యుద్ధానికి సిద్ధమేనా : మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ : ఆరేళ్ల తర్వాత ఇలాంటి మీటింగ్

యుద్ధానికి సిద్ధమేనా : మోదీ అధ్యక్షతన సూపర్ కేబినెట్ భేటీ : ఆరేళ్ల తర్వాత ఇలాంటి మీటింగ్

ఢిల్లీలో పరిణామాలు వేగంగా జరుగుతున్నాయి. జమ్మూకాశ్మీర్ పహల్గాంలో ఉగ్రదాడి తర్వాత పాకిస్తాన్ పై తీసుకోవాల్సిన చర్యలపై వరస భేటీలు జరుగుతున్నాయి. నిన్నటికి నిన్న దేశ రక్షణ మంత్రితోపాటు త్రివిధ దళాల చీఫ్ ల సమావేశం జరిగిన 24 గంటల్లోనే.. 2025, ఏప్రిల్ 30వ తేదీ మధ్యా్హ్నం సూపర్ కేబినెట్ భేటీ జరిగింది. 

ఏంటీ సూపర్ కేబినెట్ అంటే.. !

సూపర్ కేబినెట్ అంటే.. మంత్రి వర్గంలోని కీలక శాఖలకు చెందిన మంత్రులు. దీనిన్ని CCPA అని కూడా అంటారు.. అంటే రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ అన్నమాట. ఈ సూపర్ కేబినెట్ మంత్రుల్లో.. రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, హోం మంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. రోడ్డు రవాణా శాఖ మంత్రి గడ్కరీ, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయెల్ మాత్రమే ఉంటారు.. మోదీ అధ్యక్షతన సమావేశం అయిన సూపర్ కేబినెట్ భేటీలో.. ఇప్పుడు ఈ మంత్రులు అందరూ పాల్గొన్నారు. 

మోదీ ప్రధానమంత్రి అయిన తర్వాత.. సూపర్ కేబినెట్ భేటీ కావటం ఇదే రెండోసారి మాత్రమే. 2019లో పుల్వామాలో మన సైన్యంపై టెర్రరిస్టుల దాడి తర్వాత ఓసారి జరిగింది. మళ్లీ ఆరేళ్ల తర్వాత ఇప్పుడు ఈ సూపర్ కేబినెట్ భేటీ జరుగుతుంది. 

పహల్గాంలో టూరిస్టులపై టెర్రరిస్టుల నరమేధం తర్వాత.. పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ పై యుద్ధ మేఘాలు కమ్ముకున్న సమయంలో.. ఈ సూపర్ కేబినెట్ భేటీ జరగటం అనేది అందరిలో ఆసక్తి రేపుతోంది. 

పాకిస్తాన్ పై యుద్ధం ప్రారంభిస్తే.. తీసుకోవాల్సిన చర్యలు ఏంటీ.. యుద్ధం సమయంలో ఆర్థిక, వాణిజ్యం, శాంతిభద్రతలు, రవాణా వ్యవస్థకు సంబంధించిన అన్ని అంశాలను.. ఈ కీలక మంత్రులతో చర్చించారు ప్రధాని మోదీ.

పాక్ ఆక్రమిత కాశ్మీర్ విషయంలో యుద్ధం చేయాల్సి వస్తే.. టెర్రరిస్టులను అంతం చేయటానికి యుద్ధానికి దిగితే ఎదురయ్యే సమస్యలు ఏంటీ.. ఆర్థిక వ్యవహారాలపైనా ఈ సూపర్ కేబినెట్ లో చర్చ వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి.

పహల్గాంలో టెర్రరిస్టుల దాడి తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై ఇప్పటికే సైన్యానికి పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు ప్రధాని మోదీ.. భారత ఆర్మీ సైతం ఏ క్షణమైనా దాడులకు సిద్ధంగా ఉన్నట్లు స్పష్టం చేసింది. ఇలాంటి పరిస్థితుల్లోనే సూపర్ కేబినెట్.. CCPA.. దేశ అత్యున్నత రాజకీయ వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కావటం దేశ ప్రజల్లో ఉత్కంఠ రేపుతోంది. సూపర్ కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది అంటే చాలు.. ఇక యుద్ధం మొదలైనట్లే.. అన్నింటికీ సిద్ధంగా ఉన్నామని చెప్పటమే అంటున్నారు రాజకీయ వ్యవహారాల విశ్లేషకులు.