పేపర్ నోట్స్ ద్వారా మోడీ ఉద్వేగపూరిత ప్రసంగం

76వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీ పేపర్ నోట్స్ ద్వారా ఉద్వేగపూరిత ప్రసంగం చేశారు. గతంలో టెలిప్రాంప్టర్ ద్వారా ప్రసంగించిన మోడీ..స్వాతంత్య్ర వేడుకల్లో మాత్రం టెలిప్రాంప్టర్ను పక్కనపెట్టేశారు. దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ప్రసంగాన్ని ప్రారంభించిన మోడీ... తన 83 నిమిషాల సుదీర్ఘ ప్రసంగంలో..భారతదేశం యొక్క సంభావ్యత, ఏకీకృత శక్తి అవసరం గురించి, మహిళలను గౌరవించడం, దేశ స్వాతంత్య్రానికి దోహదపడిన స్వాతంత్ర్య సమరయోధులను కొనియాడారు. 

రాహుల్ ఎగతాళి..
గత జనవరిలో దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ టెలిప్రాంప్టర్‌ను ఉపయోగించారు. అయితే మోడీ మాట్లాడుతుండగా.. టెలిప్రాంప్టర్ సాంకేతిక  లోపంతో ఆగిపోయింది. దీనిపై విమర్శలు చెలరేగాయి. కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ ప్రధానిని ఎగతాళి చేస్తూ, “టెలిప్రాంప్టర్ కూడా ఇన్ని అబద్ధాలు చెప్పలేదు” అని ట్వీట్ చేశారు.

బానిసత్వానికి స్వస్తి పలకాలి..
పేపర్ నోట్స్ ద్వారా సుధీర్ఘ ప్రసంగం చేసిన ప్రధాని మోడీ..2047లో దేశానికి స్వాతంత్య్రం వచ్చి 100 ఏళ్లు అవుతుందన్నారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందినఎదగాలని ఆయన ఆకాంక్షించారు.  స్వాతంత్య్ర సమరయోధుల కలను సాకారం చేసేందుకు భారతీయులు తప్పనిసరిగా తీసుకోవాల్సిన ఐదు హామీలను ప్రధాని మోదీ నిర్దేశించారు. రాబోయే 25 ఏళ్ల జీవితాలను దేశాభివృద్ధికి అంకితం చేయాలని కోరారు. బానిసత్వానికి దేశ ప్రజలు స్వస్తి పలకాలని పిలుపునిచ్చారు. 

టెలిప్రాంప్టర్ అంటే..
టెలిప్రాంప్టర్ను ఆటోక్యూ అని కూడా అంటారు. ఇది ప్రసంగం లేదా స్క్రిప్ట్‌ని చదవడానికి సహాయపడే ప్రదర్శన పరికరం. టెలిప్రాంప్టర్ను ఛానళ్లలో ఉపయోగిస్తారు. న్యూస్ ప్రెజెంటర్ స్క్రిప్ట్‌ని చదివే వీడియో కెమెరాకి కొంచెం దిగువన దీని స్క్రీన్ను అమరుస్తారు. ప్రసంగం యొక్క వేగాన్ని ఆపరేటర్ నియంత్రిస్తాడు. స్టూడియోల్లో పీసీఆర్ కమాండ్ను ప్రజెంటర్ వింటూ..ప్రాంప్టర్ ను నియంత్రిస్తాడు.  అయితే ప్రేక్షకులు చదివేది మాత్రమే చూడగలరు. కానీ టెలీఫ్రాంప్టర్ను చూడలేరు.