- అన్ని కులాలు కలిసి ఉంటేనే సేఫ్
- మహాయుతి కూటమితోనే మహారాష్ట్రలో అభివృద్ధి అని వ్యాఖ్య
- ధూలే, నాసిక్‌లో బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని ప్రసంగం
న్యూ ఢిల్లీ: దేశంలో కులాల మధ్య కాంగ్రెస్ చిచ్చుపెడుతూ ప్రమాదకరమైన గేమ్ ఆడుతున్నదని ప్రధాని మోదీ ఆరోపించారు. దళితులు, బీసీలు, గిరిజనులు జీవితంలో అభివృద్ధి చెందొద్దనేదే ఆ పార్టీ లక్ష్యమని అన్నారు. దళితులు, ఆదివాసీలను రెచ్చగొట్టేందుకు ఖాళీ పుస్తకాలను రాజ్యాంగంగా వారికి చూపెడుతూ మోసగిస్తున్నదని అన్నారు. ఇదీ కాంగ్రెస్ చరిత్ర అంటూ విరుచుకుపడ్డారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో శుక్రవారం ధూలే, నాసిక్‌లో నిర్వహించిన బీజేపీ ఎన్నికల ర్యాలీలో ప్రధాని మోదీ ప్రసంగించారు. కాంగ్రెస్ పార్టీపై విమర్శనాస్త్రాలు సంధించారు.
‘‘కాంగ్రెస్ కులాల మధ్య అంతరాలను సృష్టిస్తున్నది. ఎస్సీ, ఎస్టీ, బీసీల ఐక్యతను దెబ్బతీస్తున్నది. నెహ్రూ కాలం నుంచి కాంగ్రెస్, అతని కుటుంబం రిజర్వేషన్లను వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఇప్పుడు వారి నాలుగోతరం ‘యువరాజు’ (రాహుల్‌గాంధీ) కుల విభజన కోసం కృషిచేస్తున్నారు. ఇది ప్రజలు గ్రహించాలి” అని అన్నారు. ప్రజల్లో విష బీజాలు నాటి దేశంలో ఉన్న గిరిజన వర్గాలను విభజించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తున్నదని మండిపడ్డారు.
మీరంతా ఐక్యంగా ఉంటేనే సురక్షితంగా ఉంటారని ప్రజలకు సూచించారు. మహారాష్ట్రలో ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్ నేతృత్వంలోని బీజేపీ, శివసేన, ఎన్సీపీ వర్గాలతో కూడిన మహాయుతి కూటమితో మాత్రమే అభివృద్ధి సాధ్యమని, ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ అధికారంలోకి వస్తే ఇప్పటికే ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను రద్దు చేస్తుందని అన్నారు. అందరూ కలిసికట్టుగా ఉండి మహాయుతి కూటమిని మళ్లీ అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు. తమ కూటమికి అధికారమిస్తే రాబోయే ఐదేండ్లలో రాష్ట్రాన్ని అభివృద్ధిలో ఉన్నత శిఖరాలకు చేరుస్తామని హామీ ఇచ్చారు.
ఏ శక్తీ ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేదు
జమ్మూకాశ్మీర్‌లో ఆర్టికల్ 370ని పునరుద్ధరించేందుకు కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి యత్నిస్తున్నదని ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కాశ్మీర్అసెంబ్లీలో జరుగుతున్న గందరగోళాన్ని మోదీ ఈ సందర్భంగా ప్రస్తావించారు. ఇండియా కూటమి అక్కడ అధికారంలోకి వచ్చిన వెంటనే కశ్మీర్‌పై కుట్రను ప్రారంభించిందని మండిపడ్డారు. ఏ శక్తి దిగొచ్చినా ఆర్టికల్ 370ని పునరుద్ధరించలేరని అన్నారు. కాంగ్రెస్, వారి కూటమి పాకిస్తాన్ ఎజెండాను ప్రోత్సహించొద్దని, వేర్పాటువాదుల భాష మాట్లాడొద్దని సూచించారు.
ఎంవీఏ వాహనానికి బ్రేకుల్లేవ్
మహా వికాస్ అఘాడీ అనే వాహనానికి చక్రాలు, బ్రేకులు లేవని మోదీ ఎద్దేవా చేశారు. ఆ కూటమిలో డ్రైవర్ (సీఎం) పోస్ట్ కోసం పోటీపడుతున్నారని తెలిపారు. మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ సీట్లను పంచుకునేందుకు కాంగ్రెస్, ఉద్దవ్ ఠాక్రే, శరద్ పవార్ నేతృత్వంలోని శివసేన, ఎన్సీపీ కష్టపడుతున్నాయని, వారి మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదని అన్నారు. గతవారమే నామినేషన్ల గడువు ముగియగా.. ఆ కూటమి ఇంకా 11 సీట్లు అభ్యర్థులను అధికారికంగా ప్రకటించకలేకపోయిందని తెలిపారు.