న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో బీజేపీ అధికారం నిలబెట్టుకుంటే సీఎంగా యోగి ఆదిత్యనాథ్ కొనసాగుతారని ప్రధాని నరేంద్ర మోడీ పరోక్షంగా వెల్లడించారు. యూపీలో కరోనా కారణంగా ఆగిన అభివృద్ధి పనులను ఈసారి యోగి ఆదిత్యనాథ్ పరుగులు పెట్టిస్తారని చెప్పారు. ఈమేరకు ఆదివారం మథుర, ఆగ్రా, బులంద్‌షహర్ ఓటర్లను ఉద్దేశించి మోడీ వర్చువల్‌గా మాట్లాడారు. రాష్ట్రంలో యోగి ప్రభుత్వం మరోసారి అధికారంలోకి వస్తే నిరుపేదలకు ఇండ్లు కట్టిచ్చే పథకం పనులు మరింత వేగంగా జరుగుతాయని చెప్పారు. కరోనా మహమ్మారి వల్ల గత రెండేండ్లలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు కుంటుపడ్డాయని అన్నారు. కరోనా కష్టకాలంలో ప్రభుత్వ ప్రాధాన్యం మొత్తం ప్రజల ప్రాణాలను కాపాడడంపైనే పెట్టిందని, ఆ మహమ్మారి రాకుంటే యూపీ అభివృద్ధిలో దూసుకుపోయి ఉండేదని చెప్పారు. సేవ చేసే వారికి ప్రజల బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజార్టీతో గెలుస్తుందని మోడీ అన్నారు.
దోచుకోవడమే అప్పటి ప్రభుత్వాల అజెండా
ప్రజల అవసరాలు, కష్టసుఖాలతో సంబంధం లేకుండా, రాష్ట్రాన్ని దోచుకోవడమే ఎజెండాగా గత ప్రభుత్వాలు పనిచేసేవని మోడీ విమర్శించారు. డబ్బు, కండ బలం, కులం, మతాలను అడ్డుపెట్టుకుని కొందరు రాజకీయాలు చేశారని మండిపడ్డారు. అయితే ఎంత ప్రయత్నించినా యూపీ ప్రజల ప్రేమను మాత్రం వారు పొందలేకపోయారని అన్నారు. సేవకుడిగా ఉంటూ, సేవ చేసే వారికి ప్రజల బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉంటాయని చెప్పారు. లాకర్లు నింపుకోవడానికే అప్పటి ప్రభుత్వాలు ఉండేవని, అది వాళ్లకో ఆట అని మోడీ కామెంట్స్ చేశారు. ‘‘ప్రజల్లో బీజేపీకి ఉన్న తిరుగులేని సపోర్ట్‌ను చూసిన నేతలు ఇప్పుడు కలలో శ్రీకృష్ణుడిని చూస్తున్నారు’’ అని పరోక్షంగా ఎస్పీ చీఫ్ అఖిలేశ్ యాదవ్‌ను ఉద్దేశించి కామెంట్ చేశారు. అప్పట్లో ఫ్యామిలీలే ప్రభుత్వాలుగా ఉండేవని, బీజేపీ సర్కారులో రాష్ట్రమంతా ఒక ఫ్యామిలీగా మారిందని మోడీ పేర్కొన్నారు.