- పారాలింపియన్లతో పీఎం మోదీ
- మన దీప్తికి ప్రత్యేక అభినందన
పారాలింపిక్స్‌లో కాంస్య పతకం సాధించిన తెలంగాణ బిడ్డ జివాంజీ దీప్తిని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందించారు. పారిస్ గేమ్స్‌లో రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించిన అథ్లెట్లతో మోదీ గురువారం తన నివాసంలో సమావేశమయ్యారు.
న్యూఢిల్లీ : పారాలింపిక్స్ విజేతలతో ప్రధాని నరేంద్ర మోదీ గురువారం భేటీ అయ్యారు. రికార్డు స్థాయిలో 29 పతకాలు సాధించిన అథ్లెట్లతో పాటు తెలంగాణకు చెందిన జివాంజీ దీప్తిని ప్రధాని ప్రత్యేకంగా అభినందించారు. విమెన్స్ 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఎస్‌హెచ్1లో వరుసగా రెండోసారి గోల్డ్ మెడల్ సాధించిన షూటర్ అవనీ లేఖరా, జూడోకా కపిల్ పర్మార్ మోదీతో ఫొటోలు దిగారు.
పర్మార్ పతకంపై ప్రధాని సంతకం చేశారు. జావెలిన్ త్రోయర్ నవ్‌దీప్ సింగ్ బహూకరించిన క్యాప్‌ను అందుకునేందుకు మోదీ నేల మీద కూర్చోవడం అక్కడ ఉన్న వారందరి హృదయాలను హత్తుకుంది. రెండు చేతులులేని ఆర్చర్ శీతల్ దేవి తన కాలితో చేసిన ఆటోగ్రాఫ్‌తో కూడిన జెర్సీని మోదీకి అందజేసింది. ఈ సమావేశానికి సంబంధించి 43 సెకన్ల వీడియోను స్పోర్ట్స్ మినిస్ట్రీ ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
‘పారాలింపిక్స్‌లో మన అథ్లెట్లు29 పతకాలు సాధించడం అభినందనీయం. వారి అంకితభావంతోనే ఇది సాధ్యమైంది. ఇది ఎంతో మందికి స్ఫూర్తిదాయకం’ అని మోదీ ఎక్స్‌లో ట్వీట్ చేశారు. ఈ సమావేశంలో సెంట్రల్ స్పోర్ట్స్ మినిస్టర్ మన్‌సుఖ్ మాండవీయ, పారాలింపిక్స్ కమిటీ ఆఫ్ ఇండియా (పీసీఐ) హెడ్ దేవేంద్ర జజారియా పాల్గొన్నారు.