ఫలితాలిస్తున్న మోదీ పర్యటన..అమెరికా -ఇండియాలకు కొత్త నిర్వచనం

ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల అమెరికాలో పర్యటించారు. భారత్ -– అమెరికాలు రెండింటికీ ప్రయోజనకరమైన విధంగా ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేశామని, ఈ సువర్ణావకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిన బాధ్యత ఇక రెండు దేశాలకు చెందిన కార్పొరేట్ సారథులపైనే ఉందని మోదీ అన్నారు. జన జీవితంలో టెక్నాలజీ తెచ్చే మార్పులను గత 50 ఏండ్లలో చూసినదానికన్నా ఎక్కువగా వచ్చే పదేళ్లలో చూడనున్నామని ఆయన చెప్పారు. ప్రభుత్వపరంగా తొలగించాల్సిన ప్రతిబంధకాలు ఏమైనా ఉంటే తమ ఇద్దరి దృష్టికి తీసుకురావాల్సిందని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అన్నారు. భారతదేశ జనాభాలో ప్రస్తుతం యువత అత్యధికంగా ఉంది.

 మిగిలిన దేశాల్లో వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. కాబట్టి భారత్ తో కలిసిమెలిసి పనిచేసే ఏ దేశమైనా ప్రయోజనం పొందుతుందని మోదీ స్పష్టం చేశారు. ఇపుడు అందరినోట వినిపిస్తున్న పదం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ). ఏఐ అంటే, అమెరికా -ఇండియాలని కొత్త నిర్వచనం చెప్పడం ద్వారా మోదీ అందరినీ ఆకట్టుకున్నారు. ద ఫ్యూచర్ ఈజ్ ఏఐ. అమెరికా అండ్ ఇండియా అని ముద్రించిన టీ -షర్టును మోదీకి  బైడెన్ కానుకగా ఇచ్చారు. 

జెట్ఇంజన్ టెక్నాలజీ బదిలీ

ఇది యుద్ధ విమాన జెట్ ఇంజన్ టెక్నాలజీ బదలాయింపునకు సంబంధించినది. జనరల్ ఎలక్ట్రిక్ ఏవియేషన్(జి.ఇ) సంస్థ తన టెక్నాలజీని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్(హెచ్ఏఎల్)కు అందిస్తుంది. దీనికి సంబంధించిన ఒప్పందం ఒకటి 2012లోనే కుదిరింది. కానీ, అప్పట్లో టెక్నాలజీ బదలాయింపును అమెరికన్ ప్రభుత్వం 58 శాతానికి మాత్రమే పరిమితం చేసింది. ఇపుడు దాన్ని 80 శాతానికి పెంచింది. మనం తయారు చేస్తున్న తేలిక రకం యుద్ధ విమానాల్లో స్వదేశంలో తయారైన విడిభాగాలను, ఇతర పరికరాలను ఎక్కువగా అమర్చడానికి ఇది వీలు కల్పిస్తుంది. ఈ ఒప్పందం కింద జి.ఇకి చెందిన ఎఫ్ 414 ఐ.ఎన్.ఎస్6 ఇంజన్లు భారతదేశంలో తయారవుతాయి. ఈ రకమైన ఇంజన్ ఇండియాలో తయారవడానికి మరో మూడేండ్లు మాత్రమే పట్టవచ్చు.

 అణ్వాయుధాలు, క్షిపణులు, జలాంతర్గాములు, విమాన వాహక నౌకలు, యుద్ధ విమానాలకు సంబంధించిన కీలకమైన టెక్నాలజీలను మనమే అభివృద్ధిపరుచుకున్నాం. ఇప్పుడీ ఒప్పందంతో భారీ యుద్ధ విమానాల తయారీని కూడా మనం చేపట్టవచ్చు. ఇంత పెద్దయెత్తున టెక్నాలజీ బదలాయింపునకు ఏ దేశమైనా అంగీకరించడం ప్రపంచంలో ఇదే ప్రథమం. అలాగే, ఓపెన్ రేడియో యాక్సెస్ నెట్ వర్క్ ల అభివృద్ధికి టెక్నాలజీలను ఇచ్చిపుచ్చుకోవాలని, కలిసి పనిచేయాలని భారత్- – అమెరికాలు నిర్ణయించడంతో టెలికాం పరికరాల తయారీలో చైనా ఆధిపత్యానికి చెక్ పడనుంది.

