భువనేశ్వర్: పుట్టిన రోజు సందర్భంగా తల్లిని తల్చుకుని ప్రధాని మోడీ ఎమోషనల్ అయ్యారు. తన తల్లి జీవించి ఉన్నప్పుడు ప్రతి పుట్టినరోజున ఆమె ఆశీర్వాదం తీసుకునే వాడినని గుర్తు చేసుకుని భావోద్వేగానికి లోనయ్యారు. మంగళరం ప్రధాని మోడీ ఒడిషాలో పర్యటించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. ‘‘ఇక్కడికి రాకముందు నేను ఒక ఆదివాసీ కుటుంబానికి చెందిన గృహ ప్రవేశ కార్యక్రమానికి హాజరయ్యా. ఆ కుటుంబంలోని ఓ సోదరి నాకు తినడానికి ఖీర్ (సేమ్ వంటి తియ్యటి పదార్థం) ఇచ్చింది. ఆ ఖీర్ తింటున్నప్పుడు నేను మా అమ్మను మిస్ అయ్యానని స్పష్టంగా అర్థం అయ్యింది. మా అమ్మ బతికి ఉన్నప్పుడు ప్రతి పుట్టిన రోజుకి ఆశీర్వాదం కోసం ఆమె దగ్గరికి వెళ్లేవాడిని.
మా అమ్మ నాకు గుడ్ (బెల్లం) తినిపించేది. ఈ పుట్టిన రోజున మాత్రం ఆమె లేదు. కానీ ఆ ఆదివాసీ అమ్మ నాకు ఖీర్ తినిపించి మా అమ్మను గుర్తు చేసింది’’ అని ఈ సందర్భంగా ఆదివాసీ మహిళలకు మోడీ కృతజ్ఞతలు తెలిపారు. కాగా, 74వ జన్మదినోత్సవం సందర్భంగా ప్రధాని మోడీకి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మోడీ శుభాకాంక్షలు తెలుపుతున్నారు. నిత్యం మోడీని విమర్శించే కాంగ్రెస్ కీలక నేత, లోక్ సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే వంటి నేతలు పుట్టిన రోజు సందర్భంగా మోడీకి శుభాకాంక్షలు తెలిపారు.