
- 2036 గేమ్స్ ఇండియాలో జరగాలన్నది మా కల
- ఒలింపియన్లతో ప్రధాని మాటాముచ్చట
న్యూఢిల్లీ: భారీ ఎత్తున ప్రపంచ స్థాయి ఈవెంట్లను నిర్వహించే సామర్థ్యం ఇండియాకు ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. 2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వడానికి దేశం చేస్తున్న ప్రయత్నాల్లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోబోమని స్పష్టం చేశారు. ‘2036 ఒలింపిక్స్‌కు ఆతిథ్యమివ్వాలన్నది భారత కల. ఆ దిశగా సన్నాహాలు ప్రారంభమయ్యాయి. గత సెప్టెంబర్‌లో న్యూఢిల్లీ, ఇతర నగరాల్లో జీ20 సమ్మిట్‌ను విజయవంతంగా నిర్వహించాం. దేశంలో ప్రస్తుతం ఉన్న మౌలిక సదుపాయాలు బాగున్నాయని చెప్పడానికి అదే నిదర్శనం. ఆ సమ్మిట్ నిర్వహణ ద్వారా భారీ ఈవెంట్లను నిర్వహించే సత్తా, సామర్థ్యం ఇండియాకు ఉందని రుజువైంది.
ఆ దిశగానే ఒలింపిక్స్ నిర్వహణ కోసం కూడా అడుగులు వేస్తున్నాం’ అని 78వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఎర్రకోట ప్రాకారం నుంచి జాతిని ఉద్దేశించి చేసిన ప్రసంగంలో మోదీ అన్నారు. ఇండియాలో ఒలింపిక్స్ నిర్వహించాలన్న ప్రణాళికకు ఇంటర్నేషనల్ ఒలింపిక్ కమిటీ (ఐవోసీ) చీఫ్ థామస్ బాచ్ కూడా మద్దతు పలికారు. ఇప్పటివరకు ఇండియాలో జరిగిన అతిపెద్ద మల్టీ స్పోర్ట్స్ ఈవెంట్ 2010 కామన్వెల్త్ గేమ్స్. అది సక్సెస్ కావడంతో ఇప్పుడు ఇండియా దృష్టి ఒలింపిక్స్ వైపు మళ్లింది. అయితే సౌదీ అరేబియా, ఖతార్, టర్కీ నుంచి ఇండియాకు గట్టి పోటీ ఎదురుకానుంది.
వచ్చే ఏడాది ఐవోసీ ఎన్నికలు ముగిసిన తర్వాత 2036 ఒలింపిక్స్ ఆతిథ్యంపై నిర్ణయం తీసుకోనున్నారు. ఒకవేళ ఇండియాకు చాన్స్ లభిస్తే మాత్రం అహ్మదాబాద్ ఫ్రంట్ రన్నర్‌గా నిలిచే అవకాశం ఉంది.మీ ప్రదర్శన బాగుంది..పారిస్ ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన అథ్లెట్లను ప్రధాని అభినందించారు. గురువారం మధ్యాహ్నం తన నివాసంలో అథ్లెట్లతో కలిసి ముచ్చటించారు. మెగా గేమ్స్‌లో ఇండియన్ అథ్లెట్ల పెర్ఫామెన్స్ చాలా బాగుందని కితాబిచ్చారు. ‘ఒలింపిక్స్‌లో భారత పతాకాన్ని రెపరెపలాడేలా చేసిన అథ్లెట్లు ఈరోజు మనతో ఉన్నారు. 140 కోట్ల దేశ ప్రజల తరఫున వారికి అభినందనలు చెబుతున్నా.
మరిన్ని కొత్త కలలు, ఆశయాల కోసం ముందుకెళ్దాం. వాటిని సాకారం చేసుకునేందుకు నిరంతరం కృషి చేద్దాం’ అని మోదీ వ్యాఖ్యా నించారు. ఇక మెగా గేమ్స్‌లో రెండు కాంస్యాలు నెగ్గిన స్టార్ షూటర్ మను భాకర్.. ఒలింపిక్‌లో పతకం సాధించిన తన పిస్టల్‌ను మోదీకి చూపించింది. ఒలింపిక్స్‌లో వరుసగా రెండోసారి కాంస్యం గెలిచిన ఇండియా హాకీ జట్టు ప్రధానికి ప్రత్యేక కానుక ఇచ్చింది. జట్టు ఆటగాళ్లంతా సంతకం చేసిన జెర్సీతో పాటు హాకీ స్టిక్‌ను మోదీకి అందజేశారు.
ప్లేయర్లందరూ మెడల్ పతకం ధరించి ప్రధానితో కలిసి ఫొటోలు దిగారు. బ్రాంజ్ మెడల్ విన్నర్, స్టార్ రెజ్లర్ అమన్ సెహ్రావత్ కూడా జెర్సీని బహుమతిగా ఇచ్చాడు. అథ్లెట్ల మధ్య కలియదిరుగుతూ ప్రతి ఒక్కర్ని పలకరించిన మోదీ.. పారిస్ అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. గేమ్స్‌లో సిల్వర్ నెగ్గిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా.. ఇండియాకు ఇంకా తిరిగి రాకపోవడంతో ఈ కార్యక్రమంలో పాల్గొనలేదు. గ్రోయిన్ ఇంజ్యురీ చికిత్స కోసం ప్రస్తుతం అతను జర్మనీకి వెళ్లాడు.
ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు పారిస్‌లో జరిగే పారాలింపిక్స్‌లో పాల్గొనే భారత బృందానికి ప్రధాని శుభాకాంక్షలు తెలిపారు. పారాలింపియన్లు పతకాలు సాధించాలని ఆకాంక్షించారు. టోక్యో పారాలింపిక్స్‌లో 19 మెడల్స్ నెగ్గిన ఇండియా తరఫున ఈసారి 84 మంది పారా అథ్లెట్లు పారిస్ ఈవెంట్‌లో బరిలోకి దిగుతున్నారు. స్పోర్ట్స్ మినిస్టర్ మన్‌సుఖ్ మాండవీయ, ఐవోఏ చీఫ్ పీటీ ఉష కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.