- సముద్ర భద్రతలో అగ్రగామిగా ఎదుగుతున్నం: మోదీ
- ఐఎన్ఎస్ సూరత్, వాఘ్షీర్, నీలగిరిని జాతికి అంకితం చేసిన ప్రధాని
- ఈ మూడూ దేశీయంగా తయారైనవే
- ఇదే తొలిసారి అన్న ప్రధాని
ముంబై: సముద్ర భద్రతలో భారత్ అగ్రగామిగా ఎదుగుతున్నదని ప్రధాని మోదీ అన్నారు. నమ్మకమైన, బాధ్యతాయుతమైన భాగస్వామిగా ప్రపంచ గుర్తింపు పొందిందని చెప్పారు. డ్రగ్స్, ఆయుధాలు, టెర్రరిజం నుంచి సముద్ర తీరాలను రక్షించడంలో మనం ప్రపంచ భాగస్వామిగా మారాలని పిలుపునిచ్చారు. బుధవారం ముంబైలోని నేవల్ డాక్ యార్డులో యుద్ధ నౌకలు ఐఎన్ఎస్ సూరత్, ఐఎన్ఎస్ నీలగిరి, జలాంతర్గామి ఐఎన్ఎస్ వాఘ్ షీర్ ను జాతికి అంకితం ఇచ్చారు.
ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ.. ‘‘డిఫెన్స్ రంగంలో అత్యాధునిక టెక్నాలజీని వినియోగిస్తున్నాం. ఈ రంగంలో స్వావలంబన సాధించేందుకు డోర్లు ఓపెన్ చేశాం. ఇలా ఒకేసారి మూడు యుద్ధ నౌకలు ప్రారంభించడం ఇదే తొలిసారి. ఈ మూడు కూడా మన దేశంలో తయారైనవే. ఆత్మనిర్భర్ భారత్ తో మన దేశం మరింత బలంగా తయారవుతున్నది. మన దేశ డిఫెన్స్ ఉత్పత్తుల విలువ రూ.1.25 లక్షల కోట్లు దాటింది. 100కు పైగా దేశాలకు మనం తయారు చేసిన డిఫెన్స్ పరికరాలు ఎగుమతి అవుతున్నాయి. గత పదేండ్లలో 40 యుద్ధ నౌకలను నేవీలో చేర్చితే, అందులో 39 మన దేశంలో తయారు చేసినవే. ప్రస్తుతం దేశవ్యాప్తంగా మరో 60 యుద్ధ నౌకల నిర్మాణం జరుగుతున్నది. వీటి విలువ రూ.1.5 లక్షల కోట్లు. ఆత్మనిర్భర్ భారత్ మన ఎకానమీని బలోపేతం చేయడంతో పాటు ఎంతోమందికి ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నది” అని వెల్లడించారు. గ్లోబల్ సెక్యూరిటీ, ఎకానమీ, జియోపొలిటికల్ డైనమిక్స్‌లో భారత్ కీలక పాత్ర పోషించనున్నదని చెప్పారు.