జమ్మూ కశ్మీర్ వరప్రదాయని.. సోనామార్గ్ టన్నెల్ ప్రారంభించిన మోదీ..

జమ్మూ కశ్మీర్ పర్యటనలో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ ‘సోనామార్గ్ టన్నెల్’ ను సోమవారం (13 జనవరి) ప్రారంభించారు. శ్రీనగర్ నుంచి కార్గిల్ వెళ్లే మార్గంలో ఉన్న టన్నెల్ ను  అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించింది కేంద్ర ప్రభుత్వం. ఆరున్నర కిలోమీటర్ల పొడవున్న సోనామార్గ్ టన్నెల్ ను రూ.2500 కోట్ల వ్యయంతో నిర్మించారు. 

సొరంగం మొత్తం పొడవు 12 కి.మీ. ఉండగా.. ఇందులో ఆరున్నర (6.5 కి.మీ) కిలోమీటర్ల  పొడవున్న జెడ్ - మోడ్ టన్నెల్ చాలా కీలకమైనది. దీన్నే సోనామార్గ్ టన్నెల్ అంటారు. ఈ టన్నెల ద్వారా శీతాకాలంలో తీవ్ర హిమపాతం ఉన్నప్పటికీ రవాణాకు ఆంటంకం లేకుండా ప్రయాణం చేయవచ్చు. కార్గిల్ మార్గంలో ఎంత హిమపాతం ఉన్న, వాతావరణ పరిస్థితులు ప్రతికూలంగా ఉన్నప్పటికీ ఈ టన్నల్ ద్వారా ఏడాది పొడవునా కనెక్టివిటీ ఉంటుంది. 

సోనామార్గ్ టన్నెల్ ప్రారంభ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీతోపాటు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ, జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హాజరయ్యారు. శ్రీనగర్, లఢక్ మధ్య నిరంతర రవాణ సదుపాయాలకు ఈ టన్నెల్ ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా ప్రధాని మోదీ అన్నారు. జమ్మూ కశ్మీర్ పర్యాట రంగాన్ని బలోపేతం చేయడానికి సోనామార్గ్ సొరంగం ఉపకరిస్తుందని ఈ సందర్భంగా మోదీ అన్నారు.

 శ్రీనగర్ నుంచి స్థానికులకు, వ్యాపారులకు వ్యవసాయ ఉత్పత్తులను తరలించేందుకు, ఇతర అవసరాలకు నిత్యం ఉపయోగపడనుందని కేంద్ర మత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.  సోనామార్గ్ సొరంగం ప్రారంభిచడంతో జమ్మూ కశ్మీర్ రవాణా కష్టాలు తీరిపోనున్నాయని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు.