
Elon Musk: ప్రధాని నరేంద్ర మోదీ టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్ మధ్య కీలక ఫోన్‌కాల్ సంభాషణ జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు టెక్నాలజీ రంగంలో ఉన్న అపారమైన అవకాశాలను అందిపుచ్చుకునేందుకు కలిసి పనిచేయాలని నిర్ణయించారు. ఈ ఏడాది ప్రారంభంలో అమెరికా పర్యటన సమయంలో తాము అనేక అంశాలపై చర్చించామని అయితే ప్రస్తుతం అనేక ఇతర అంశాలపై కూడా మాటలు జరిగాని ప్రధాని మోదీ తన ఎక్స్ ఖాతాలో వెల్లడించారు.
ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రధాని మోదీ తన అమెరికా పర్యటన సమయంలో వాషింగ్టన్ డీసీలో మస్క్ ను కలిశారు. ఆ సమయంలో మస్క్ పిల్లలకు ప్రధాని కొన్ని స్పెషల్ గిఫ్ట్స్ కూడా అందించిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం మస్క్ కంపెనీలైన టెస్లా, స్టార్ లింక్ తమ వ్యాపారాలను భారత మార్కెట్లోకి వస్తున్న వేళ ఈ చర్చలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఈ క్రమంలో టెస్లా తన భారతీయ ప్లాంట్ ఏర్పాటు గురించి భారత ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నట్లు ఇటీవల వార్తల్లో వచ్చిన సంగతి తెలిసిందే.
Also Read:-రూ.10 లక్షల బడ్జెట్లో బెస్ట్ సేఫ్టీ కారు కావాలా..?
అనేక సంవత్సరాలుగా స్టార్ లింక్ ఎంట్రీకి భారత నిబంధనలు ప్రతికూలంగా ఉండటంతో పాటు దేశీయ టెలికాం కంపెనీల లాబీయింగ్ అవాంతరాలుగా మారాయి. కానీ ట్రంప్ గెలుపు తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి. దీంతో గత నెల టెలికాం దిగ్గజాలైన రిలయన్స్ జియో, ఎయిర్ టెల్ మస్క్ కంపెనీతో డీల్స్ కుదుర్చుకున్నాయి. అలాగే స్పేస్ ఎక్స్ కంపెనీతో కూడా ఎయిర్ టెల్ ఒప్పందం చేసుకోవటం గమనార్హం.
ప్రస్తుతం ఇండియా అమెరికా సంస్థలతో కలిసి ఆవిష్కరణ, అంతరిక్ష అన్వేషణ, ఏఐ, అడ్వాన్స్డ్ టెక్నాలజీ వంటి రంగాల్లో కలిసి పనిచేసేందుకు చర్చలు మార్గం సుగమం చేస్తున్నాయి. ఈ ఏడాదికి ముందు ప్రధాని మోదీ మస్క్ 2015లో క్యాలిఫోర్నియాలో, 2023లో న్యూయార్క్ లో కలిశారు. మరిన్ని రంగాల్లో ఉన్న అవకాశాలను అందిపుచ్చుకోవటానికి ఉన్న అవకాశాలను రెండు దేశాలు అన్వేషించటం గురించి ప్రధానంగా చర్చలు కొనసాగినట్లు అప్పట్లో విదేశాంగ శాఖ కూడా స్పష్టం చేసింది.