- గిరిజనుల సంక్షేమం కోసం ఆ పార్టీ పని చేయలే
- గిరిజనులకు మేము శిష్యులం, ఆరాధకులం
సియోని (మధ్యప్రదేశ్): గిరిజనుల సంక్షేమం కోసం కాంగ్రెస్ పార్టీ పని చేయలేదని ప్రధాని నరేంద్ర మోదీ మండిపడ్డారు. దశాబ్దాలపాటు దేశాన్ని పాలించినా గిరిజనులను కాంగ్రెస్ చీకట్లోనే ఉంచిందని ఆరోపించారు. మధ్యప్రదేశ్‌లోని సియోని జిల్లాలో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ‘‘ట్రైబల్స్‌లో కన్ఫ్యూజన్‌ను కాంగ్రెస్ సృష్టిస్తున్నది. గిరిజనులు అనే పదం కూడా వారి నోటి నుంచి బాగా రాదు.
కానీ ఈ గిరిజనులే రాముడిని జాగ్రత్తగా చూసుకున్నారు. రాముడిని పురుషోత్తముడిగా చేసింది ట్రైబల్ సొసైటీ కాదా? ఆ గిరిజనులకు మేము శిష్యులం, ఆరాధకులం” అని చెప్పారు. వాజ్‌పేయీ నాయకత్వంలో బీజేపీ అధికారంలోకి కాగానే.. దేశ చరిత్రలోనే తొలిసారిగా గిరిజన సంక్షేమం కోసం ప్రత్యేక మినిస్ట్రీని ఏర్పాటు చేసిందని గుర్తుచేశారు. ‘‘ఇది మన సంస్కృతి. గిరిజనుల అభ్యున్నతి కోసం మినిస్ట్రీని, డిపార్ట్‌మెంట్‌ను, బడ్జెట్‌ను కేటాయించాం. ఏటా నవంబర్ 15న జన జాతీయ గౌరవ్ దివస్ ( ట్రైబల్ ప్రైడ్ డే) జరుపుకుంటున్నాం” అని చెప్పుకొచ్చారు. ఐదారు దశాబ్దాలు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పటికీ.. గిరిజన కమ్యూనిటీ కోసం ఏమీ చేయలేదని మోదీ ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో లక్షల కోట్ల కుంభకోణాలు
‘2014కు ముందు కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు.. లక్షల కోట్ల కుంభకోణాలు జరిగాయి. కానీ బీజేపీ వచ్చిన తర్వాత అలాంటివేమీ జరగలేదు. అలా ఆదా చేసిన సొమ్మును పేదలకు ఉచిత రేషన్ పంపిణీ చేసేందుకు ఖర్చు చేస్తున్నాం’ అని వివరించారు. ‘కాంగ్రెస్ ఒక కుటుంబం గురించే ఆలోచించింది. రోడ్లకు, లైన్లకు ఆ కుటుంబ వ్యక్తుల పేర్లనే పెట్టింది.
చివరికి మేనిఫెస్టోల్లోనూ వాళ్ల పేర్లు ఉన్నాయి’ అని విమర్శించారు.కాగా, మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్‌ను తమ చేతుల్లోకి తీసుకునేందుకు ఇద్దరు నేతలు కొట్లాడుతున్నారంటూ పరోక్షంగా కమల్‌నాథ్, దిగ్విజయ్‌సింగ్‌పై ప్రధాని నరేంద్ర మోదీ విమర్శలు చేశారు.
కాంగ్రెస్ ఉండుంటే రూ.5 వేల మొబైల్ బిల్లు..
తమ ప్రభుత్వ విధానాల వల్ల మొబైల్స్, డేటా సర్వీసులు చౌకగా దొరుకుతున్నాయని మోదీ చెప్పారు. కాంగ్రెస్ అధికారంలో ఉండుంటే ఫోన్, డేటా బిల్లు రూ.5 వేల దాకా ఉండేదని విమర్శించారు.
బమ్లేశ్వరి ఆలయంలో పూజలు
చత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నందగావ్ జిల్లా డోంగార్‌గఢ్‌లో ఉన్న మా బమ్లేశ్వరి ఆలయం లో ప్రధాని పూజలు చేశారు. చంద్రగిరి జైన్ టెంపుల్‌లోనూ పూజలు చేశారు. సాధువు వైద్య సాగర్ మహరాజ్ ఆశీస్సులు తీసుకున్నారు. తర్వాత డోంగార్‌గఢ్‌లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.