
కాంగ్రెస్, బీఆర్ఎస్ ఒక్కటేనని మోదీ అన్నారు. అవినీతి, కుటుంబపాలన రెండు పార్టీలకు సొంతమైందని.. కాంగ్రెస్ బీఆర్ఎస్ కు కార్బన్ కాపీ అని చెప్పారు. రెండు పార్టీల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు. తెలంగాణ ప్రతిష్టను బీజేపీ మాత్రమే పెంచుతుందని.. కాంగ్రెస్ తో అభివృద్ధి అసాధ్యమన్నారు. తూప్రాన్ లో ప్రజా ఆశీర్వాద సభకు ప్రధాని మోదీ హాజరయ్యారు.
ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని.. కాంగ్రెస్ 5 దశాబ్ధాల పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను పాలించిందని మోదీ చెప్పారు. కానీ ఒక్క బీసీ నేతను కూడా సీఎం చేయలేదని విమర్శించారు. సామాజిక న్యాయం బీజేపీతోనే సాధ్యం అవుతుందని వివరించారు.
ప్రజలను పట్టించుకోని సీఎం తెలంగాణ ప్రజలకు అవసరమా అని ప్రధాని మోదీ ప్రశ్నించారు. ప్రజలను కలవని సీఎం మనకు అవసరమా అని ఓటర్లను నిలదీశారు. సచివాలయానికి వెళ్లని సీఎం మనకు అవసరమా.. కేసీఆర్ ను తెలంగాణ ప్రజలు శాశ్వతంగా ఫాంహౌస్ కు పంపించబోతున్నారని వ్యాఖ్యానించారు.
దళితుడిని సీఎం చేస్తానని చెప్పి కేసీఆర్ మోసం చేశారని మోదీ విమర్శించారు. దళితబంధు, డబుల్ బెడ్ రూమ్ ల హామీని విస్మరించారన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ చెప్పి స్కామ్ లు చేశారని.. తన బంధువులకు మాత్రమే కేసీఆర్ న్యాయం చేశారని ఆరోపించారు.