మైండ్‌‌ గేమ్‌‌లో మాటలే మంత్రాలు

మైండ్‌‌ గేమ్‌‌లో మాటలే మంత్రాలు

బీజేపీకి దాని సరికొత్త నినాదాలు,  ప్రచార వ్యూహాలే  ఎక్కువమార్లు బలమైనపుడు, అప్పుడప్పుడైనా అవి బలహీనతలు కాకుండా పోవు.  ఇది ప్రకృతి సహజం.  నాలుగు విడతల పోలింగ్‌‌ తర్వాత పార్టీ నాయకత్వం అకస్మాత్తుగా గొంతు మార్చడం ఇదే సంకేతాన్నిచ్చింది. తన బలహీనతను బీజేపీ నాయకత్వం గుర్తించిందా? లేక,  బీజేపీ దుందుడుకు వ్యవహారమే పార్టీ గెలుపు అవకాశాలను బలహీనపరిచిందా? దేశంలో హిందువులు- ముస్లింలను వేర్వేరుగా చూడటం తన ఉద్దేశం కాదన్న పార్టీ అగ్రనేత, ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలు.. దేనికి సంకేతమనే చర్చ జోరుగా సాగుతోంది.  ఢిల్లీ సీఎం అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌ బెయిల్‌‌ విషయంలో సుప్రీంకోర్టుపై  కేంద్ర హోం మంత్రి  అమిత్‌‌షా చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదమౌతున్నాయి.

ఒక్కో దశ ముగుస్తున్నకొద్దీ... అతివిశ్వాసం నుంచి ‘ఎన్డీయే’ అడుగులు ఆత్మరక్షణ వైపు పడుతుంటే, డోలాయమానంలో మొదలైన ‘ఇండియా’ నడక  కొత్త విశ్వాసం వైపు సాగుతోంది.
‘ఈసారి 400పై గురి’ అంటూ మానసిక దాడితో ఎన్నికల యుద్ధ ప్రకటన చేసిన బీజేపీ, విడత విడతకో  ప్రచార వ్యూహ పంథా అనుసరిస్తోంది. మరో మూడు విడతల పోలింగ్‌‌ బాకీ ఉన్న తరుణంలో ఉన్నట్టుండి గొంతు మార్చి ముస్లింలను  తామెప్పుడూ వేరుగా చూడలేదనే పల్లవి అందుకుంది. ‘ఈ దేశంలో ముస్లింలు, -హిందువుల మధ్య వ్యత్యాసం చూపితే నేనసలు రాజకీయాలకే అనర్హుడిన’నీ  ప్రధాని ఉద్వేగానికి గురై  ప్రసంగించారు. వారణాసిలో తాను నామినేషన్‌‌ దాఖలు చేసిన తర్వాత, అయిదో అంకం ముందర  ప్రసంగంలోని మాటలివి! అంతకుముందు మూడు విడతల్లో మాట్లాడినదానికి ఇది పూర్తి విరుద్ధం!  మొదటి విడతలో లేని ముస్లిం రిజర్వేషన్‌‌ వ్యతిరేక ప్రచార వాదం,  రెండో విడత నాటికి ప్రస్ఫుటంగా తెరపైకి వచ్చింది.  పోలింగ్‌‌ ఆయా విడతల్లో ఉన్న రాష్ట్రాలు, -ప్రాంతాలు, సీట్లను బట్టి అక్కడుండే సామాజిక సమీకరణాలు, పరిస్థితులు, ప్రాధాన్యతల ప్రకారం ప్రచార వ్యూహాలను పార్టీ నాయకత్వం మారుస్తూ వస్తోంది. అందులో భాగంగానే..రాజ్యాంగ అంశాలను, రిజర్వేషన్లను, దళితులు, -ముస్లింల ప్రాధాన్యతలను తరచూ మార్చటాన్ని దేశ ప్రజలు గమనిస్తూనే ఉన్నారు.  అందరి సంపదను కాంగ్రెస్‌‌ పార్టీ ముస్లింలకు దోచిపెట్టడానికి యత్నిస్తోందనే అర్థం వచ్చేలా మాట్లాడిన ఆయన, తాను ఉద్దేశించింది ముస్లింలను కాదని ఇప్పుడు వివరణ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ‘పొరుగుదేశాల నుంచి వచ్చినవాళ్లు’,  ‘ఎక్కువ సంతానం కనే వారు’  అని తానంటే దాని ఉద్దేశ్యం ముస్లింలనే అన్నానని ఎలా చెబుతారు? అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బడుగు-,  బలహీనవర్గాల రిజర్వేషన్లను తొలగించి, వాటిని ముస్లింలకు బదలాయించాలని కాంగ్రెస్‌‌ చెబుతోందని అన్నది ఆయనే!  మతం ప్రాతిపదికన రిజర్వేషన్లు ఉండొద్దంటూ, ముస్లిం రిజర్వేషన్లను తొలగిస్తామని, వాటిని ఇతర దళిత,  బలహీన వర్గాలకు వర్తింపజేస్తామనీ అన్నది వాళ్లే!  ఇప్పటికిప్పుడు  ఏ రాజకీయ ప్రయోజనాలనాశించి గొంతు మార్చారు? అన్నదీ  చర్చకు వస్తోంది.  ఇవన్నీ ప్రచార వ్యూహాల్లో భాగమే!

