
- సీఎం హిమంత అతిపెద్ద అవినీతిపరుడు: ఖర్గే
- డబుల్ ధోఖా సర్కార్‌కు ప్రజలే బుద్ధి చెప్తారని కామెంట్
న్యూఢిల్లీ: అస్సాంలో బీజేపీ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే మండిపడ్డారు. ఆ రాష్ట్ర సీఎం హిమంత బిస్వ శర్మ అతిపెద్ద అవినీతిపరుడని ఆయన ఆరోపించారు. ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్రంలో జుమ్లా ఫ్యాక్టరీని స్థాపించి, అవినీతిపరుడిని సీఎం సీట్లో కూర్చోబెట్టారని తీవ్ర విమర్శలు చేశారు.
రాష్ట్రంలో బీజేపీ విధానాలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి ఏర్పడిందని, వచ్చే ఏడాదిలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం ఖాయమని అన్నారు. బీజేపీ దుర్వినియోగ విధానాలతో రాష్ట్రం ఎంతగానో నష్టపోతోందని, రాజకీయ మార్పు ఆసన్నమైందని చెప్పారు. ప్రధాని మోదీ రెండ్రోజులు అస్సాంలో పర్యటించనున్న నేపథ్యంలో ఖర్గే మంగళవారం ట్వీట్ చేశారు.
డబుల్ ధోఖా సర్కార్..
ప్రధాని మోదీ నేతృత్వంలో అస్సాంలో డబుల్ ధోఖా పాలన నడుస్తోందని ఖర్గే ఫైర్ అయ్యారు. ఇంతకాలం బీజేపీ చేసిన పాపాలకు వచ్చే ఎన్నికల్లో ప్రజల ముందు బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. అస్సాం కాంగ్రెస్ నేతలపై ఇటీవలి రాజకీయ, భౌతిక దాడులకు వచ్చే ఏడాదిలో తమను ఎన్నుకోవడం ద్వారా ప్రజలే సమాధానం ఇస్తారని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు.
అవినీతి, దుష్పరిపాలన, ల్యాండ్ మాఫియాతో రాష్ట్రం నష్టపోతోందన్నారు. మిగతా రాష్ట్రాలతో పోల్చితే అభివృద్ధిలో అస్సాం చాలా వెనకబడిపోయిందన్నారు. అక్కడి 3.5 కోట్ల మంది ప్రజలు మోదీ సర్కార్‌పై కోపంతో ఉన్నారని, మోదీ ఇచ్చే ఏ నినాదంకూడా వాళ్ల కోపాన్ని చల్లార్చలేదని చెప్పారు. ఈశాన్య రాష్ట్రాల్లో మార్పు ఖచ్చితంగా వస్తుందన్నారు.
హిమంత అవినీతి సామ్రాజ్యం.. జితేంద్ర సింగ్
సీఎం హిమంత అంత పెద్ద వ్యాపార దిగ్గజంగా ఎదిగేందుకు కావాల్సిన అద్భుత దీపాన్ని ఆయనకు ఎవరిచ్చార ని అస్సాం కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి జనరల్ సెక్రటరీ జితేంద్ర సింగ్ ప్రశ్నించారు. హిమంత రాష్ట్రమంత టా తన అవినీతి సామ్రాజ్యాన్ని స్థాపించారని ఆరోపించారు. ఆయనకు అనేక టీ తోటలు, న్యూస్ పోర్టల్‌లు, మెక్ డొనాల్డ్స్ ఔట్లెట్లు, ఇంటర్నేషనల్ స్కూళ్లు ఎక్కడి నుంచి వచ్చాయని ప్రశ్నించారు.
మజులీ, కమ్రూప్, గౌహతి, గోలాఘాట్‌తో సహా ఎన్నో గిరిజన ప్రాంతాల్లో సీఎం భూములు ఎలా కొనుగోలు చేయగలిగారని నిలదీశారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని దొరికినంత దోచుకుంటుంటే కేంద్ర దర్యాప్తు సంస్థలు ఏం చేస్తున్నాయని జితేంద్ర ప్రశ్నించారు.