సందేశ్ ఖాలీ ఘటన సిగ్గుచేటు .. దీనిపై దేశమంతా ఆగ్రహం వ్యక్తమవుతోంది: మోదీ

  • బాధిత మహిళలను బెంగాల్ సీఎం పట్టించుకోలే
  • నిందితులను కాపాడేందుకు ప్రయత్నించారంటూ ఆరోపణ
  • ఈ ఘటనపై ఇండియా కూటమి ఎందుకు మౌనంగా ఉందని ఫైర్ 
  • బెంగాల్, జార్ఖండ్​లో ప్రధాని పర్యటన.. పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన

ఆరంబాగ్/బర్వాడా: బెంగాల్​లో ఆడబిడ్డలపై అఘాయిత్యాలు జరుగుతున్నా టీఎంసీ సర్కార్ పట్టించుకోవడం లేద ని ప్రధాని మోదీ మండిపడ్డారు. సందేశ్ ఖాలీ ఘటనపై దేశమంతా మండిపడుతోందని, ఈ ఘటన సిగ్గుచేటు అని అన్నారు. శుక్రవారం బెంగాల్​లో మోదీ పర్యటించారు. రూ.7,200 కోట్ల పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా హుగ్లీ జిల్లాలోని ఆరంబాగ్​లో నిర్వహించిన సభలో మాట్లాడారు. సందేశ్ ఖాలీలోని ఆడబిడ్డలపై టీఎంసీ లీడర్లు హింసకు పాల్పడ్డారని మోదీ మండిపడ్డారు. 

బాధిత మహిళలు సాయం కోసం సీఎం మమతా బెనర్జీ దగ్గరికి వెళ్లారు. కానీ మమత మాత్రం బాధితులకు కాకుండా నిందితులకు సాయం చేశారు. టీఎంసీ లీడర్లను కాపాడేందుకు ప్రయత్నించారు. ప్రధాన నిందితుడిని అరెస్టు చేయకుండా తన అధికారాలను ఉపయోగించారు. చివరికి బీజేపీ పోరాటంతో బెంగళూర్ పోలీసులు ఎట్టకేలకు రెండు నెలల తర్వాత నిందితుడిని అరెస్టు చేశారు” అని చెప్పారు. మమత ప్రభుత్వంలో గాయపడ్డ బెంగాల్ ప్రజలు.. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో ఓటుతో సమాధానం చెబుతారన్నారు.

బెంగాల్ లో అంతా అవినీతే.. 

సందేశ్​ఖాలీ ఘటనపై ప్రతిపక్ష ఇండియా కూటమి ఎందుకు మౌనంగా ఉంటోందని మోదీ ప్రశ్నించారు. దీనిపై కాంగ్రెస్, లెఫ్ట్ పార్టీలు ఎందుకు స్పందించడంలేదని మండిపడ్డారు. ‘‘కాంగ్రెస్​కు కావాల్సింది అవినీతి, బుజ్జగింపు రాజకీయాలు. అదే ఆ పార్టీకి అతిపెద్ద జాబ్. అందుకే టీఎంసీ అరాచకాలకు సపోర్టు చేస్తున్నది” అని ఫైర్ అయ్యారు. బెంగాల్​లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని అన్నారు. 

ప్రజలను టీఎంసీ సర్కార్ దోచుకుంటున్నది. ఇటీవల జాబ్స్ రిక్రూట్ మెంట్​లో స్కామ్ జరిగింది. ఆ దోపిడీదారులు ఎక్కడి నుంచి వచ్చారో తిరిగి అక్కడికే పంపిస్తాం. ఇది మోదీ గ్యారెంటీ” అని హామీ ఇచ్చారు. రాష్ట్రానికి కేంద్రం నిధులు పంపిస్తున్నా, వాటిని వినియోగించుకోవడం లేదని ఫైర్ అయ్యారు. గత పదేండ్లలో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటపడ్డారని తెలిపారు. 2047 నాటికి ఇండియాను అభివృద్ధి చెందిన దేశంగా నిలపడమే తమ లక్ష్యమని పేర్కొన్నారు.

జార్ఖండ్ ప్రజలను దోచుకుంటున్నరు.. 

కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రతిపక్ష ఇండియా కూటమి అడ్డుకుంటున్నదని మోదీ మండిపడ్డారు. స్కీమ్స్ అమలుకాకుండా రాష్ట్రాల్లోని ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు అడ్డంకులు సృష్టిస్తున్నాయని ఫైర్ అయ్యారు. ఇండియా కూటమి దేశాభివృద్ధికి వ్యతిరేకమని విమర్శించారు. శుక్రవారం జార్ఖండ్ లో రూ.35,700 కోట్ల పనులకు మోదీ ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ధన్ బాద్ జిల్లాలోని బర్వాడాలో నిర్వహించిన విజయ సంకల్ప మహార్యాలీలో పాల్గొని మాట్లాడారు. జార్ఖండ్ లో విచ్చలవిడిగా అవినీతి జరుగుతున్నదని మోదీ మండిపడ్డారు.

 జేఎంఎం, కాంగ్రెస్ లీడర్లు ప్రజలను దోచుకుంటున్నరు. గుట్టలకొద్దీ ఆస్తులు పోగేసుకుంటున్నరు. ఇటీవల ఇక్కడ కోట్ల కొద్దీ డబ్బు దొరికింది. అన్ని నోట్ల కట్టలు నా జీవితంలో ఇప్పటి వరకు చూడలేదు” అని అన్నారు. కాంగ్రెస్ ఎంపీ ధీరజ్ సాహూను ఉద్దేశించి ఈ కామెంట్లు చేశారు. జేఎంఎం, కాంగ్రెస్ ఆదివాసీలను కేవలం ఓటుబ్యాంకుగానే చూస్తున్నాయని.. వాళ్ల అభివృద్ధి కోసం ఏమీ చేయడం లేదని మండిపడ్డారు. ఎన్డీఏకు ఈసారి 400కు పైగా సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.