రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం

రామోజీరావు మృతికి ప్రముఖుల సంతాపం

రామోజీ గ్రూప్ సంస్థల ఛైర్మన్ రామోజీరావు మృతిపట్ల పలువురు సినీ, రాజకీయ ప్రముఖు సంతాపం తెలిపారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, సీఎం రేవంత్, వెంకయ్యనాయుడు, కిషన్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్,  పవన్ కళ్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, సంతాపం తెలిపారు. గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న రామోజీరావు  ఇవాళ ఉదయం ఆస్పత్రిలో కన్నుమూసిన సంగతి తెలిసిందే..

ప్రధాని మోదీ

రామోజీ రావు గారు మరణించడం చాలా బాధాకరం. అతను భారతీయ మీడియాను విప్లవాత్మకంగా మార్చిన దార్శనికుడు. అతని గొప్ప రచనలు జర్నలిజం, చలనచిత్ర పరిశ్రమ,మీడియాపై చెరగని ముద్ర వేసాయి. రామోజీ రావు భారతదేశ అభివృద్ధి పట్ల చాలా మక్కువ చూపేవారు. రామోజీరావుతో మాట్లాడే అకాశం ఎన్నో సార్లు దక్కింది.మీడియా రంగంలో, సినీ రంగంలో  రామోజీ సేవలు మరువలేనివన్నారు ప్రధాని మోదీ.     ఆయన కుటుంబ సభ్యులకు  తన  ప్రగాఢసానుభూతి అని మోదీ ట్వీట్ చేశారు.

చంద్రబాబు

 రామోజీ మరణం తనను తీవ్ర ఆవేదనకు గురిచేసిందన్నారు చంద్రబాబు. తిరిగి కోలుకుంటారని అనుకున్నా కానీ..ఇంతలోనే ఇలాంటి వార్త వినాల్సి వస్తుందనుకోలేదన్నారు. రామోజీ మరణం రాష్ట్రానికే కాదు దేశానికి తీరని లోటన్నారు.

సీఎం రేవంత్

 తెలుగు జర్నలిజానికి విశ్వసనీయత అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. మీడియా రంగానికి ఆయన చేసిన సేవలు మరువలేనివన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరారు. 

కేసీఆర్

ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్ రామోజీ రావు మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం ప్రకటించారు.  పలు రంగాల్లో వ్యాపారవేత్తగా, మీడియా సంస్థల వ్యస్థాపకుడిగా వారందించిన సేవలను కేసీఆర్ స్మరించుకున్నారు. శోక తప్తులైన వారి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు

చిరంజీవి

ఎవ్వరికీ తలవంచని మేరు పర్వతం దివి కేగింది..ఓం శాంతి అని చిరంజీవి ట్వీట్ చేశారు.

పవన్ కళ్యాణ్

అక్షరయోధుడు రామోజీరావు తుదిశ్వాస విడిచారని తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా. ఆయన స్థాపించిన ఈనాడు పత్రిక భారతీయ పత్రికా రంగంలో పెను సంచలనమే. అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు. రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ను వేదికగా చేశారు. ఆయన కుటుంబానికి నా తరఫున, జనసేన తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను అని అన్నారు పవన్.

 జూ.ఎన్టీఆర్

 రామోజీ రావు  లాంటి దార్శనీకులు  నూటికో కోటికో ఒకరు. మీడియా సామ్రాజ్యాధినేత , భారతీయ సినిమా దిగ్గజం అయినటువంటి ఆయన లేని లోటు ఎప్పటికీ పూడ్చలేనటువంటిది. ఆయన మన మధ్యన ఇక లేరు అనే వార్త చాలా బాధాకరం. ‘నిన్ను చూడాలని’ చిత్రంతో నన్ను తెలుగు సినీ పరిశ్రమకి పరిచయం చేసినప్పటి జ్ఞాపకాలు ఎప్పటికి మరువలేను. ఆ మహనీయుడి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ, వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

వెంకయ్యనాయుడు

మీడియా దిగ్గజం రామోజీరావుకు మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య  నాయుడు సంతాపం తెలిపారు ‘రామోజీ రావు వ్యక్తి కాదు, శక్తివంతమైన వ్యవస్థ. వ్యక్తిగా మొదలై వ్యవస్థగా ఎదిగిన వారి జీవితం నుంచి యువతరం నేర్చుకోవాల్సిన పాఠాలు ఎన్నో ఉన్నాయి. తెలుగు వారందరికీ రామోజీరావు గర్వకారణం’ అని వెంకయ్య నాయుడు Xలో పోస్ట్ చేశారు. 

కిషన్ రెడ్డి

రామోజీ మీడియా రంగానికి చేసిన సేవలు మరవలేనివన్నారు కిషన్ రెడ్డి. ఆయన మరణం తీవ్ర విషాదానికి గురిచేసిందన్నారు. రామోజీ కుటుంబానికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.