- స్వాతంత్య్ర పోరాటంలో గిరిజనుల పాత్ర కీలకం
- క్రెడిట్ అంతా ఒక ఫ్యామిలీ కొట్టేసింది
- బిర్సా ముండా త్యాగాలను విస్మరించింది: ప్రధాని వ్యాఖ్య
జముయీ (బిహార్): కాంగ్రెస్.. గిరిజన వ్యతిరేకి అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. స్వాతంత్ర్య సమరంలో ఎంతోమంది ఆదివాసీ గిరిజనులు ప్రాణ త్యాగాలు చేశారని, అయినప్పటికీ.. వారిని కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. ఆ పార్టీ కేవలం ఒక కుటుంబానికి మాత్రమే పరిమితమైందని విమర్శించారు. ఆదివాసీల త్యాగాలకు గుర్తింపు దక్కకుండా అడ్డుపడిందని మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, జవహర్లాల్ నెహ్రు, గాంధీ ఫ్యామిలీ పేర్లను ప్రస్తావించకుండా.. మోదీ విమర్శలు చేశారు.
లెజండరీ ఫ్రీడం ఫైటర్ బిర్సా ముండా 150వ జయంతిని పురస్కరించుకుని బిహార్‌లోని జముయీ జిల్లాలోని శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రూ.6,640 కోట్లు విలువ చేసే ట్రైబల్ వెల్ఫేర్ ప్రాజెక్ట్‌లను మోదీ ప్రారంభించి మాట్లాడారు. ‘‘నేను ఆదివాసీ సమాజాన్ని ఎంతో ఆరాధిస్తాను. గత ప్రభుత్వాలు బిర్సా ముండా జయంతిని పట్టించుకోలేదు. మా ప్రభుత్వం మాత్రం ఆయన జయంతిని ‘జన జాతీయ గౌరవ్దివస్’ పేరుతో నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నది.
దేశ సంస్కృతి, సంప్రదాయాలు, వారసత్వాన్ని కాపాడటంలో ఆదివాసీ గిరిజనులు ఎంతో కృషి చేశారు. దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టడంలో గిరిజనులు కీలక పాత్ర పోషించారు. కానీ.. వారి త్యాగాలను గత ప్రభుత్వాలు అణిచివేశాయి. ఆ క్రెడిట్ అంతా ఒక పార్టీ (కాంగ్రెస్), ఒక కుటుంబం (నెహ్రు, గాంధీ) మాత్రమే తీసుకున్నది’’అని మోదీ ఆరోపించారు.
గిరిజనుల ఆర్థికాభివృద్ధికి కృషి చేస్తున్నం
ఇండియాకు స్వాతంత్ర్యం తీసుకొచ్చింది తామే అని కొందరు భావిస్తున్నట్లు ప్రధాని మోదీ విమర్శించారు. గిరిజనులపై ఆధిపత్యం చెలాయించడంతో.. బిర్సా ముండా, తిల్కా మాంఝీ (18వ శతాబ్దపు సంతాల్ లీడర్లు) లాంటి స్వాతంత్ర్య సమరయోధులను అందరూ మరిచిపోయారని చెప్పారు. ‘‘మా ప్రభుత్వం గిరిజనుల అభ్యున్నతికి ఎంతో కృషి చేస్తున్నది. గిరిజనులు ఎక్కువగా నివాసం ఉంటున్న ప్రాంతాలపై ఫోకస్ పెట్టాం. వారి ఆర్థికాభివృద్ధికి కొత్త స్కీమ్‌లు తీసుకొస్తున్నం.
మెరుగైన వైద్యం, మంచి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నం. గత ప్రభుత్వం గిరిజనుల సంక్షేమానికి బడ్జెట్లో రూ.25 వేల కోట్లు మాత్రమే కేటాయించింది. మా ప్రభుత్వం గత బడ్జెట్లో రూ.1.25 లక్షల కోట్లు కేటాయించింది. రాష్ట్రపతిగా ఆదివాసి గిరిజన బిడ్డ ద్రౌపది ముర్మును ఎన్నుకున్నాం. ఆమె ఎన్నిక విషయంలో బిహార్ సీఎం నితీశ్ చాలా సపోర్ట్ చేశారు’’ అని మోదీ గుర్తు చేశారు.
మాతృభూమి గౌరవం కోసం ఎంతో పోరాడారు
మాతృభూమి గౌరవం, కీర్తిని కాపాడేందుకు బిర్సా ముండా ఎంతో కృషి చేశారని ప్రధాని మోదీ అన్నారు. ట్విట్టర్ వేదికగా బిర్సా ముండా సేవలను మోదీ కొనియాడారు. ‘‘మాతృ భూమి కోసం భగవాన్ బిర్సా ముండా సర్వస్వం త్యాగం చేశారు. 1875 లో జార్ఖండ్‌లో ఆయన జన్మించారు. బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా పోరాడారు. గిరిజనులను ఏకతాటిపైకి తీసుకొచ్చి స్వాతంత్ర్య ఉద్యమంలో భాగస్వాములను చేశారు’’ అని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
విమానంలో సాంకేతిక సమస్య
మోదీ ప్రయాణించాల్సిన విమానంలో సాంకేతిక సమస్య తలెత్తింది. దీంతో దేవ్‌గఢ్ ఎయిర్‌పోర్టులోనే ఆయన 2 గంటలకు పైగా వేచి ఉండాల్సి వచ్చింది. టేకాఫ్‌లో సమస్య తలెత్తినట్లు అధికారులు తెలిపారు. వెంటనే అధికారులు.. ఎయిర్‌ఫోర్స్ కు చెందిన మరో విమానాన్ని సిద్ధం చేశారు. అందులో మోదీ ఢిల్లీ వెళ్లిపోయారు.