కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ రాజ్యాంగానికి శత్రువులు: ప్రధాని మోదీ

కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ రాజ్యాంగానికి శత్రువులు: ప్రధాని మోదీ
  • జమ్మూకాశ్మీర్ లో వచ్చేది బీజేపీ సర్కారేనని మోదీ ధీమా

జమ్మూ: కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ), పీడీపీ పార్టీలు రాజ్యాంగానికి అతిపెద్ద శత్రువులని ప్రధాని మోదీ అన్నారు. ఈ మూడు పార్టీలు వివిధ వర్గాల ఓటు హక్కును హరించి, రాజ్యాంగ స్ఫూర్తిని దెబ్బతీశాయని మండిపడ్డారు. ‘‘జమ్మూకాశ్మీర్​లోని పశ్చిమ పాకిస్తాన్ శరణార్థులు, గోర్ఖాలు, వాల్మీకీలను ఒకప్పుడు సెకండ్ క్లాస్ సిటిజన్లుగా పరిగణించేవారు. 

మేం అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని గౌరవించి, వాళ్లందరికీ ఓటు హక్కు కల్పించాం” అని చెప్పారు. శనివారం జమ్మూలో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు. జమ్మూకాశ్మీర్​లో బీజేపీ సర్కార్ ఏర్పడుతుందని ధీమా వ్యక్తం చేశారు. ‘‘కాంగ్రెస్, ఎన్సీ, పీడీపీ పార్టీల కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.

 అవినీతి, ఉగ్రవాదం, వేర్పాటువాదం, రక్తపాతం, ఉద్యోగాల్లో వివక్షను ఈ ప్రాంత ప్రజలు కోరుకోవడం లేదు. శాంతిని, తమ పిల్లలకు మంచి భవిష్యత్తును కోరుకుంటున్నారు” అని చెప్పారు. ‘‘కాంగ్రెస్ హయాంలో బార్డర్ వెంబడి కాల్పులు జరిగినప్పుడల్లా.. ఆ పార్టీ శాంతి జెండాలను ఎగురవేసింది. కానీ మా ప్రభుత్వం వచ్చిన తర్వాత బుల్లెట్​కు బుల్లెట్​తోనే బదులిచ్చాం.

 2016లో సరిగ్గా ఇదే రోజున(సెప్టెంబర్ 28) సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించాం. కానీ ఆనాడు సర్జికల్ స్ట్రైక్స్ చేసినట్టు ఆధారాలు చూపించాలంటూ పాక్​కు కాంగ్రెస్ వత్తాసు పలికింది. ఆ పార్టీ ఏనాడూ  జవాన్లను గౌరవించలేదు” అని ఫైర్ అయ్యారు.

సీఎం పోటీలో బాపు, బేటా.. 

హర్యానా కాంగ్రెస్​లో ప్రతి ఒక్కరూ సీఎం కావాలని ఉవ్విళ్లూరుతున్నారని ప్రధాని మోదీ అన్నారు. ‘‘సీఎం పోటీలో బాపు (భూపిందర్ సింగ్ హుడా), బేటా (దీపేందర్ హుడా) కూడా ఉన్నారు. ఇందుకోసం ఇద్దరు కూడా ఇతరులను సెట్ చేసుకునే పనిలో పడ్డారు. 

ఇదంతా చూస్తున్న ప్రజలు.. కాంగ్రెస్ ను సెట్ చేయాలని చూస్తున్నారు” అని అన్నారు. శనివారం హర్యానాలోని హిసార్ లో నిర్వహించిన ఎన్నికల ర్యాలీలో మోదీ మాట్లాడారు.