సంప్రదాయాల వేడుక సంక్రాంతి.. కిషన్ రెడ్డి నివాసంలో వేడుకల్లో పాల్గొన్న ప్రధాని

న్యూఢిల్లీ, వెలుగు: సంక్రాంతి, పొంగల్ పండుగలు భారతదేశ సంస్కృతిలో, వ్యవసాయ సంప్రదాయాలతో లోతుగా పేనవేసున్న వేడుకలని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఈ గొప్ప పండుగలను దేశ ప్రజలు రెట్టింపు ఉత్సాహంతో జరుపుకుంటున్నారని చెప్పారు. సోమవారం ఢిల్లీలోని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి నివాసంలో బోగి, సంక్రాంతి సంబురాలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్య అతిథిగా హాజరు కాగా.. లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా, కేంద్ర మంత్రులు భూపతి రాజు శ్రీనివాస్ రాజు, బండి సంజయ్, ఎంపీలు డీకే అరుణ, ధర్మపురి అర్వింద్, అనురాగ్ ఠాకూర్, సినీ నటుడు చిరంజీవి, క్రీడాకారిణి పీవీ సింధు, సింగర్ సునీత తదితరులు పాల్గొన్నారు. 

పండుగ సందర్భంగా తమ నివాసానికి వచ్చిన మోదీకి కిషన్ రెడ్డి దంపతులు ఘన స్వాగతం పలికారు. తర్వాత మంత్రోచ్ఛరణ మధ్య మోదీ భోగి మంటలను వెలిగించారు. స్పీకర్ ఓంబిర్లా, చిరంజీవితో కలిసి సంక్రాంతి సంబురాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల సంగీత, నృత్యాలను వీక్షించారు. సింగర్ సునీత తన పాటలతో అందర్ని అలరించారు. వేడుకల ముగింపులో భాగంగా ప్రధానికి వెంకటేశ్వర స్వామి విగ్రహాన్ని కిషన్ రెడ్డి అందజేశారు. తర్వాత వేడుకలకు హాజరైన విషయం ప్రధాని మోదీ ‘ఎక్స్’లో పోస్ట్​ చేశారు. ఈ సందర్భంగా ఒక అద్భుతమైన సాంస్కృతిక కార్యక్రమాన్ని తిలకించినట్లు పేర్కొన్నారు.  తెలుగు, దక్షిణాది రాష్ట్రాల ప్రజలకు సంక్రాంతి, పొంగల్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పండుగలు అందరికి సంతోషం, మంచి ఆరోగ్యం, సమృద్ధిగా పంటలు అందించాలని భగవంతుడిని కోరుతున్నట్టు పోస్టులో పేర్కొన్నారు.