నితీశ్ కుమార్‌‌ను ప్రధాని మోడీ అవమానించారు

పాట్నా: బీహార్ సీఎం నితీశ్‌ కుమార్‌‌ను ప్రధాని నరేంద్ర మోడీ అవమానించారని ఆర్జేడీ నేత తేజశ్వీ యాదవ్ అన్నారు. కులాల వారీగా జనగణన చేపట్టాలన్న అంశం ప్రాధాన్యతను చర్చించేందుకు సమయం కోరి వారం అవుతున్నా ఆయన ఇప్పటి వరకూ స్పందించలేదన్నారు. ఇతర నేతలను కలుస్తున్న ఆయన ఒక్క నితీశ్ కుమార్ విషయంలోనే ఒంటరిని చేయాలన్న ధోరణిలో పట్టించుకోకుండా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 4వ తేదీన ప్రధాని మోడీ లేఖ రాశానని, ఇప్పటి వరకు తనకు స్పందన రాలేదని శుక్రవారం నితీశ్‌ కుమార్ ప్రకటించిన నేపథ్యంలో పాట్నాలో తేజశ్వీ యాదవ్ మీడియాతో మాట్లాడారు. ‘‘కేంద్రంలో, రాష్ట్రంలోనూ ఎన్డీఏ ప్రభుత్వాలే ఉన్నాయి. అందుకే బీహార్‌‌లో ప్రతిపక్ష నేతలంతా కలిసి రాజకీయ విభేదాలను పక్కపెట్టి సీఎం నితీశ్ కుమార్‌‌ను కలిశాం. కులాల వారీగా జనగణన చేపట్టాల్సిన అవసరాన్ని ప్రధానికి వివరించేందకు అపాయింట్‌మెంట్ కోరాలని అడిగాం. ప్రధాని సమయం ఇస్తే అంతా కలిసి వెళ్లి భేటీ అవుదామని చెప్పాం” అని అన్నారు. అయితే ప్రధాని మోడీ ఇప్పటికీ నితీశ్‌ కుమార్ కలిసేందుకే అపాయింట్‌మెంట్ ఇవ్వలేదని, కానీ మిగతా పార్టీల నేతలు, వేర్వేరు వ్యక్తులను కలుస్తూ ట్విట్టర్‌‌లో ఫొటోలు పెడుతున్నారని, ఇది ఒక రకంగా నితీశ్‌ను అవమానించడమేనని తేజశ్వీ యాదవ్ చెప్పారు.