సింగపూర్​లో ప్రధాని మోదీ

సింగపూర్​లో ప్రధాని మోదీ
  •    చాంగీ ఎయిర్​పోర్టులో ఘన స్వాగతం
  •     నేడు ప్రెసిడెంట్, మంత్రులతో భేటీ
  •     కీలక రంగాలపై ద్వైపాక్షిక చర్చలు
  •     బ్రూనై పర్యటన కంప్లీట్..పలు సెక్టార్లలో ఒప్పందాలు

న్యూఢిల్లీ : విదేశీ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. బుధవారం బ్రూనై నుంచి బయల్దేరి సింగపూర్ చేరుకున్నారు. చాంగీ విమానాశ్రయంలో ఆయనకు స్వాగతం పలికారు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ఆహ్వానం మేరకు మోదీ అక్కడికి వెళ్లారు. సుమారు ఆరేండ్ల తర్వాత ఆ దేశంలో మోదీ అడుగుపెట్టారు. ప్రధాని వాంగ్‌‌‌‌తో పాటు ప్రెసిడెంట్ థర్మన్ షణ్ముగరత్నం, సీనియర్ మంత్రులతో మోదీ గురువారం భేటీ కానున్నారు.

ఈ సందర్భంగా బుధవారం రాత్రి మోదీకి వాంగ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. మోదీ రాకతో ఇండియా, సింగపూర్ స్నేహం మరింత బలోపేతం అయిందని వాంగ్ ట్విట్టర్​లో పేర్కొన్నారు. ఇరుదేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని అనుకుంటున్నట్టు చెప్పారు. మాన్యుఫాక్చరింగ్, డిజిటలైజేషన్, సస్టయినబుల్ డెవలప్‌‌‌‌మెంట్ వంటి రంగాలపై ఇరు దేశాల ప్రధానులు చర్చిస్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

మాది డెవలప్​మెంట్ పాలసీ..

ఇండియా ఎప్పుడూ డెవలప్​మెంట్ పాలసీకి మద్దతు ఇస్తుందని.. విస్తరణ విధానానికి కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. చైనా వైఖరిని ఉద్దేశిస్తూ మోదీ పరోక్షంగా కీలక వ్యాఖ్యలు చేశారు. విదేశీ పర్యటనలో భాగంగా బుధవారం ఆయన బ్రూనైలో పర్యటించారు. ఆ దేశ సుల్తాన్‌‌‌‌ హజీ హసనల్‌‌‌‌ బోల్కియా అధికారిక నివాసమైన ‘ఇస్తానా నురుల్‌‌‌‌ ఇమాన్‌‌‌‌’కు చేరుకున్న ప్రధాని మోదీకి ఆయన కుటుంబ సభ్యులు ఆత్మీయ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడారు. తన పర్యటనతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక, ద్వైపాక్షిక భాగస్వామ్యం మరింత బలోపేతం అవుతుందన్నారు. త్వరలో ఇండియా, బ్రూనై మధ్య నేరుగా విమాన సర్వీసులను ప్రారంభిస్తామన్నారు.

బ్రూనైతో పలు రంగాల్లో కీలక ఒప్పందాలు

40 ఏండ్లుగా బ్రూనైతో ఇండియా సత్సంబంధాలు కొనసాగిస్తున్నదని ప్రధాని మోదీ చెప్పారు. ఇండియా యాక్ట్‌‌‌‌ ఈస్ట్‌‌‌‌ పాలసీ, ఇండో పసిఫిక్‌‌‌‌ విజన్‌‌‌‌లో ఇండియా కు బ్రూనై కీలక భాగస్వామి అని తెలిపారు. ఇరు దేశాల సంస్కృతి, సంప్రదాయాలు, ప్రజల భావోద్వేగాలను పరస్పరం గౌరవించుకుంటామని చెప్పారు.

డోలు వాయించిన మోదీ

మహారాష్ట్ర జానపద నృత్యం ‘లావణి’తో ప్రవాస భారతీయులు మోదీకి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా బస చేస్తున్న హోటల్‌‌‌‌ వద్ద మోదీ డోలు వాయించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌‌‌‌ అవుతున్నది. సింగపూర్‌‌‌‌ పర్యటనపై మోదీ ట్వీట్‌‌‌‌ చేశారు. ‘‘ఇప్పుడే సింగపూర్‌‌‌‌లో ల్యాండ్ అయ్యాను. భారత్ - సింగపూర్ స్నేహాన్ని పెంపొందించే లక్ష్యంతో జరిగే వివిధ సమావేశాల కోసం ఎదురు చూస్తున్నాను’’అంటూ మోదీ పేర్కొన్నారు.