కేంద్ర ఆర్థిక బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. ఇది యువత నైపుణ్యాలను పెంచే బడ్జెట్ అని కొనియాడారు. తయారీ రంగంలో భారత్ ప్రపంచ హబ్ గా మారుతుందని ప్రధాని ఆకాంక్షించారు. ముద్ర రుణాలను రూ.20 లక్షలకు పెంచామని చెప్పారు. మధ్య తరగతిపై ట్యాక్స్ భారాన్ని తగ్గించామని, టీడీఎస్ నిబంధనలను సరళించామని ప్రధాని మోదీ తెలిపారు. పేదల కోసం మూడు కోట్ల ఇళ్ల నిర్మాణంతో పాటు, బడ్జెట్లో రైతులకుపెద్దపీట వేశామని ఆయన చెప్పారు. చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త బాటలు వేశామని, ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధికి బడ్జెట్లో ప్రాధాన్యత ఇచ్చామని వివరించారు.యువత కలలు నెరవేర్చేలా బడ్జెట్ ఉందని, నైపుణ్యాభివృద్ధికి బడ్జెట్లో పెద్దపీట వేశామని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. దేశ ఆర్థిక ప్రగతికి బడ్జెట్ ఉపయోగపడుతుందని, మధ్య తరగతికి భరోసానిచ్చేలా బడ్జెట్ ఉందని కేంద్ర బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు తన సందేశాన్ని తెలియజేశారు.
Also Read:-ధరలు పెరిగేవి.. తగ్గేవి ఇవే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ కేంద్ర బడ్జెట్ రూ.48.21 లక్షల కోట్లుగా ప్రకటించారు. మొత్తం ఆదాయం రూ.32.07 లక్షల కోట్లు కాగా, పన్ను ఆదాయం రూ.28.83 లక్షల కోట్లు. ద్రవ్యలోటు 4.3 శాతం (అంచనా). అప్పులు, పన్నేతర ఆదాయాలు రూ.16 లక్షల కోట్లు (అంచనా). పన్ను విధానంలో కూడా కేంద్రం మార్పులు చేసింది. కొత్త ట్యాక్స్ విధానంలో పన్ను, స్లాబ్ లు మార్చింది. స్టాండర్డ్ డిడక్షన్ రూ.50 వేల నుంచి రూ.75 వేలకు పెంచింది. రూ.3 లక్షల వరకూ పన్ను మినహాయింపును ప్రకటించింది. రూ.3 లక్షల నుంచి రూ.7 లక్షల వరకూ 5 శాతం, రూ.7 లక్షల నుంచి రూ.10 లక్షల వరకూ 10 శాతం, రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షల వరకూ 15 శాతం, రూ.12 లక్షల నుంచి రూ.15 లక్షల వరకూ 20 శాతం, రూ.15 లక్షల పైన 30 శాతం పన్ను ఉంటుందని కేంద్ర బడ్జెట్ సందర్భంగా ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు.