రాంలల్లా దర్శనం కోసం అయోధ్య రామాలయానికి వెళ్లవద్దని ప్రధాని మోదీ తన క్యాబినెట్ మంత్రులకు సూచించారు. భారీ రద్దీ, ప్రోటోకాల్‌తో వీఐపీల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా, మార్చిలో తమ అయోధ్య పర్యటనను ప్లాన్ చేసుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు.
ప్రస్తుతానికి అయోధ్యలోని రామ మందిరా (Ram Mandir)న్ని సందర్శించడం మానుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) బుధవారం( జనవరి 24) తన మంత్రివర్గ సహచరులకు సూచించారు. ప్రధాని మోదీ అధ్యక్షతన కేబినెట్ మంత్రుల(Cabinet Ministers) సమావేశంలో ఈ విషయాన్ని తెలిపారు. ఈ సమావేశంలో ప్రధాని మోదీ మాట్లాడుతూ ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండడానికి మార్చిలో కేంద్ర మంత్రి అయోధ్య(ayodhya)కు కార్యక్రమాలు చేయాలని అన్నారు.
ప్రధాని మోదీ ఏం చెప్పారంటే..
విపరీతమైన రద్దీ, ప్రోటోకాల్‌లతో వీఐపీల కారణంగా ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఉండేందుకు, మార్చిలో అయోధ్య పర్యటనను ప్లాన్ చేసుకోవాలని ప్రధాని మోదీ కేంద్ర మంత్రులకు సూచించారు.జనాలను అదుపు చేయడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజల సౌలభ్యం, భద్రతకు సంబంధించి జాగ్రత్తలు తీసుకోవాలని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ పరిపాలనను కోరారు. రామ్ లల్లాకు పట్టాభిషేకం తర్వాత, ప్రతి ఒక్కరూ భవ్యరాముడిని చూసేందుకు తహతహలాడుతున్నారు. దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో ప్రజలు అయోధ్యకు చేరుకుంటున్నారు.
మార్చిలో రాంలల్లాను చూసేందుకు
జనవరి 22న అయోధ్యలోని రామాలయంలో రాంలల్లా విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. దీనికి సంబంధించి కేబినెట్ సమావేశంలో మంత్రివర్గం ధన్యవాద తీర్మానాన్ని ఆమోదించింది. ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్ కేబినెట్‌లో ప్రతిపాదించారు. కేబినెట్ మీటింగ్‌లో, రామ మందిర ప్రారంభోత్సవానికి సంబంధించి, ప్రజలకు ఏమి సందేశం పంపారు అని మంత్రులను పిఎం మోదీ అడిగారు. అప్పుడు మంత్రులందరూ ప్రజలకు తమ అభిప్రాయాన్ని తెలిపారు. దీని తరువాత, రద్దీ కారణంగా ఫిబ్రవరి వరకు రాంలల్లా దర్శనం కోసం అయోధ్యకు వెళ్లకుండా ఉండాలని, ప్రోటోకాల్ కారణంగా, సాధారణ భక్తులకు దర్శనంలో ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఉండేందుకు క్యాబినెట్ మంత్రులందరినీ పీఎం మోదీ కోరారు. మంత్రులందరూ మార్చి నెలలో రామాలయాన్ని సందర్శించనున్నారు.
బుధవారం ( జనవరి 24) కూడా రామ మందిరం వద్ద భారీ రద్దీ కొనసాగింది. దీంతో దర్శనానికి వేచి ఉండాలని పోలీసులు భక్తులను కోరారు.మంగళవారం ( జనవరి 23) నాడు స్వామి వారిని దాదాపు ఐదు లక్షల మంది భక్తులు దర్శించుకున్నారు. బాల రామున్ని చూసేందుకు ప్రజలు తీవ్రమైన చలిని సైతం లెక్కచేయడం లేదు.ఉదయం నుంచే వేల సంఖ్యలో భక్తులు రాముడి దర్శనం కోసం తరలివస్తున్నారు. దీంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోయింది. కిలోమీటర్ల మేర క్యూలు దర్శనమిస్తున్నాయి. ప్రతి రోజూ సుమారు లక్ష మంది శ్రీరాముడిని దర్శించుకోనున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలో రద్దీని అదుపు చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. క్యూ లైన్లను ఏర్పాటు చేసి స్వామివారి దర్శనానికి అనుమతిస్తున్నారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు, ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF), ఎస్‌ఎస్‌బీ సహా దాదాపు 8,000 మంది భద్రతా సిబ్బంది ఆలయం వద్ద మోహరించినట్లు అయోధ్య ఇన్‌స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ ప్రవీణ్ కుమార్ తెలిపారు. ప్రస్తుతం ఆలయంలో రద్దీ ఎక్కువగా ఉన్నట్లు ఆయన తెలిపారు. భక్తులు బాలరాముడి దర్శనం కోసం తొందరపడాల్సిన అవసరం లేదన్నారు. ముఖ్యంగా వృద్ధులు, వికలాంగులు రెండు వారాల తర్వాత తమ ప్రయాణాన్ని షెడ్యూల్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయంలో అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు ఆయన వివరించారు.