- మా మద్దతు ఎప్పుడూ దౌత్యం, చర్చలకే
- టెక్నాలజీతో ప్రపంచం కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నది
- కలిసికట్టుగా సైబర్ మోసాలు అరికట్టాలి
- బార్డర్లో శాంతి స్థాపనే లక్ష్యం
- జిన్ పింగ్‌తో భేటీలో మోదీ కామెంట్
- మోదీని కలవడం సంతోషంగా ఉందన్న జిన్ పింగ్
- యువత ఉగ్రవాదంవైపు వెళ్లకుండా అరికట్టాలని పిలుపు
కజాన్ (రష్యా): ఇండియా కేవలం దౌత్యం, చర్చలకు మాత్రమే మద్దతు ఇస్తదని, యుద్ధానికి కాదని.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పష్టం చేశారు. ఏ సమస్య అయినా చర్చలతోనే పరిష్కరించుకోవాలని సూచించారు. రష్యా వేదికగా జరుగుతోన్న బ్రిక్స్ సదస్సులో ఆయన పాల్గొన్నారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులపై ఆందోళన వ్యక్తం చేశారు.
ప్రపంచ దేశాలు ఎదుర్కొంటున్న ఆర్థిక అనిశ్చితి, యుద్ధాలు, వాతావరణ మార్పులు, ఉగ్రవాదం వంటి అంశాలపై మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచాన్ని సరైన మార్గంలో తీసుకెళ్లేందుకు బ్రిక్స్ సానుకూలపాత్ర పోషిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఇన్ఫ్లేషన్ అరికట్టి.. భరోసా కల్పించాలి
‘‘ప్రపంచం ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటున్న టైమ్‌లోనే బ్రిక్స్ సదస్సు జరుగుతున్నది. పశ్చిమాసియాలో టెన్షన్ వాతావరణం నెలకొన్నది. ప్రపంచ దేశాలన్నీ నార్త్ – సౌత్, ఈస్ట్ – వెస్ట్ విభజనల గురించే మాట్లాడుకుంటున్నాయి. ఇలాంటి సమయంలో ఇన్ఫ్లేషన్ అరికట్టడం ఎంతో కీలకం. ఫుడ్, ఎనర్జీ, హెల్త్, వాటర్ సెక్యూరిటీపై భరోసా కల్పించాలి. మనమందరం వీటికి ప్రాధాన్యత ఇవ్వాలి.
ప్రపంచ వ్యాప్తంగా టెక్నాలజీ ఎంతో డెవలప్ అవుతున్నది. దీన్ని మంచి కోసం ఉపయోగించుకోవాలి. కానీ.. కొందరు తప్పుడు సమాచారం వ్యాప్తికి యూజ్ చేస్తున్నారు. ఫలితంగా చాలా దేశాలు కొత్త కొత్త సవాళ్లు ఎదుర్కొంటున్నాయి. ఆన్లైన్ వేదికగా డీప్ ఫేక్ వీడియోలు వైరల్ అవుతున్నాయి. సైబర్ మోసాలు జరుగుతున్నాయి. వీటన్నింటినీ అరికట్టేందుకు పటిష్టమైన ప్రణాళికలతో ముందుకెళ్లాలి’’అని మోదీ అన్నారు.
ప్రపంచమంతా బ్రిక్స్పైనే నమ్మకం పెట్టుకున్నది
ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను బ్రిక్స్ పరిష్కరిస్తదని చాలా దేశాలు నమ్ముతున్నాయని ప్రధాని మోదీ అన్నారు. ‘‘ప్రజా సంక్షేమం కోసం ఆలోచించాలి. విభజనలకు బ్రిక్స్ మద్దతివ్వదని చాటిచెప్పాలి. దౌత్యం, చర్చలకే సపోర్ట్ చేస్తదని, యుద్ధానికి వ్యతిరేకమని తెలియజేయాలి. కరోనాను ఎదుర్కోవడంలో బ్రిక్స్ కీలక పాత్ర పోషించింది.
అలాంటి పోరాట పటిమతోనే భవిష్యత్తు తరాలకు కొత్త అవకాశాలను సృష్టించగలం. ప్రపంచాన్ని పీడిస్తున్న టెర్రరిజంపై, టెర్రర్ ఫైనాన్సింగ్‌పై అందరూ ఉక్కుపాదం మోపాలి. దీనిపై ద్వంద్వ ప్రమాణాలు పాటించొద్దు’’అని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు.