
- ఒక్కరోజు సైంటిస్ట్‌గా మారండి
రీసెర్చ్ ల్యాబ్, ప్లానెటోరియం, స్పేస్ సెంటర్ లాంటివి చూసిరండి - ‘మన్ కీ బాత్’లో పిల్లలు, యువతకు ప్రధాని పిలుపు
- దేశంలో ఒబెసిటీ సమస్య పెరుగుతున్నదని ఆందోళన
- ఏఐ రంగంలో దేశం పురోగతి సాధిస్తున్నదని వెల్లడి
న్యూఢిల్లీ: నేషనల్ సైన్స్ డేను పురస్కరించుకుని ఒక్కరోజు సైంటిస్ట్‌గా మారాలని పిల్లలు, యువతకు ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఇలా చేస్తే వాళ్లలో సైన్స్‌పై ఆసక్తి పెరుగుతుందని తెలిపారు. ఆదివారం మన్ కీ బాత్ 119వ ఎపిసోడ్‌లో మోదీ మాట్లాడారు. ‘‘మనం రానున్న రోజుల్లో నేషనల్ సైన్స్ డే (ఫిబ్రవరి 28) జరుపుకోనున్నం. పిల్లలు, యువతకు సైన్స్‌పై ఆసక్తిని కల్పించడం ఎంతో ముఖ్యం. ఇందుకోసం నా దగ్గరో ఐడియా ఉంది. మీరు ఒక్కరోజు సైంటిస్ట్‌గా మారండి. మీకు వీలైన ఏదో ఒకరోజు చూసుకుని.. రీసెర్చ్ ల్యాబ్, ప్లానెటోరియం, స్పేస్ సెంటర్ లాంటివి చూసిరండి. అది మీలో సైన్స్‌పై ఆసక్తిని పెంచుతుంది” అని పిల్లలు, యువతకు ప్రధాని మోదీ సూచించారు. ఇస్రో ఇటీవలే 100వ రాకెట్‌ను ప్రయోగించిందని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఒబెసిటీ సమస్యపై ఆందోళన..
దేశంలో ఒబెసిటి సమస్య పెరిగిపోతున్నదని మోదీ ఆందోళన వ్యక్తం చేశారు. ఫిట్‌గా, హెల్తీగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ‘‘దేశంలో ప్రతి 8 మందిలో ఒక్కరు ఒబెసిటితో బాధపడుతున్నరు. గత కొన్నేండ్లలోనే ఈ సంఖ్య రెట్టింపు అయింది. ఇక ఇది పిల్లల్లో అయితే నాలుగు రెట్లు పెరగడం మరింత ఆందోళన కలిగిస్తున్నది” అని అన్నారు. ఒబెసిటిని ఎదుర్కొనేందుకు ప్రతి ఒక్కరూ తమ ఆయిల్ వినియోగంలో 10 శాతం తగ్గించాలని సూచించారు. ఈ విషయాన్ని మరో 10 మందికి చెప్పాలని పిలుపునిచ్చారు.
మోదీ సోషల్ అకౌంట్లు మహిళలకు అప్పగింత
ఇంటర్నేషనల్ విమెన్స్ డేను పురస్కరించుకుని వివిధ రంగాల్లో విజయాలు సాధించిన మహిళలకు మార్చి 8న తన సోషల్ మీడియా అకౌంట్లను అప్పగిస్తానని మోదీ తెలిపారు. వాళ్లు తమ సక్సెస్ జర్నీని ప్రజలతో పంచుకుంటారని చెప్పారు.
తెలంగాణ టీచర్‌కు ప్రశంసలు
గిరిజన భాష పరిరక్షణలో ఆదిలాబాద్ బిడ్డ, ప్రభుత్వ స్కూల్ టీచర్ తొడిసం కైలాస్ కృషి గొప్పదని ప్రధాని కొనియాడారు. ఆదివారం మన్ కీ బాత్ లో ఆయన మాట్లాడుతూ.. ఇటీవలే పారిస్ ఏఐ సదస్సులో పాల్గొన్నానని, ఏఐ రంగంలో భారత్ సాధించిన పురోగతిని ప్రపంచం ప్రశంసించిందన్నారు. తొడసం కైలాస్ గిరిజన భాషలను పరిరక్షించడంలో ఎంతో కృషి చేస్తున్నారని, తమకెంతో సాయం చేస్తున్నారని తెలిపారు. ఆయనకు డిజిటల్ సంగీతంపై ఎంతో ఆసక్తి ఉందని, అది గిరిజన భాషలను కాపడడానికి ఎంతగానో దోహదం చేస్తోందన్నారు. ఏఐ సాధనాల సహాయంతో కొలామి భాషలో పాటను కంపోజ్ చేయడం ద్వారా ఆయన అద్భుతాలు చేశారని కొనియాడారు. కొలామి మాత్రమే కాకుండా అనేక భాషల్లో పాటలను కంపోజ్ చేయడానికి ఆయన ఏఐని ఉపయోగిస్తున్నారని తెలిపారు.
ఒబెసిటీపై నిఖత్ జరీన్ వీడియో
ఒబెసిటీ నివారణకు మన్ కీ బాత్ లో ప్రధాని ఇచ్చిన పిలుపు మేరకు ప్రముఖ అథ్లెట్ నిఖత్ జరీన్ ఓ వీడియో మెసేజ్ రిలీజ్ చేశారు. ‘‘హాయ్, నా పేరు నిఖత్ జరీన్. నేను రెండుసార్లు ప్రపంచ బాక్సింగ్ ఛాంపియన్‌ని. ప్రధాని మోదీ 'మన్ కీ బాత్' లో ఊబకాయం గురించి వివరించారు. దేశంలో ఊబకాయం చాలా వేగంగా వ్యాపిస్తున్నందున ఆరోగ్యం గురించి మరింత శ్రద్ధ అవసరం. ఊబకాయాన్ని ఆపేందుకు ఆరోగ్యకర జీవనశైలిని అలవర్చుకోవాలి. మనలాంటి సామాన్యులు, రోజూ పనికి వెళ్లేవారు, ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. దీనివల్ల గుండెపోటు, క్యాన్సర్ వంటి వ్యాధుల నుంచి దూరంగా ఉండొచ్చు. మనల్ని మనం ఫిట్ గా ఉంచుకుంటేనే, దేశం ఫిట్ గా ఉంటుంది" అని నిఖత్ జరీన్ తన వీడియోలో ప్రజలకు విజ్ఞప్తి చేశారు.