తెలంగాణలో ఎక్కడికి వెళ్లినా ఒకటే మాట వినిపిస్తుంది.. బీఆర్ఎస్ వద్దు..కాంగ్రెస్ వద్దు..ఎంఐఎం వద్దు..తెలంగాణ ప్రజలు కేవలం బీజేపీకే ఓటేస్తామంటున్నారని ప్రధాని మోదీ అన్నారు. జూన్ 4న దేశం గెలుస్తుంది.. 140 కోట్ల ప్రజల సంకల్పం గెలుస్తుందన్నారు. జూన్ 4న త్రిపుల్ తలాఖ్, ఆర్టికల్ 370 ని వ్యతిరేకించిన వారు ఓడి పోక తప్పదు అన్నారు.
భారత దేశం ఇప్పడొక డిజిటల్ పవర్.. వింటెక్ పవర్.. స్టార్టప్ పవర్..ప్రపంచంలోనే బలమైన ఆర్థిక వ్యవస్థ గల ఐదో దేశం... భారత్ ఇవాళ అద్భుతమైన అంతరిక్ష బలాన్ని కలిగి ఉంది. ఇది మోదీ ట్రాక్ రికార్డ్ అని ప్రధాని మోదీ అన్నారు.
కానీ కాంగ్రెస్ ట్రాక్ రికార్డు..లూట్ చేయడమే అన్నారు. వారసత్వ రాజకీయాలు, ఉగ్రవాదులను విడిచిపెట్టడం కాంగ్రెస్ ట్రాక్ రికార్డు అని మోదీ విమర్శించారు.2012లో దిల్ సుఖ్ నగర్ లో బాంబు పేలుళ్లు జరిగాయి. గతంలో బాంబు పేలుళ్లు జరిగాయి. ఇప్పుడు జరుగుతున్నాయా? బాంబు పేలుళ్లను ఆపింది బీజేపీ అని మోదీ అన్నారు. ఢిల్లీలో బలమైన ప్రభుత్వం వచ్చాకే పేలుళ్లు ఆగాయన్నారు. అందుకే మోదీని తొలగించాలని చాలా మంది కుట్రలు చేస్తున్నారని అన్నారు. కాంగ్రెస్ కు ఓటు వేయడం అంటే మళ్లీ పాత రోజులను ఆహ్వానించినట్లే అన్నారు ప్రధాని మోదీ.