సంఖ్య పెరిగేనా? తగ్గేనా?

కిందటిసారి ఎన్నికల్లో  బీజేపీ  సొంతంగానే 303 స్థానాలు నెగ్గింది.  మిత్రులతో  కలిసి 353తో  ఎన్డీయే ప్రభుత్వాన్ని ఏర్పరచింది. ఈసారి  సొంతంగా 370 స్థానాలు గెలవాలని,  కూటమి 400 దాటాలనేది బీజేపీ నాయకత్వం లక్ష్యంగా ప్రకటించింది. 2019 ఎన్నికల్లో  గెలుచుకున్న స్థానాలు, ఇతరేతర అంశాల్ని పరిగణనలోకి తీసుకున్న తర్వాత.. కిందటిసారి కన్నా సీట్లు తగ్గే ఆస్కారం ఉందన్న గ్రహింపు  మీదటే ‘400’ మైండ్‌‌గేమ్‌‌  మొదలయిందని రాజకీయ పండితులంటారు.  పశ్చిమ, ఉత్తర భారతంలోని చాలా రాష్ట్రాల్లో  పూర్తి సంఖ్య ఎంపీ స్థానాలు బీజేపీ/మిత్ర పక్షాలకే ఉన్నాయి. తర్వాత మార్పుల వల్ల ఆయా రాష్ట్రాల్లో తగ్గడమే తప్ప పెరిగే పరిస్థితి లేదు.  ఆ లోటును దక్షిణాది, తూర్పు రాష్ట్రాల్లో  పూడ్చుకొని కొత్తగా ఇంకెక్కడైనా ఆధిపత్యం సాధిస్తే తప్ప సంఖ్య పెరగదు. దీనికి తోడు, ‘భారత్‌‌ జోడో’ ‘న్యాయయాత్ర’ అంటూ కాంగ్రెస్‌‌ అగ్రనేత రాహుల్‌‌ గాంధీ జరిపిన రెండు యాత్రల తర్వాత కాంగ్రెస్‌‌ సంస్థాగతంగా, జనాదరణ పరంగా బలపడిందన్నది బీజేపీ గ్రహించింది. అయోధ్య రామ మందిర నిర్మాణం వంటి కొన్ని కార్యక్రమాలు పార్టీకి పేరు తెచ్చినా  నిరుద్యోగిత,  ద్రవ్యోల్బణం వల్ల పెరిగిన నిత్యావసరాల ధరలు కొంప ముంచుతాయని పార్టీ  వ్యూహకర్తలకు తెలుసు!  అందుకే ప్రత్యామ్నాయ వ్యూహాలవైపు మళ్లారు. ఎన్నికల విడతకో విధానం, తడవకొక వ్యూహంతో ప్రచార సరళి మారుస్తూ ఆకట్టుకునే యత్నం చేస్తున్నారు.  తేడాలు వచ్చి ఎప్పుడో దూరమైన అకాలీదళ్‌‌,  జేడీయూ,  జేడీఎస్‌‌,  టీడీపీ వంటి పాత మిత్రుల్ని వెతుక్కుంటూ వెళ్లి నయానో, భయానో కూటమిలోకి తెచ్చుకున్నారు. కిందటిసారి కన్నా సంఖ్య తగ్గకుండా చూసుకుంటే చాలన్న  అవగాహన కొచ్చినట్టు దీంతో స్పష్టమౌతోంది.

విడతకో విన్యాసం

మిగిలిన మూడు విడతల్లో 163 స్థానాలున్నాయి.  ఇందులో  గట్టి  మెజారిటీ  సాధిస్తే తప్ప ఆశించిన ఆధిపత్యం దొరకదని బీజేపీ అధినాయకత్వానికి తెలుసు.  పోలింగ్‌‌ జరిగిన నాలుగు విడతలకూ వైవిధ్యభరితమైన లక్షణాలున్నాయి.  దేశంలోని  అయిదో వంతు స్థానాలున్న తొలివిడతలో ఇండియా కూటమి పైచేయి సాధించే ఆస్కారం ఉంది. 2019లో సమాన సంఖ్యలో (49) స్థానాలు నెగ్గిన పరిస్థితి! ఈసారి ఉత్తరప్రదేశ్‌‌,  తమిళనాడులో కొంత ఇబ్బందులెదురైనా మధ్యప్రదేశ్‌‌, రాజస్తాన్‌‌లో ఇండియా కూటమి సానుకూలతకు ఆస్కారం ఉంది. ఇక, రెండో విడత పోలింగ్‌‌ జరిగిన స్థానాలు 87కి గాను కిందటి ఎన్నికల్లో 62 ఎన్డీయేకి  దక్కాయి. 2019 తర్వాత పరిణామాల్లో ఎన్డీయే కాస్త బలహీనపడితే, ఇండియా పక్షాలు బలపడ్డాయి.  ఈ రెండు విడతల్లో కనీసం 20 స్థానాలను ఎన్డీయే కోల్పోవచ్చని సీఎస్‌‌డీఎస్‌‌ సర్వే గణాంకాలను విశ్లేషించే యోగేంద్ర యాదవ్‌‌ అంచనా వేస్తున్నారు. 3వ విడత పోలింగ్‌‌ జరిగిన 93 (నిజానికి 94) కానీ,  సూరత్‌‌ స్థానం ఎన్నిక అవసరం లేకుండా ఎన్డీయేకు అనుకూలంగా ఏకగ్రీవం అయింది.  ఈ స్థానాల్లో కిందటి సారి 80 స్థానాలు ఎన్డీయేకే దక్కాయి. ఇవి, పదింట ఎనిమిది బీజేపీ పాలిత రాష్ట్రాల్లోనే ఉన్నాయి. ఇందులో కీలకం కర్నాటక. అక్కడ తరుగుదల ఖాయం!  ఈ విడత సంఖ్యలో నుంచి, అధమపక్షం 20 స్థానాలను ఎన్డీయే కూటమి ఈసారి కోల్పోవాల్సి రావచ్చన్నది యోగేంద్ర యాదవ్‌‌ అంచనా! సోమవారం పోలింగ్‌‌ జరిగిన నాలుగో  విడత స్థానాల్లో పోటీ నువ్వా-..నేనా అన్నట్టు ఉంటుంది కనుక,  పాలకపక్షం రాబోయే మూడు విడతలపై ఎక్కువగా ఆధారపడుతోంది. నాలుగో విడతలోనే  రెండు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌‌తో పాటు ఒరిస్సాలోని  కొన్ని స్థానాలున్నాయి.  బీజేపీ  ఇక్కడ  ఎక్కువ ఆశలు పెంచుకుంది.  వివిధ విడతల పోలింగ్‌‌ ప్రక్రియ ముగుస్తూ ప్రయాణం జూన్‌‌ 4 వైపు సాగుతున్న క్రమంలో దేశమంతటా ఉత్కంఠ పెరుగుతోంది.

