- అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఆదర్శం: ప్రధాని మోదీ
- సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్‌తో భేటీ
- రెండు దేశాల మధ్య నాలుగు ఒప్పందాలు
- సెమీ కండక్టర్, డిజిటల్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్, హెల్త్ కేర్ రంగాల్లో అగ్రిమెంట్లు
సింగపూర్: అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఒక నమూనా లాంటిదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. భారత్ లో అనేక సింగపూర్ లను సృష్టించాలని అనుకుంటున్నామని చెప్పారు. ‘‘అభివృద్ధి చెందుతున్న దేశాలకు సింగపూర్ ఆదర్శం. భారత్ లో అనేక సింగపూర్ లను సృష్టించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. ఇందుకోసం సింగపూర్ సహకారం అందించడం ఆనందంగా ఉంది’’ అని తెలిపారు. బుధవారం సింగపూర్ వెళ్లిన ప్రధాని మోదీ.. గురువారం ఆ దేశ ప్రధాని లారెన్స్ వాంగ్ తో సమావేశమయ్యారు. రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ఇండియా యాక్ట్ ఈస్ట్ పాలసీలో సింగపూర్ కీలక దేశమని పేర్కొన్నారు. ‘‘గత పదేండ్లలో రెండు దేశాల మధ్య వాణిజ్యం డబుల్ అయింది. పెట్టుబడులు మూడు రెట్లు పెరిగి 150 బిలియన్ డాలర్లకు చేరుకున్నాయి. గత పదేండ్లలో సింగపూర్ కు చెందిన 17 శాటిలైట్లను ఇండియా నుంచి ప్రయోగించాం. రెండు దేశాల మధ్య సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని నిర్ణయించాం” అని తెలిపారు. సింగపూర్ లో 3.5 లక్షల మంది భారతీయులు ఉన్నారని, రెండు దేశాల మధ్య బలమైన సంబంధాలు ఉన్నాయని చెప్పారు.
‘‘సింగపూర్, భారత్ మధ్య ద్వైపాక్షిక సంబంధాలు ఏర్పడి వచ్చే ఏడాదికి 60 ఏండ్లవుతుంది. రెండు దేశాల మధ్య ఎప్పటి నుంచో సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. సింగపూర్ లో తొలి తిరువల్లూర్ కల్చరల్ సెంటర్ ను త్వరలోనే ప్రారంభిస్తాం” అని ప్రధాని ప్రకటించారు. కాగా, సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ ను ఇండియాకు రావాలని మోదీ ఆహ్వానించగా.. అందుకు ఆయన అంగీకరించారు.
ప్రెసిడెంట్ తోనూ సమావేశం..
సింగపూర్ ప్రెసిడెంట్ ధర్మాన్ షణ్ముగరత్నంతోనూ ప్రధాని మోదీ భేటీ అయ్యారు. వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సంబంధాలపై చర్చించారు. ‘‘సింగపూర్ ప్రెసిడెంట్ ధర్మాన్ షణ్ముగరత్నంతో మీటింగ్ చాలా బాగా జరిగింది. రెండు దేశాల మధ్య బంధాలను బలోపేతం చేసుకోవడంపై చర్చించాం. స్కిల్ డెవలప్ మెంట్, సస్టయినెబిలిటీ, టెక్నాలజీ, ఇన్నోవేషన్ అండ్ కనెక్టివిటీ రంగాలపై చర్చలు జరిపాం” అని మోదీ ట్వీట్ చేశారు. సింగపూర్ మాజీ ప్రధాని లీ సేన్ లూంగ్ తో కూడా మోదీ భేటీ అయ్యారు.
రెండు దేశాల మధ్య బంధాల బలోపేతానికి ఆయనెంతో కృషి చేశారని కొనియాడారు. మోదీకి లూంగ్ లంచ్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా సింగపూర్ లోని ప్రముఖ కంపెనీల సీఈవోలు, వ్యాపారవేత్తలతోనూ మోదీ సమావేశమయ్యారు. కాగా, గత పదేండ్లలో మన దేశ సోలార్ ఎనర్జీ కెపాసిటీ 32 రెట్లు పెరిగిందని, దీన్ని 2030 నాటికి 500 గిగావాట్స్ కు తీసుకెళ్లడమే లక్ష్యంగా పెట్టుకున్నామని మోదీ తెలిపారు. ఇంటర్నేషనల్ సోలార్ ఫెస్టివల్ సందర్భంగా ఆయన ఒక వీడియో మెసేజ్ విడుదల చేశారు.
లారెన్స్ వాంగ్ తో కలిసి సెమీకండక్టర్ల కంపెనీకి మోదీ..
సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంతో ముందుకెళ్లాలని భారత్, సింగపూర్ నిర్ణయించాయి. ఈ మేరకు ఇరు దేశాలు నాలుగు ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. సెమీ కండక్టర్, డిజిటల్ టెక్నాలజీ, స్కిల్ డెవలప్ మెంట్, హెల్త్ కేర్ రంగాల్లో సహకారం అందించుకోవాలని నిర్ణయించాయి. అడ్వాన్స్ డ్ మ్యానుఫ్యాక్చరింగ్, కనెక్టివిటీ, డిజిటలైజేషన్, హెల్త్ కేర్ అండ్ మెడిసిన్, స్కిల్ డెవలప్ మెంట్, సస్టయినెబిలిటీ, డిఫెన్స్ అండ్ సెక్యూరిటీ, ఎడ్యుకేషన్, ఏఐ ఫిన్ టెక్, సైన్స్ అండ్ టెక్నాలజీ తదితర రంగాల్లో సహకారం అందించుకోవడంపై ఇరు దేశాల ప్రధానులు మోదీ, లారెన్స్ వాంగ్ చర్చించారు.
రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలు, పెట్టుబడులను పెంచుకోవాలని నిర్ణయించారు. కాగా, వాంగ్ తో కలిసి సింగపూర్ లోని ప్రముఖ సెమీకండక్టర్ల కంపెనీ ఏఈఎం హోల్డింగ్స్ ను మోదీ సందర్శించారు. అక్కడ ట్రైనింగ్ పొందుతున్న ఒడిశా వర్కర్లతో ఆయన మాట్లాడారు.