మైక్రాన్ టెక్నాలజీ

ఇండియాలో తమ మొట్ట మొదటి సెమీకండక్టర్ కూర్పు, పరీక్ష, ప్యాకేజింగ్ సదుపాయ కేంద్రాన్ని నెలకొల్పనున్నట్లు మెక్రాన్ టెక్నాలజీ వెల్లడించింది. ఈ కేంద్రంపై 82 కోట్ల 50 లక్షల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు ఆ సంస్థ తెలిపింది. ఇది దాదాపు 5000 మందికి ఉద్యోగావకాశాలు కల్పించనుంది. దీనిలో డైనమిక్ ర్యాండమ్ యాక్సెస్ మెమొరీ చిప్ లు, ‘నండ్’ ఫ్లాష్ మాడ్యూళ్లు తయారవుతాయి. నండ్ అనే పదం నాట్ అండ్ అనే రెండు ఇంగ్లీషు పదాలకు సంక్షిప్త రూపం. 

మన దేశంలో చిప్ ల తయారీకి అనువైన వాతావరణాన్ని కల్పించడానికి కేంద్రం ఒక ప్రోత్సాహకర పథకాన్ని ప్రవేశపెట్టింది. దాన్ని అనుసరించి మైక్రాన్ ఈ పెట్టుబడికి సిద్ధమైంది. మైక్రాన్ ఈ కేంద్రాన్ని గుజరాత్ లో నెలకొల్పనుంది. భారత్ ను వచ్చే ఐదేళ్లలో చిప్ ల తయారీలో కేంద్ర స్థానంగా మలచాలని కేంద్రం భావిస్తోంది. మెమొరీ చిప్ ల తయారీలో ఈ సంస్థకు పేరుంది.

అప్లైడ్ మెటీరియల్స్

బెంగళూరులో నెలకొల్పే ఇంజనీరింగ్ కేంద్రంలో తన వంతుగా 40 కోట్ల అమెరికన్ డాలర్ల పెట్టుబడి పెట్టనున్నట్లు అప్లైడ్ మెటీరియల్స్ ప్రకటించింది. ఇక్కడ సెమీకండక్టర్ తయారీ పరికరాల టెక్నాలజీలను అభివృద్ధిపరచడం, వాటిని వాణిజ్య ప్రయోజనాలకు ఉపయోగించుకోవడంపై దృష్టి పెడతారు. ఇది 3000 మంది వరకు ఉద్యోగావకాశాలు కల్పిస్తుంది. ఈ కంపెనీ ఇప్పటికే భారతదేశంలో ఆరు కేంద్రాలను నిర్వహిస్తోంది. 

టెస్లా

ఎలక్ట్రిక్ కార్ల తయారీ సంస్థ టెస్లా భారతీయ మార్కెట్ లోకి ప్రవేశిస్తుందని దాని ఛీఫ్ ఎగ్జిక్యూటివ్ ఎలాన్ మస్క్ ప్రకటించారు. కాలయాపన చేయకుండా ఈ విషయంలో త్వరలోనే ఒక ప్రకటన చేయగలమని ఆశిస్తున్నామని మోదీతో సమావేశానంతరం మస్క్ ప్రకటించారు. బ్రాడ్ బ్యాండ్ ఇంటర్ నెట్ సర్వీస్ స్టార్ లింక్ ను కూడా ఇండియాకు తీసుకొచ్చే యోచనలో ఉన్నట్లు ఆయన చెప్పారు. ఇండియాలో ఇంటర్ నెట్ సదుపాయం లేని మారుమూల గ్రామాలకు లేదా ఇంటర్ నెట్ చాలా వ్యయదాయకంగా ఉన్న ప్రాంతాలకు, ఇంటర్ నెట్ ప్రస్తుతం చాలా స్లోగా ఉన్న గ్రామాలకు స్టార్ లింక్ సదుపాయాన్ని తీసుకెళతామని ఆయన చెప్పారు. 

స్పేస్ ఎక్స్, ట్విటర్ లకు కూడా ఆయన అధినేతగా ఉన్న సంగతి తెలిసిందే. బ్యాటరీతో నడిచే కార్ల తయారీలోకి వివిధ కంపెనీలు ప్రవేశించడం వల్ల వాటి ధరలు పోటీనిచ్చేవిగా మారవచ్చు. రీచార్జింగ్ సదుపాయాలు పెరగవచ్చు. ఆ విధంగా టెస్లా ప్రవేశం స్వాగతించదగిందే.

గూగుల్

గుజరాత్ లోని గాంధీనగర్ జిల్లాలో గుజరాత్ ఇంటర్నేషనల్ ఫినాన్స్ టెక్-సిటీ పేరుతో ఒక కేంద్ర వ్యాపార కార్యకలాపాల ప్రాంతం రూపుదిద్దుకుంటోంది. దీన్ని సంక్షిప్తంగా ‘గిఫ్ట్ సిటీ’  గా పిలుస్తున్నారు. కనీసం 35 ఫిన్ టెక్ సంస్థలకు, రెండు అంతర్జాతీయ స్టాక్ ఎక్స్చేంజీలకు ఇది నిలయం కానుంది. ఇక్కడ దైనందిన ట్రేడింగ్ పరిమాణం మూడు వేల కోట్ల అమెరికన్ డాలర్ల మేరకు ఉండగలదని అంచనా. ఇంటర్ నెట్ దిగ్గజం గూగుల్ ఆ సిటీలో తమ అంతర్జాతీయ ఫినాన్స్ కార్యకలాపాల నిర్వహణా కేంద్రాన్ని ఏర్పాటు చేస్తుందని గూగుల్ ప్రధాన కార్యనిర్వహణాధికారి సుందర్ పిచాయ్ వెల్లడించారు. ఇండియా డిజిటలైజేషన్ ఫండ్ పేరుతో వెయ్యి కోట్ల అమెరికన్ డాలర్లను ఇండియాలో పెట్టుబడులు పెట్టే తమ కార్యక్రమం కొనసాగుతుందని కూడా ఆయన చెప్పారు. ఇప్పటికే అమలులో ఉన్న ఆ కార్యక్రమంలో భాగంగా కృత్రిమ మేధ, సైబర్ సెక్యూరిటీ ఉత్పత్తులు, వాటి సేవలు, మొబైల్ ఫోన్ల తయారీ రంగాల్లో ఉన్న కంపెనీల్లోకి గూగుల్ పెట్టుబడులు ప్రవహించనున్నాయి. 

‘బాట్’ సౌలభ్యాన్ని మరిన్ని భారతీయ భాషల్లోకి తీసుకురానున్నట్లు పిచాయ్ తెలిపారు. సిస్టంలు లేదా యూజర్లతో ఇంటరాక్ట్ అయ్యే స్వయంచాలిత ప్రోగ్రాంను కంప్యూటర్ల పరిభాషలో ‘బాట్’ గా పిలుస్తున్నారు. యూజర్లు ఎంపిక చేసుకున్న డాటాబేస్ లో డాటాను నిక్షిప్తం చేసుకునేందుకు ఇది వీలు కల్పిస్తుంది. ప్రస్తుతం సంస్కృతంతో సహా ఎనిమిది భారతీయ భాషల అనువాద సౌలభ్యం గూగుల్ లో అందుబాటులో ఉంది. గూగుల్ సృష్టించే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏ.ఐ)యూట్యూబ్ వీడియోలలో  క్యాపన్లు సృష్టించడానికి ఉపయోగపడుతుంది. మన మాటలకు లిఖితరూపమిచ్చే సౌకర్యం కూడా ఇప్పటికే ఉంది. ఏకంగా 1000 భాషల్లో అలాంటి సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చే ఏ.ఐ నమూనాను అభివృద్ధి చేస్తున్నట్లు గూగుల్ 2022 నవంబర్ లో ప్రకటించింది. మొత్తానికి  ఇన్ ఫర్మేషన్ టెక్నాలజీకి పేరెన్నికగన్న భారతదేశానికి గూగుల్ చేపట్టే ఏ కార్యకలాపాలైనా తప్పక దోహదపడతాయి.

అమెజాన్

ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్  ఇండియాలో రూ.1500 కోట్ల అమెరికన్ డాలర్లను పెట్టుబడి పెట్టనున్నట్లు తెలిపింది. భారత్ లో  తమ పెట్టుబడులను 2030 నాటికి 26 బిలియన్ల అమెరికన్ డాలర్లకు చేర్చాలని అమెజాన్ సంకల్పించింది. ఈ ప్రక్రియ స్టార్టప్​లకు, ఎగుమతులకు ఆలంబనగా నిలవడానికి, ఉద్యోగాల కల్పనకు, చిన్నతరహా సంస్థలు అంతర్జాతీయంగా పోటీపడేందుకు, వ్యక్తులకు సాధికారత కల్పించడంలో సహాయపడుతుంది. భారత్ లో తమ సంస్థ  ప్రత్యక్షంగా, పరోక్షంగా ఇప్పటికే 10 లక్షల 30 వేల ఉద్యోగాలు సృష్టించిందని అమెజాన్ వెల్లడించింది. భారత్ లో 60 లక్షల 20 వేల చిన్న, మధ్యతరహా సంస్థలను డిజిటలీకరించినట్లు ఆ సంస్థ తెలిపింది. 

