ఏఐ, స్టార్టప్​లలో కలిసి పనిచేద్దాం..ప్రధాని మోదీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్ అంగీకారం

ఏఐ, స్టార్టప్​లలో కలిసి పనిచేద్దాం..ప్రధాని మోదీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్ అంగీకారం
  • ప్రధాని మోదీ, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ మాక్రన్ అంగీకారం
  • డిఫెన్స్, అణు ఇంధనం, ట్రేడ్, సైన్స్, తదితర రంగాల్లోనూ సహకారానికి ఓకే  
  •  ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు 
  •  మాషేలో ఇండియన్ కాన్సులేట్ ప్రారంభం  
  •  భారత అమర జవాన్లకు మోదీ నివాళులు 
  •  ముగిసిన ఫ్రాన్స్ పర్యటన.. అమెరికాకు మోదీ

పారిస్:  అణు ఇంధనం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, స్టార్టప్ లు, డిఫెన్స్, రీసెర్చ్, వాణిజ్యం, తదితర రంగాల్లో కలిసి పనిచేద్దామని భారత ప్రధాని నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయెల్ మాక్రన్ అంగీకారానికి వచ్చారు. ఆయా రంగాల్లో సహకారానికి సంబంధించి ఇరు దేశాల మధ్య కీలక ఒప్పందాలు కుదిరాయి. మూడు రోజుల పర్యటన నిమిత్తం సోమవారం రాత్రి ఫ్రాన్స్ రాజధాని పారిస్ కు చేరుకున్న ప్రధాని మోదీ మంగళవారం ఏఐ యాక్షన్ సమిట్ కు ప్రెసిడెంట్ మాక్రన్ తో కలిసి అధ్యక్షత వహించారు. అదేరోజు రాత్రి ఫ్రాన్స్ ప్రెసిడెంట్ విమానంలో మోదీ, మాక్రన్ ఇద్దరూ మాషే నగరానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా విమానంలోనే పలు అంశాలపై ద్వైపాక్షిక చర్చలు జరిపారు. 

మాషేలో రెండువైపులా ప్రతినిధి బృందాలతో కలిసి ఇరువురు నేతలు విస్తృత స్థాయిలో చర్చించారు. రెండు దేశాలూ వేర్వేరుగా ఏఐ డిక్లరేషన్లను అడాప్ట్ చేసుకున్నాయని, ఏఐని మానవాళి మంచి కోసమే వినియోగించాలని, ఇందుకోసం పారదర్శక విధానాలను అనుసరించాలని నిర్ణయించినట్టు పేర్కొంది. బుధవారం ఉదయం మాషేలో కొత్తగా ఏర్పాటు చేసిన ఇండియన్ కాన్సులేట్ ను మోదీ, మాక్రన్ ఇద్దరూ ప్రారంభించారు. దక్షిణ ఫ్రాన్స్ లోని కాడరాచ్ లోని ఇంటర్నేషనల్ థర్మోన్యూక్లియర్ ఎక్స్ పరిమెంటల్ రియాక్టర్ (ఐటీఈఆర్) ప్రాజెక్టును కూడా ఇరువురు నేతలు సందర్శించారు. ఈ అతర్జాతీయ ప్రాజెక్టుకు అయ్యే వ్యయంలో ఇండియా 10 శాతం (రూ. 17,500 కోట్లు) నిధులను అందజేసింది. అలాగే ‘ఇండియా-–ఫ్రాన్స్ ఇయర్ ఆఫ్​ ఇన్నోవేషన్ ఇన్ 2026’ కార్యక్రమానికి సంబంధించిన లోగోను కూడా ఇరువురు నేతలు ఆవిష్కరించారు.

సావర్కర్ తెగువ తరతరాలకూ స్ఫూర్తి..  

మాషే నగరంలోని మాజర్గుస్ సిమెటరీలో మొదటి, రెండో ప్రపంచయుద్ధంలో అమరులైన భారత జవాన్ల స్మారకాన్ని కూడా మోదీ, మాక్రన్ సందర్శించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఫ్రీడమ్ ఫైటర్ వీర సావర్కర్ ను మోదీ గుర్తు చేసుకుంటూ ట్వీట్ చేశారు. ‘‘1910, జులై 8న హెచ్ఎంఎస్ మోరియా నౌక నుంచి తప్పించుకున్న సావర్కర్.. అత్యంత సాహసంతో సముద్రంలో ఈదుతూ మాషే తీరానికి చేరుకున్నారు. కానీ ఆయనను ఫ్రెంచ్ అధికారులు పట్టుకుని తిరిగి నౌకలోని బ్రిటిష్ అధికారులకు అప్పగించారు. అయితే, సావర్కర్ ను బ్రిటిష్ కస్టడీకి అప్పగించవద్దంటూ అప్పట్లో మాషేలోని ఫ్రెంచ్ యాక్టివిస్టులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేశారు. సావర్కర్ చూపిన ఈ ధైర్య సాహసాలు తరతరాలకూ స్ఫూర్తిగా నిలుస్తాయి” అని మోదీ కొనియాడారు. కాగా, ఏఐ యాక్షన్ సమిట్ సందర్భంగా గూగుల్ సీఈవో సుందర్ పిచయ్ తోనూ మోదీ భేటీ అయ్యారు. ఏఐ రంగంలో ఇండియాకు ఉన్న అద్భుత అవకాశాలు, దేశంలో డిజిటల్ మార్పులు ప్రవేశపెట్టేందుకు ఏంచేయాలన్న దానిపై ఈ సందర్భంగా మోదీకి సుందర్ వివరించారు.  

అమెరికా బయలుదేరిన మోదీ 

ఫ్రాన్స్​లో మూడు రోజుల పర్యటనను ముగించుకున్న ప్రధాని మోదీ బుధవారం సాయంత్రం అమెరికాకు బయలుదేరారు. అమెరికాలో రెండు రోజుల పాటు పర్యటించనున్న మోదీ.. ఆ దేశ ప్రెసిడెంట్​డొనాల్డ్ ట్రంప్ తో భేటీ అవుతారు. ఇద్దరు నేతలు వివిధ అంశాలపై చర్చించనున్నారు. ట్రంప్ రెండోసారి అధ్యక్షుడు అయిన తర్వాత మోదీ ఆయనతో తొలిసారి భేటీ కానున్నారు.  అమెరికాలో అక్రమంగా ఉంటున్న ఇండియన్లను వెనక్కి పంపుతుండటం, వివిధ దేశాలపై టారిఫ్ లు విధిస్తున్న నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది.

12 మంది గ్యాంగ్​స్టర్ల లిస్ట్ సిద్ధం..

ప్రధాని మోదీ పర్యటన సందర్భంగా అమెరికాలోని 12 మంది ఇండియన్ గ్యాంగ్ స్టర్లను అప్పగించాలని భారత్ కోరనుంది. ఇందుకోసం ఆయా గ్యాంగ్ స్టర్ల పేర్లతోపాటు ఏయే కేసుల్లో వారిని విచారించాల్సి ఉందన్న వివరాలతో లిస్టును కేంద్ర హోంశాఖ అధికారులు సిద్ధం చేశారు. కేంద్రం సిద్ధం చేసిన ఈ లిస్టులో అన్మోల్ బిష్ణోయ్, గోల్డీ బ్రార్, అమృత్ పాల్ సింగ్, హర్ జోత్ సింగ్, హర్ బీర్ సింగ్, నవరూప్ సింగ్, స్వరణ్ సింగ్, సాహిల్ కైలాస్ రితోలీ, యోగేశ్ వంటి గ్యాంగ్ స్టర్ల పేర్లు ఉన్నాయి.