కుంభమేళా వెళ్లిన వారికి ఉద్యోగాలు కూడా కావాలి.. దీనిపై మాట్లాడండి మోదీజీ: రాహుల్ గాంధీ

కుంభమేళా వెళ్లిన వారికి ఉద్యోగాలు కూడా కావాలి.. దీనిపై మాట్లాడండి మోదీజీ: రాహుల్ గాంధీ

కుంభమేళాపై పార్లమెంటులో చర్చ సందర్భంగా  ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు లోక్ సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. కుంభమేళా వెళ్లిన వారికి ఉద్యోగాలు కూడా కావాలని, ఈ అంశంపై ప్రధాని మాట్లాడాలని డిమాండ్ చేశారు. ‘‘కుంభమేళా మన సంప్రదాయం, చరిత్ర. దీన్ని  మేము గౌరవిస్తాం. కానీ ప్రధాని మోదీకి కుంభమేళా మృతులకు నివాళులు అర్పించే సమయం కూడా లేకపోవడం బాధాకరం’’ అని అన్నారు. 

మంగళవారం (మార్చి 18) లోక్ సభలో కుంభమేళాపై సుదీర్ఘ ప్రసంగంలో ప్రధాని మోదీని టార్గెట్ చేశారు రాహుల్ గాంధీ. కుంభమేళాలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు అండగా నిలిచి, మృతులకు నివాళులు అర్పించే టైమ్ మోదీకి లేదని అన్నారు. 

దీనిపై మాట్లాడేందుకు స్పీకర్ ఓమ్ బిర్లా పర్మిషన్ ఇవ్వకపోవడంపై తీవ్రంగా మండిపడ్డారు. ‘‘ సభలో ప్రతిపక్ష నేతకు మాట్లాడే హక్కు ఉంటుంది. కానీమాకు మాట్లాడే సమయం ఇవ్వరు ఇవ్వరు. ఎందుకంటే ఇది న్యూ ఇండియా’’ అని విమర్శించారు. 

ALSO READ | Land for Job scam: ఈడీ విచారణకు బీహార్ మాజీ సీఎం రబ్రీదేవీ

అంతకుముందు పీఎం మోదీ మాట్లాడుతూ ‘‘ నేను ప్రయాగ్ రాజ్ కుంభమేళా గురించి మాట్లాడటం గౌరవంగా భావిస్తున్నాను. కోట్ల మంది ప్రజలు కుంభమేళాను విజయవంతం చేశారు. వారందరికీ ధన్యవాదాలు. కుంభమేళా విజయం వెనుక దేశ ప్రజలందరూ ఉన్నారు. దీన్ని సక్సెస్ చేసిన ప్రజలకు, భక్తులకు, ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ధన్యవాదాలు’’ అని అన్నారు. 

అయితే మోదీ కుంభమేళా ప్రసంగంలో ప్రయాగ్ రాజ్ మృతుల గురించి మాట్లాడక పోవడంపై తీవ్ర విమర్శలకు దిగారు రాహుల్ గాంధీ. 

మహకుంభమేళా సందర్భంగా మౌని అమావాస్య రోజు తొక్కిసలాట జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో 30 మంది చనిపోగా దాదాపు 60 మంది తీవ్రంగా గాయపడ్డారు.