విషం వ్యాప్తి చేస్తోంది: కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ

విషం వ్యాప్తి చేస్తోంది: కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగిన ప్రధాని మోడీ

ముంబై: హర్యానా, జమ్మూ కాశ్మీర్ కాశ్మీర్ గెలుపు జోష్‎లో ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ కాంగ్రెస్ పార్టీపై నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పార్టీ హిందూ జనాభాను విభజించాలని చూస్తోందని తద్వారా సమాజంలో విషం వ్యాప్తి చేయాలని చూస్తోందని విరుచుకుపడ్డారు. ముస్లింలను కూడా కాంగ్రెస్ పార్టీ ఓటు బ్యాంక్‎గానే చూస్తోందని ధ్వజమెత్తారు. హర్యానాలో బీజేపీ హ్యాట్రిక్ విజయంతో కాంగ్రెస్ పార్టీ కుట్రలన్నీ విఫలమయ్యాయని అన్నారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మహారాష్ట్రలో  రూ.7,600 కోట్ల విలువైన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ఇవాళ (2024, అక్టోబర్, 9) ప్రధాని శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. హర్యానా ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం దేశ స్థితికి అద్దం పడుతోందన్నారు. 

కాంగ్రెస్ తమ రిజర్వేషన్లను లాక్కొని కేవలం తమను ఓటు బ్యాంకుగా చూస్తోందని దళితులు గ్రహించారని అందుకే హర్యానాలో దళితులు, ఇతర వెనుకబడిన తరగతులు  బీజేపీకి అండగా నిలిచారని అన్నారు. దేశంలోని రైతులను కూడా కాంగ్రెస్ తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసిందని.. కానీ తమకు కనీస మద్దతు ధర (ఎంఎస్‌పి) ఎవరు ఇచ్చారో హర్యానా రైతులకు బాగా తెలుసన్నారు. దేశంలోని రైతులు బీజేపీతో సంతృప్తిగా ఉన్నారన్నారు.  హర్యానాలో గెలుపు కోసం కాంగ్రెస్ అన్ని విధాల ప్రయత్నం చేసిందని.. కానీ దేశాన్ని విచ్ఛిన్నం చేసే వారిపక్షాన తాము నిలబడమని హర్యానా ప్రజలు నిరూపించారని కొనియాడారు. కాంగ్రెస్ తనది బాధ్యత లేని పార్టీ అని మరోసారి నిరూపించుకుందని ఎద్దేవా చేశారు. 

ALSO READ | ఈవీఎం ట్యాంపరింగ్ జరిగింది: కాంగ్రెస్

ఎలాగైనా అధికారంలోకి రావాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు సమాజాన్ని విభజించడానికి కొత్త కుట్రలకు తెరలేపుతున్నారని ఫైర్ అయ్యారు. అధికారం కోసం కాంగ్రెస్ ద్వేషపూరిత రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ విద్వేష రాజకీయాలు చేస్తోంది. దేశాన్ని నాశనం చేయాలనే లక్ష్యంతో ఉంది. మనమందరం ఆ పార్టీతో అప్రమత్తంగా,  జాగ్రత్తగా ఉండాలని త్వరలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న మహారాష్ట్ర ఓటర్లకు పిలుపునిచ్చారు. సమాజాన్ని నాశనం చేయడానికి పూనుకున్న ఈ శక్తులన్నింటికీ మహారాష్ట్ర ప్రజలు తగిన సమాధానం ఇస్తారని అనుకుంటున్నానని అన్నారు. మహారాష్ట్ర ప్రజలు ఏకమై బీజేపీ- మహాయుతి కూటమికి ఓటు వేసి..రాష్ట్ర, దేశ అభివృద్ధిలో పాలుపంచుకోవాలని విజ్ఞప్తి చేశారు.