ఖర్గేకు ప్రధాని మోదీ పరామర్శ.. ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగారు

ఖర్గేకు ప్రధాని మోదీ పరామర్శ.. ఫోన్ చేసి ఆరోగ్యం గురించి అడిగారు

జమ్మూ కాశ్మీర్ ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆదివారం ప్రసంగిస్తూ AICC ఇన్ఛార్జ్ మల్లిఖార్జున్ ఖర్గే అస్వస్థతకు గురైయ్యారు. ఉన్నట్టుండి వేదికపై కళ్లు తిరిగి కిందపడబోయారు. ఆయన వెంట ఉన్న అనుచరులు కిండపడకుండా పట్టుకున్నారు. కాసేపటి తర్వాత ఆయన కోలుకున్నారు. ప్రధాని మోదీ స్వయంగా ఫోన్ చేసి రాజ్యసభ ఎంపీ ఖర్గే ఆరోగ్యం గురించి తెలుసుకున్నారు. అక్టోబర్ 1న జరగనున్న పోలింగ్‌ కోసం జస్రోటా నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఠాకూర్ బల్బీర్ సింగ్ తరపున ఆదివారం ఖర్గే ప్రచారం చేశారు.

కథువా జిల్లాలో బహిరంగ ర్యాలీని ఉద్దేశించి ప్రసంగిస్తుండగా.. ఖర్గే తల తిరగడంతో వేదికపై ఉన్న అతని సహచరులు కుర్చీలో కూర్చోబెట్టారు. డాక్టర్లు వెంటనే ఆయన ఆరోగ్యం పరీక్షించారు. తర్వాత ఆయన కోలుకొని ప్రసంగాన్ని కొనసాగించారు. ఈ విషయంపై ప్రధాని నరేంద్ర మోదీ ఖర్గేకు ఫోన్ చేసి పరామర్శించారు. ఖర్గే యోగక్షేమాల గురించి అడిగి తెలుసుకున్నారు.

ALSO READ | ఎన్నికల ప్రచారంలో మల్లిఖార్జున ఖర్గేకు అస్వస్థత

ప్రచారంలో ప్రధాని మోడీని అధికారం నుంచి దింపే వరకు తాను చనిపోనని ఖర్గే అన్నారు. నా వయస్సు 83 సంవత్సరాలేనని.. అంత త్వరగా చనిపోనని.. బీజేపీని గద్దె దింపే వరకు బతికే ఉంటానని ఆయన చెప్పారు. జమ్మూ కాశ్మీర్ కు మళ్లీ రాష్ట్ర హోదా వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని మల్లిఖార్జున ఖర్గే అన్నారు. జమ్మూ కాశ్మీర్‌లో మైనింగ్, లిక్కర్ కాంట్రాక్టులు వంటి కీలక రంగాలలో బయటి వ్యక్తులు ఆధిపత్యం చెలాయించడానికి బిజెపి కారణమని ఖర్గే ఆరోపించారు. జమ్మూ కాశ్మీర్‌లో యువత భవిష్యత్తు కోసం మోదీజీ మొసలి కన్నీరు కారుస్తున్నారని విమర్శించారు. వాస్తవమేమిటంటే గత 10 ఏళ్లలో యావత్ దేశం యువత అంధకారంలోకి నెట్టబడిందని, దీనికి మోదీజీయే బాధ్యత వహించాలని ఖర్గే ఆరోపించారు.