- అక్టోబర్ 31న ప్రారంభిస్తున్నం: ప్రధాని మోదీ
- బైభారత్ వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాలని పిలుపు
సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ‘మేరా యువ భారత్’ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని మోదీ ఆదివారం మన్‌కీ బాత్‌లో ప్రకటించారు.
న్యూఢిల్లీ: సర్దార్ వలభ్ భాయ్ పటేల్ జయంతి సందర్భంగా అక్టోబర్ 31న ‘మేరా యువ భారత్’ ప్లాట్‌ఫామ్‌ను ప్రారంభించనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. జాతి నిర్మాణ కార్యక్రమాల్లో చురుకైన పాత్ర పోషించే అవకాశాన్ని యువతకు కల్పించేందుకు ఈ కొత్త వేదికను తీసుకొస్తున్నట్లు తెలిపారు. ఆదివారం ‘మన్ కీ బాత్’ రేడియో కార్యక్రమంలో ప్రధాని మాట్లాడారు. మేరా యువ భారత్ వెబ్‌సైట్‌ను ప్రారంభించనున్నామని చెప్పారు. MYBharat.Gov.inలో రిజిస్టర్ చేసుకోవాలని యువతకు సూచించారు. అభివృద్ధి చెందిన ఇండియాను నిర్మించడంలో భాగంగా.. దేశ యువత శక్తిని ఒక్కచోటుకు చేర్చేందుకు ఈ వినూత్న ప్రయత్నం చేపట్టామని అన్నారు. ‘ఓకల్ ఫర్ లోకల్’ అంశాన్ని మరోసారి మోదీ ప్రస్తావించారు. పండుగల సమయంలో లోకల్ ఉత్పత్తులనే కొనాలని దేశ ప్రజలను కోరారు. టూర్లకు లేదా తీర్థయాత్రలకు వెళ్లినప్పుడు స్థానిక కళాకారులు రూపొందించిన వాటినే కొనాలని విజ్ఞప్తి చేశారు.
ఇండియా.. అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్
‘‘ప్రపంచంలోనే అతిపెద్ద మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌గా ఇండియా మారుతున్నది. ఎన్నో పెద్ద బ్రాండ్లు తమ ప్రొడక్టులను ఇక్కడ తయారు చేస్తున్నాయి. మనం ఈ ఉత్పత్తులను అడాప్ట్ చేసుకుంటే.. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటేవ్‌కు పూర్తి ప్రయోజనం కలుగుతుంది” అని ప్రధాని అన్నారు.
అమృత్ వాటిక.. గొప్ప వారసత్వంగా నిలుస్తది
దేశవ్యాప్తంగా ఉన్న ప్రాంతాల్లో మట్టిని సేకరించేందుకు చేపట్టిన అమృత్ కలశ్ యాత్రలు ఇప్పుడు ఢిల్లీకి చేరుకుంటున్నాయని, సేకరించిన మట్టితో అమృత్ వాటికను నిర్మిస్తామని చెప్పారు. ‘‘దేశ రాజధాని నడిబొడ్డున నిర్మించే అమృత్ వాటిక.. అమృత్ మహోత్సవ్‌కు గొప్ప వారసత్వంగా మిగిలిపోతుంది. దేశవ్యాప్తంగా రెండున్నరేండ్లుగా జరుగుతున్న ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ అక్టోబర్ 31తో ముగియనుంది” అని వివరించారు.
రాంజీ గోండు, అల్లూరిల ప్రస్తావన..
గిరిజన సమాజానికి స్ఫూర్తినిచ్చిన ఆదివాసీ వీరుల గురించి ఈ తరం యువత తెలుసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రతి ఒక్కరూ వారి నుంచి స్ఫూర్తి పొందాలని సూచించారు. తెలంగాణ, ఏపీ, చత్తీస్‌గఢ్‌తో పాటు దేశవ్యాప్తంగా బ్రిటిష్ పాలన, సమానత్వం కోసం పోరాడిన గిరిజన వీరుల గురించి మన్ కీ బాత్‌లో ప్రధాని ప్రస్తావించారు. తెలంగాణలోని నిర్మల్, ఉట్నూరు, చెన్నూరు, ఆసిఫాబాద్ ప్రాంతాలు పరిపాలించిన బ్రిటిష్ వాళ్లకు వ్యతిరేకంగా పోరాడి ప్రాణాలర్పించిన రాంజీ గోండు వీర చరిత్రను మన్ కీ బాత్‌లో ప్రస్తావించారు. గిరిజన ప్రజల్లో అల్లూరి సీతారామ రాజు నింపిన స్ఫూర్తిని దేశం ఇప్పటికీ గుర్తుంచుకుందని చెప్పారు.