నరేంద్ర మోదీతో సమావేశమైనవారిలో అమెజాన్ ప్రధాన కార్యనిర్వహణాధికారి యాండీ జెస్సీ కూడా ఉన్నారు. పెరుగుతున్న కస్టమర్ల డిమాండ్ ను తట్టుకునేందుకు వీలుగా అమెజాన్ పెట్టుబడుల్లో12.7 బిలియన్ డాలర్లు క్లౌడ్ ఇన్ ఫ్రాస్ట్రక్చర్ లోకి రానున్నాయి. లాజిస్టిక్స్ రంగంలో భారత్- అమెరికాలు కలిసి పనిచేయడానికి ఉన్న అవకాశాల గురించి మోదీ -జెస్సీలు చర్చించుకున్నారని ఆ సంస్థ వెల్లడించింది. 

కళాఖండాల అప్పగింత

చట్టబద్ధంగా, చట్టవిరుద్ధంగా అమెరికా చేరిన వాటిలో100కు పైగా ప్రాచీన కళా వస్తువులను భారతదేశానికి తిరిగి అప్పగించనున్నట్లు అమెరికా ప్రకటించింది. 

డ్రోన్ల కొనుగోలు

ఎంక్యూ-9బీ రకం డ్రోన్లు 31 కావాలంటూ భారత్ ఈ జులై మొదటి వారంలో అమెరికా ప్రభుత్వానికి అభ్యర్థన లేఖ పంపనుంది. మోదీ అమెరికా పర్యటనలో వీటి కొనుగోలు ఖరారైంది. ఇందులో ‘ఎం’ అనే అక్షరం బహుళ పాత్రలను నిర్వహించగలదని సూచిస్తుంది. ‘క్యూ’ అనే అక్షరం భూమి నుంచి రిమోట్ కంట్రోల్ చేస్తే నడిచే వైమానిక వ్యవస్థ అనే అర్థాన్ని సూచిస్తుంది. తొమ్మిది అనే సంఖ్య వాటి తయారీ శ్రేణిలో ఇది తొమ్మిదో రకానికి చెందినదని చెబుతోందన్నమాట. భారత్ వీటి కోసం దాదాపుగా రూ. 29 వేల కోట్లు వెచ్చించనుంది. వీటికి వేటాడి “హత మార్చేవి” గా పేరుంది. వీటిని ఎం.క్యూ-9బీ రీపర్, ప్రిడేటర్-బి డ్రోన్లుగా కూడా పిలుస్తారు. ఇవి నలభై వేల అడుగుల ఎత్తున దాదాపు 40 గంటలపాటు సంచరించగలవు. ఇవి నిఘా పనులను చక్కబెట్టడమే కాదు, ఆయుధాలను కూడా ప్రయోగించగలవు. క్షిపణులు, స్మార్టు బాంబులతో సునిశితమైన దాడులు చేయగలవు. 

శత్రు లక్ష్యాలపై దాడి చేసిన తర్వాత, తమ స్థావరాలకు తిరిగి వచ్చి, తిరిగి ఆయుధాలు అమర్చుకువి మరో విడత దాడికి వెళ్లగలవు.  చైనా దగ్గరున్న, అది పాకిస్తాన్ కు కూడా సరఫరా చేస్తున్న కాయ్ హొ-4, వింగ్ లాంగ్-2 డ్రోన్ల కన్నా కూడా మెరుగైనవి. అమెరికా ఇచ్చే డ్రోన్లు అత్యంత ఎత్తులో వెళ్లగలిగినవిగా, ఎక్కువ గంటలు సంచరించగలిగినవిగా రెండు రకాలవి. వీటిని తయారు చేసే గ్లోబల్ ఆటమిక్స్ అనే సంస్థ విడి భాగాలను తెచ్చి ఇండియాలోనే వాటిని అమర్చనుంది. వీటి కోసం అది ఇండియాలో మెయింటెనెన్స్, మరమ్మతుల కేంద్రాన్ని నెలకొల్పనుంది. ఈ సదుపాయం ఆస్ట్రేలియా, జపాన్ ల వంటి ఇతర దేశాల అవసరాలను కూడా తీరుస్తుంది. మొత్తానికి, భారత నౌకాదళానికి15 సీ గార్డియన్లు(డ్రోన్లు), పదాతి దళానికి, వైమానిక దళానికి చెరి ఎనిమిది స్కై గార్డియన్లు(డ్రోన్లు) సమకూరనున్నాయి. 

