపించాలని ప్రధాని మోదీ కోరారు. కాగా, మధ్యప్రదేశ్ లో మొత్తం 230 అసెంబ్లీ స్థానాలకు నవంబర్ 17న ఎన్నికలు జరగునున్నాయి.