న్యూఢిల్లీ: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డొనాల్డ్ ట్రంప్‌కు ప్రధాని నరేంద్ర మోడీ కంగ్రాట్స్ చెప్పారు. ప్రజల అభ్యున్నతి, ప్రపంచ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సును పెంపొందించడానికి కలిసి పని చేద్దామని ఎక్స్ వేదికగా పిలుపునిచ్చారు. " అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చరిత్రాత్మక విజయం సాధించిన మై ఫ్రెండ్ డొనాల్డ్ ట్రంప్‌కు అభినందనలు. మీ గత పదవీకాల విజయాలకు తగ్గట్టుగా..ఇండియా, -యూఎస్ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి, ఇరు దేశాల మధ్య సహకార సంబంధాల్ని మరింత పెంపొందించడానికి ఎదురుచూస్తున్నాను. ప్రపంచ శాంతి, మన ప్రజల అభివృద్ధి, స్థిరత్వం, శ్రేయస్సు కోసం కలిసి పని చేద్దాం" అని మోదీ ట్వీట్ చేశారు.
అంతేగాక.. 2016 నుంచి- 2020 మధ్య అమెరికా అధ్యక్షుడిగా ఉన్న ట్రంప్‌తో జరిగిన సమావేశాల ఫొటోలను కూడా ప్రధాని పోస్ట్ చేశారు. ఇటీవల ప్రధాని మోడీని కూడా ట్రంప్ పొగిడారు. మోదీ తన ఫ్రెండ్ అని.. మంచి మనిషని ప్రశంసలు కురిపించారు. 2019లో హ్యూస్టన్‌లో నిర్వహించిన 'హౌడీ మోదీ' కార్యక్రమానికి మోదీ హాజరయ్యారని గుర్తుచేశారు. 'హౌడీ మోదీ' ఈవెంట్ తర్వాత ట్రంప్ 2020లో ఇండియాలో పర్యటించారు. 'నమస్తే ట్రంప్' ర్యాలీతో ఆయనకు మోడీ ఘన స్వాగతం పలికారు. ట్రంప్ రాక సందర్భంగా అహ్మదాబాద్‌లోని ఓ క్రికెట్ స్టేడియంలో నిర్వహించిన కార్యక్రమానికి సుమారు లక్ష మంది హాజరయ్యారు.