మధ్యలో డీలా పడ్డ ‘ఇండియా’

పదేండ్లుగా  ప్రభుత్వంలో ఉన్న ఎన్డీయేకు వ్యతిరేకంగా ‘ఇండియా’ కూటమి తొలుత దృఢంగానే  మొదలైనా మధ్యలో  డీలా ప‌‌డింది.  కూటమికి పేరు పెట్టడానికి ముందు, తర్వాత  కూడా ఒకడుగు ముందుకు, రెండడుగులు వెనక్కి అన్న చందంగా సాగింది ‘ఇండియా’ ప్రయాణం.  పాట్నాలో మొదలై, బెంగళూరులో బలపడి, ముంబైలో సమావేశం నాటికి విపక్ష సయోధ్య పతాకస్థాయికి చేరింది.  ‘ఒక వేదిక, ఒక ఎజెండాతో సాగడమే కాకుండా విపక్షాల తరఫున,  లోక్‌‌సభ ఒక్కో స్థానంలో ఒకే (ఉమ్మడి) అభ్యర్థి ఉండేలా పాలకపక్షానికి గట్టి పోటీ ఇవ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయించారు.  తర్వాత ఏమైందో.. వైరుధ్యాలు పెరిగాయి.  కన్వీనర్‌‌  ఎవరనే  విషయంలో కొంత  పొరపొచ్ఛాలు పొడచూపాయి. మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌‌ దారుణమైన ఓటమి, బిహార్​ ముఖ్యమంత్రి నితీశ్‌‌ కుమార్‌‌  కూటమిని వీడి ఎన్డీయే పంచన చేరి, అక్కడ్నుంచి సీఎం అవటం.. వంటివన్నీ చకచకా జరిగిపోయాయి. గ్యాప్‌‌ పెరిగింది.  ఒక దశలో,  ఎవరికివారు విడిగా పోటీ చేస్తామని ప్రకటించే దాకా వెళ్లారు. అరవింద్‌‌ కేజ్రీవాల్‌‌, అఖిలేశ్​యాదవ్‌‌,  మమతా బెనర్జీ తదితరులు ఆ మేరకు ప్రకటనలూ చేశారు.  తర్వాత కొన్ని రోజుల్లోనే  మళ్లీ  సయోధ్య యత్నాలు మొదలయ్యాయి. తాము అధికారంలోకి రావాలంటే, ముందు ఎన్డీయేను  గద్దె దించాలి, అది జరగాలంటే ఐక్యంగా వారినెదుర్కోవాలి అనే లాజిక్‌‌ అర్థమై, ఒక అనివార్యత తెలిసొచ్చాక  సర్దుకున్నారు. ఒక్కో  విడత  ఎన్నికల ప్రక్రియ పూర్తవుతుంటే, ఈ విపక్ష కూటమి క్రమంగా బలపడుతున్నట్టు కనిపిస్తోంది.

- దిలీప్‌‌‌‌‌‌‌‌రెడ్డి, పొలిటికల్‌‌‌‌‌‌‌‌ అనలిస్ట్‌‌‌‌‌‌‌‌, పీపుల్స్‌‌‌‌‌‌‌‌పల్స్‌‌‌‌‌‌‌‌ రీసెర్చ్‌‌‌‌‌‌‌‌ సంస్థ