
న్యూఢిల్లీ: టెస్లా, స్టార్‌లింక్ ఇంటర్నెట్ సంస్థలు భారత మార్కెట్లోకి అడుగుపెట్టేందుకు ఆసక్తి చూపుతున్న వేళ ఆ సంస్థల యజమాని, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో చర్చలు జరిపారు. టెక్, ఇన్నోవేషన్‌పై మస్క్‌తో చర్చించినట్టు మోదీ తన ఎక్స్ ఖాతా ద్వారా వెల్లడించారు. ‘‘టెస్లా సీఈతో ఎలాన్ మస్క్‌తో ఈ రోజు ఫోన్‌కాల్‌లో మాట్లాడా.
ఈ ఏడాది ప్రారంభంలో వాషింగ్టన్‌లో భేటీ సందర్భంగా మా ఇద్దరి మధ్య చర్చకు వచ్చిన అంశాలను గుర్తుచేసుకున్నాం. టెక్నాలజీ, ఇన్నోవేషన్రంగాల్లో పరస్పర సహకారానికి ఉన్న ప్రాముఖ్యతపై చర్చించాం. ఈ రంగాల్లో అమెరికాతో భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు భారత్ కట్టుబడి ఉంది’’ అని మోదీ వెల్లడించారు.
ఇండియాలోకి ఎంటర్‌కానున్న టెస్లా..!
ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా పర్యటనలో భాగంగా ఎలాన్ మస్క్‌తో మోదీ భేటీ ఆయ్యారు. ఆ సమయంలో స్పేస్, మొబిలిటీ, టెక్నాలజీ రంగాలపై ఇరువురూ చర్చలు జరిపారు. అనంతరం కొద్దిరోజులకే భారత్‌లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు టెస్లా కంపెనీ ప్రకటించింది. రాబోయే నెలల్లోనే ముంబై సమీపంలోని పోర్ట్‌కు కొన్ని వేల కార్లను రవాణా చేయడం ద్వారా టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు సన్నాహాలు చేస్తున్నదని బ్లూమ్బర్గ్రిపోర్ట్లో వెల్లడించింది.
మరోవైపు ఇండియాలో స్టార్‌లింక్ శాటిలైట్ ఇంటర్నెట్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు మస్క్‌కు చెందిన స్పేస్ ఎక్స్‌తో ముకేశ్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో, సునీల్ భారతీ మిట్టల్‌కు చెందిన భారతీ ఎయిర్‌టెల్ ఒప్పందం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో మస్క్‌తో ప్రధాని మోదీ ఫోన్‌లో మాట్లాడడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
ఈ నెల 21న భారత్ కు జేడీ వాన్స్
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ఈనెల 21న భారత్‌కు రానున్నారు. నాలుగు రోజుల పాటు ఇండియాలో ఆయన పర్యటిస్తారు. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీతో వాన్స్ భేటీ అవుతారని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికాలో మోదీ పర్యటన సందర్భంగా ప్రకటించిన ‘ఇండియా–అమెరికా టెక్నాలజీ పార్ట్ నర్ షిప్ ట్రస్ట్’ను ఇద్దరు నేతలు ప్రారంభిస్తారు. అమెరికా, ఇండియా మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై మోదీ, వాన్స్ సమీక్షిస్తారు.