ముంబైలో అటల్ సేతును ప్రారంభించిన మోదీ

ముంబై: మహారాష్ట్రలో పర్యటన సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం మొత్తం రూ.30 వేల కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. దేశంలోనే అత్యంత పొడవైన సముద్రపు వంతెన ముంబై ట్రాన్స్ హార్బర్ లింక్ ను ప్రధాని ప్రారంభించారు. తూర్పు ముంబైలోని ఈస్టర్న్ ఫ్రీవే నుంచి సౌత్ ముంబైలోని మెరైన్ డ్రైవ్ వరకూ అండర్ గ్రౌండ్ రోడ్డు టన్నెల్ నిర్మాణానికి కూడా ప్రధాని శుక్రవారం శంకుస్థాపన చేశారు. 

9.2 కి.మీ. పొడవైన ఈ టన్నెల్ నిర్మాణానికి రూ. 8,700 కోట్లు ఖర్చు చేయనున్నారు. అటల్ సేతుపై శనివారం నుంచి రాకపోకలను అనుమతించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ముంబైలోని సేవ్రీ నుంచి రాయ్ గఢ్ జిల్లాలోని నవ సేవాను కలుపుతూ 21.8 కిలోమీటర్ల పొడవున నిర్మించిన ఈ బ్రిడ్జికి మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్ పేయి గౌరవార్థం అటల్ సేతు అని నామకరణం చేశారు. ఇది దేశంలోనే అతిపొడవైన బ్రిడ్జిగా కూడా రికార్డ్ నెలకొల్పిన ఈ బ్రిడ్జిలో 16.5 కిలోమీటర్ల మేరకు అరేబియా సముద్రంపై నిర్మించారు. 

ఆరు లేన్లతో భూకంపాలను సైతం తట్టుకునేలా పటిష్టంగా నిర్మించిన ఈ వంతెనకు రూ. 17,840 కోట్లు ఖర్చు చేశారు. బ్రిడ్జిపై కనిష్ట వేగం 40 కి.మీ..  గరిష్ట వేగాన్ని 100 కి.మీ.గా నిర్దేశించారు. సేవ్రీ నుంచి నవా సేవాకు ప్రస్తుతం 2 గంటల సమయం పడుతుండగా ఈ వంతెనపై నుంచి వెళ్తే 20 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. బైకులు, ఆటోలు, ట్రాక్టర్లకు ఈ వంతెనపై అనుమతి లేదు. కార్లు, ట్యాక్సీలు, లైట్ మోటార్ వెహికల్స్, మినీ బస్సులు ప్రయాణించవచ్చు. వంతెన అందుబాటులోకి రావడంతో ముంబై ఇంటర్నేషనల్ ఇంటర్ పోర్టు నుంచి నవీ ముంబై ఎయిర్ పోర్టుకు ప్రయాణ సమయం భారీగా తగ్గుతుంది. ఈ బ్రిడ్జిపై వాహనాలు ఎక్కడా ఆగాల్సిన అవసరం లేకుండా ఓపెన్ టోలింగ్ విధానం అమలు చేస్తున్నారు. 

కార్లకు ఒక వైపు టోల్ చార్జీ రూ. 250.. రిటర్న్ జర్నీకి రూ. 375గా నిర్ణయించారు. ఇంతపెద్ద మొత్తంలో టోల్ చార్జీ వసూలు చేయడంపై ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి. అయితే, ఈ బ్రిడ్జిపై ఒకసారి జర్నీ చేస్తే వాహనదారులకు రూ. 500 వరకూ ఇంధన ఖర్చు తగ్గుతుందని,  అందువల్ల టోల్ చార్జీలు ఎక్కువేమీ కాదని అధికారులు అంటున్నారు. వంతెనపై ప్రతిరోజూ 70 వేలకు పైగా వాహనాలు ప్రయాణించే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. శీతాకాలంలో ఇక్కడికి వచ్చే ప్లెమింగో పక్షులను దృష్టిలో ఉంచుకుని వంతెనపై ఓ సౌండ్ బారియర్​ను ఏర్పాటు చేశారు. సముద్రపు జీవులకు హానీ కలిగించని  లైట్లను డిజైన్ చేసి వంతెనపై అమర్చారు.

11 రోజులు  మోదీ దీక్ష

అయోధ్యలో ఈ నెల 22న శ్రీరాముడి విగ్రహ ప్రతిష్ఠాపన వేడుకల నేపథ్యంలో ప్రధాని మోదీ శుక్రవారం ప్రత్యేక దీక్షను ప్రారంభించారు. 11 రోజుల పాటు తాను నియమ నిష్టలతో ఉంటానని ఆయన వెల్లడించారు. శుక్రవారం ఆయన నాసిక్​లోని కాలారామ్ టెంపుల్​లో పూజలు చేశారు. అక్కడి ఫ్లోర్​ను శుభ్రం చేశారు.