వాటికి అవసరమైన మొబైల్ గ్రౌండ్ కంట్రోల్ సిస్టంలు, ఆయుధాలు, ఇతర పరికరాలు కూడా రానున్నాయి. మున్ముందు వీటిని తయారు చేసుకునే సామర్థ్యాన్ని భారత రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీవో)కు కల్పించడం కూడా ఒప్పందంలో భాగం కానుంది. చైనా, పాకిస్తాన్ లతో ఉన్న సరిహద్దులతోపాటు, హిందూ మహా సముద్రంలో కూడా ఇవి మనకు ఉపయోగపడనున్నాయి. అన్నీ అనుకున్నట్లు సాగితే వచ్చే ఒకటి రెండేళ్లలోనే భారతదేశానికి 10 ఎంక్యూ-9బి డ్రోన్లు అందవచ్చు. భారత్- – అమెరికాల మధ్య మైత్రి కొత్త చిగుళ్లు తొడిగిందనడానికి, మోడీ పర్యటన ఫలితాలు ఇచ్చింది అనడానికి ఈ నిదర్శనాలు చాలవా? 

‘నాసా’ తో ఒప్పందం

అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ (నాసా)తో ఆర్టిమిస్ ఎకార్డ్స్ ఒప్పందంపై భారత్ సంతకాలు చేసింది. చంద్రుడిపైకి మరోసారి 2025 నాటికి మానవ సహిత అంతరిక్ష నౌకలను పంపాలని అమెరికా సంకల్పించింది. ఆ విషయంలో ఇతర దేశాల సహాయాన్ని కూడా తీసుకునేందుకు వీలుకల్పించే బహుళపక్ష ఒప్పందం ఇది. ఇస్రో సహకారాన్ని ‘నాసా’ తీసుకోనుంది. వచ్చే ఏడాది ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్ (ఐఎస్ఎస్)కు వెళ్లే అంతరిక్ష నౌకలో భారతీయ వ్యోమగామికి చోటు దక్కే అవకాశం ఉంది. 

గగన్ యాన్ పేరుతో చంద్రుడి మీదకు మానవ సహిత అంతరిక్ష నౌకను పంపాలని ఇస్రో లక్ష్యంగా పెట్టుకుంది. వ్యోమగాముల తర్ఫీదు కూడా సాగుతోంది. వారిలో ఒకరన్నా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లొస్తే, చంద్రయాత్రకు మరింతగా సిద్ధమైనట్లు అవుతుంది. ఆర్టిమిస్ పై సంతకం చేసిన 27వ దేశంగా భారత్ అవతరించింది. సురక్షితంగా, పారదర్శకంగా అంతరిక్ష పరిశోధనలు నిర్వహిస్తామనే నిబద్ధతను ఈ ఒప్పందం తెలియజేస్తుంది. 

వీసాల వెసులుబాటు

హెచ్-1బీ వీసాల రెన్యువల్ కు అమెరికాలో ఉంటున్న భారతీయులు ఇకపై ఆ దేశం విడిచి రానవసరం లేదు. హెచ్-1బీతోపాటు ఎల్ వీసాను కూడా అమెరికాలోనే పొందవచ్చు. బెంగళూరు, అహ్మదాబాద్ లలో కూడా కొత్త కాన్సులేట్ కార్యాలయాలను తెరవనున్నట్లు అమెరికా ప్రకటించింది. కిందటేడాది రికార్డు స్థాయిలో 1,25,000 మంది భారతీయ విద్యార్థులకు వీసాలు మంజూరు చేసినట్లు అమెరికా వెల్లడించింది.

విద్య, పరిశోధన లపైనా  దృష్టి

విద్య, పరిశోధన రంగాల్లోనూ రెండు దేశాలు సహకారాన్ని మరింతగా పెంపొందించుకోవాలని నిర్ణయించాయి. భారత్- అమెరికా భవిష్యత్తు నిమిత్తం నిపుణులను తీర్చిదిద్దుకోవడం పేరుతో అవి ఒక ఐదు సూత్రాల ప్రణాళికను రూపొందించుకున్నాయి.

- మల్లంపల్లి ధూర్జటి,సీనియర్​ జర్నలిస్ట్