- ప్రజల చేత, ప్రజల కోసమే పని చేస్తున్నం
- గత పదేండ్ల బీజేపీ పాలనలోదేశంలో ఎంతో మార్పు
- ఇప్పుడు టెర్రరిస్టులు వారి సొంత గడ్డపైనే వణుకుతున్నరు
- హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్ లో స్పీచ్
న్యూఢిల్లీ: గత ప్రభుత్వాలు ఓటు బ్యాంకును సంతృప్తిపర్చేందుకే స్కీంలను అమలు చేశాయని, కానీ తన ప్రభుత్వం మాత్రం ఓటు బ్యాంకు రాజకీయాలకు వేల మైళ్లు దూరంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. తాము ‘ప్రజల చేత, ప్రజల అభివృద్ధి కోసం’ అనే మంత్రంతోనే ముందుకు వెళ్తున్నామన్నారు. శనివారం ఢిల్లీలో జరిగిన ‘హిందూస్థాన్ టైమ్స్ లీడర్షిప్ సమిట్’లో ప్రధాని కీ నోట్ ప్రసంగం చేశారు. దేశానికి ఓటు బ్యాంకు రాజకీయాలతోనే అతిపెద్ద నష్టం జరిగిందని, తాము ఆ నష్టాన్ని పూడ్చి, అసమానతలను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
‘‘1990లలో పదేండ్లలోనే ఐదు ఎన్నికలు జరిగాయి. దేశంలో అస్థిరత్వం రాజ్యమేలింది. ఇండియా పరిస్థితి ఇలాగే ఉంటుందని, ఇలాగే కొనసాగుతుందని నిపుణులు, మేధావులు పత్రికల్లో రాశారు. కానీ వారి అంచనాలు తప్పు అని ప్రజలు నిరూపించారు” అని మోదీ అన్నారు. ‘‘మంచి ఆర్థిక విధానాలు చెడ్డ రాజకీయాలు.. అని గతంలో నిపుణులు చెప్పేవారు. గత ప్రభుత్వాలు కూడా ఇదే సూత్రాన్ని అనుసరించాయి. కేవలం ఎన్నికల్లో గెలవడం కోసమే పథకాలను అమలు చేశాయి” అని ఆయన విమర్శించారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక గత పదేండ్లలో ఎంతో మార్పు వచ్చిందన్నారు. సమిట్‌లో ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్ ను ఆయన ప్రస్తావించారు.
పేదల కోసం ఖర్చు చేస్తూనే.. ఆదా చేస్తున్నాం..
దేశ ప్రజల ఆలోచనా ధోరణి కూడా మారిందని, యువత రిస్క్ తీసుకుని మరీ అనేక రంగాల్లో దాదాపు 1.25 లక్షల స్టార్టప్‌లు ప్రారంభించారన్నారు. 2014లో దేశవ్యాప్తంగా 14 కోట్ల గ్యాస్ కనెక్షన్లు మాత్రమే ఉండగా.. తాము వచ్చాక 30 కోట్లకు పెంచామన్నారు. మొబైల్స్, రూపే కార్డ్, యూపీఐ వంటివి పెట్టుబడుల నుంచి ఉపాధి వరకు.. అభివృద్ధి నుంచి డిగ్నిటీ వరకూ ఒక అభివృద్ధి మోడల్‌గా నిలిచాయన్నారు.
ఒకవైపు ప్రజల కోసం రూ. లక్షల కోట్లను ఖర్చు చేస్తూనే.. మరోవైపు పేదలకు ప్రత్యక్ష నగదు బదిలీ ద్వారా రూ.3.5 లక్షల కోట్లను, ఆయుష్మాన్ భారత్ ద్వారా రూ.1.10 లక్షల కోట్లను ఆదా చేశామన్నారు.
ఇప్పుడు టెర్రరిస్టులే వణికిపోతున్నరు..
గత ప్రభుత్వాల హయాంలో దేశ ప్రజలను భయపెట్టిన టెర్రరిస్టులు.. ఇప్పుడు వారి సొంత గడ్డపైనే భయపడుతూ బతుకున్నారని మోదీ అన్నారు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక పరిస్థితులు మారిపోయాయన్నారు.
రేపు బ్రెజిల్లో జీ20 సమిట్‌కు మోదీ
ప్రధాని నరేంద్ర మోదీ శనివారం పశ్చిమాఫ్రికాలోని నైజీరియా పర్యటనకు బయలుదేరారు. నైజీరియా అధ్యక్షుడు బోలా అహ్మద్ టినుబు ఆహ్వానం మేరకు ఆ దేశంలో రెండు రోజులు పర్యటిస్తానని చెప్పారు. ఈ నెల 16, 17వ తేదీల్లో నైజీరియాలో 18, 19వ తేదీల్లో బ్రెజిల్లో జరిగే జీ20 సమిట్ కు హాజరుకానున్నట్టు ఆయన తెలిపారు. అనంతరం 19 నుంచి 21వ తేదీ వరకూ గయానాలో పర్యటించనున్నట్టు పేర్కొన్నారు.