- అభివృద్ధి, స్థిరత్వానికే ఓటు వేశారు
- వారసత్వ, అబద్ధపు రాజకీయాలను బొంద పెట్టారు: మోదీ
- మహారాష్ట్ర ప్రజల తీర్పు గట్టి చెంపదెబ్బ అని ఎద్దేవా
- కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు బుద్ధి చెప్పారని కామెంట్
న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో విచ్ఛిన్నకర శక్తులను ప్రజలు మట్టికరిపించారని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో మారుతున్న మూడ్ ను తెలుసుకోవడంలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఫెయిల్ అయ్యాయని ఆయన ఎద్దేవా చేశారు. శనివారం ఢిల్లీలోని బీజేపీ ప్రధాన కార్యాలయంలో ప్రధాని మాట్లాడారు. అభివృద్ధి, స్థిరత్వానికే ప్రజలు ఓటువేశారని తాజాగా ముగిసిన ఎన్నికలు చాటిచెప్పాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్, దాని మిత్రపక్షాల వారసత్వ, అబద్ధపు, విచ్ఛిన్నకర రాజకీయాలను బొందపెట్టారని చెప్పారు. ‘‘అభివృద్ధి, స్థిరత్వానికి మహారాష్ట్ర ప్రజలు ఓటువేశారు. రాష్ట్రాన్ని అస్థిరపరచాలనుకున్న వారికి గుణపాఠం చెప్పారు. ఒక్కటిగా ఉంటే సేఫ్ గా ఉంటామన్న సందేశం పంపారు. కులం, మతం ఆధారంగా దేశాన్ని విడగొట్టాలని చూస్తున్న వారిని శిక్షించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో సమాజంలోని అన్ని వర్గాల వారు బీజేపీకి ఓటువేశారు.
రాజ్యాంగం పేరుతో అబద్ధాలు వ్యాప్తిచేయడం ద్వారా ఎస్సీలు, ఎస్టీలు, ఓబీసీలను విడగొట్టగలమని కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు భావించాయి. కానీ, మహారాష్ట్ర ప్రజల ముందు వారి పప్పులు ఉడకలేదు. మహా ప్రజల తీర్పు వారికి చెంపదెబ్బ” అని మోదీ వ్యాఖ్యానించారు. నేషన్ ఫస్ట్ అన్న సిద్ధాంతాన్ని ప్రజలు నమ్మారని, ‘పదవులే ఫస్ట్’ అని కలలు కంటున్న వారిని తిరస్కరించారని మోదీ చెప్పారు.
కర్నాటక, తెలంగాణ, హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ చేస్తున్న మోసాలను మహారాష్ట్ర ప్రజలు గ్రహించి అద్భుతమైన తీర్పు చెప్పారని తెలిపారు. మహారాష్ట్రలో అబద్ధపు హామీల పాచిక పారలేదన్నారు. తమకు బీఆర్ అంబేద్కర్ అందించిన రాజ్యాంగం మాత్రమే పనిచేస్తుందని మహారాష్ట్ర ప్రజలు నిరూపించారు. జార్ఖండ్ ప్రజలు కూడా అభివృద్ధికే పట్టం కట్టారని తెలిపారు. ఆ రాష్ట్ర అభివృద్ధి కోసం కలిసికట్టుగా పనిచేస్తామని హామీ ఇచ్చారు.
జార్ఖండ్‌ను ముందుకు తీసుకెళ్దం
‘‘అభివృద్ధి గెలిచింది. సుపరిపాలన విజయం సాధించింది. మనం కలిసికట్టుగా జార్ఖండ్ ను మరింత ముందుకు తీసుకుపోదాం” అని జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ ను ట్యాగ్ చేస్తూ మోదీ ట్వీట్ చేశారు. మహారాష్ట్రలో తమ కూటమికి అఖండ విజయం అందించిన సోదర సోదరీమణులందరికీ మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు.