
కంచ గచ్చిబౌలి భూములపై ప్రధాని మోదీ మొదటి సారి స్పందించారు. అడవులపై బుల్డోజర్లను నడిపించడంలో కాంగ్రెస్ సర్కార్ బిజీగా ఉందంటూ కంచగచ్చిబౌలి భూములనుద్దేశించి మోదీ వ్యాఖ్యలు చేశారు. హర్యానాలోని యమునా నగర్ సభకు హాజరైన మోదీ.. తెలంగాణ సర్కార్ పై తీవ్ర విమర్శలు చేశారు . తాము పర్యావరణాన్ని కాపాడుతుంటే వాళ్లు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు. ప్రకృతిని ధ్వంసం చేసి వన్యప్రాణులను చంపుతున్నారని ఆరోపించారు. గ్యారంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేశారని ఆరోపించారు . అధికారంలోకి వచ్చాక ప్రకృతిని ధ్వంసం చేస్తూ వన్యప్రాణులను చంపుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మోదీ.
హైదరాబాద్ కంచ గచ్చిబౌలిలోని 400 ఎకరాల భూములపై గత కొన్ని రోజులుగా వివాదం నడుస్తోన్న సంగతి తెలిసిందే.. ఆ 400 ఎకరాలు అటవి భూమి కాదని.. ప్రభుత్వ భూములేనని తెలంగాణ ప్రభుత్వం చెబుతుండగా.. ఆ భూములు అటవి భూములు అని ,ప్రతిపక్షాలు హెచ్ సీయూ విద్యార్థులు చెబుతున్నారు.
Also Read :- టీటీడీ గోశాల ఘటనపై ఈఓ శ్యామలరావు రియాక్షన్ ఇది..
కంచ గచ్చిబౌలి భూముల్లో పనులను ఆపేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఏప్రిల్ 3న సుప్రీంకోర్టు ఆదేశించిన సంగతి తెలిసిందే. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అక్కడ ఎలాంటి కార్యకలాపాలు చేపట్టొద్దని స్పష్టం చేసింది. ఈ వ్యవహారంలో నెల రోజుల్లో నిపుణుల కమిటీని వేసి, ఆరు నెలల్లో రిపోర్ట్ సమర్పించాలని పేర్కొంది. కంచ గచ్చిబౌలి ప్రాంతాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పరిశీలించాలని, ఏప్రిల్ 16లోపు అఫిడవిట్ దాఖలు చేయాలని న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది. తమ ఆదేశాలను పాటించకపోతే.. సీఎస్ వ్యక్తిగతంగా బాధ్యత వహించాల్సి ఉంటుందని తేల్చిచెప్పింది.
కంచ గచ్చిబౌలి భూముల వివాదంపై స్వచ్ఛంద సంస్థలు వేసిన పిటిషన్ ను ఏప్రిల్ 7న విచారించింది తెలంగాణ హైకోర్టు.. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉందన్న డివిజన్ బెంచ్.. కౌంటర్ , రిపోర్ట్ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశించింది. తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేసింది.