రెడ్డి గారూ.. మీ అనుభవాలను..పాఠాలుగా చెప్పండి.. వీడియో కాన్ఫరెన్స్ లో మోదీ

కరీంనగర్, వెలుగు: వ్యవసాయ రంగంలో ఎన్నో అవకాశాలు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకుంటే ఆర్థికంగా ఎంతో అభివృద్ధి చెందుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం పెద్దకూర్మపల్లికి చెందిన ఉత్తమ రైతు మల్లికార్జున్​రెడ్డి అని చెప్పారు. ఆయన లాంటి యువ రైతు.. విద్యావంతులకు, మరెందరికో ఆదర్శం అన్నారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్రలో భాగంగా ఉత్తమ రైతుగా పేరు తెచ్చుకున్న మల్లికార్జున్​రెడ్డితో గురువారం ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనుభవం ఎంతో విలువైందని, టైమ్ దొరికినప్పుడల్లా అగ్రికల్చర్ కాలేజీలకు వెళ్లి అనుభవాలను పాఠాలుగా చెప్పాలని మల్లికార్జున్​రెడ్డికి మోదీ సూచించారు. దేశవ్యాప్తంగా ప్రధాని మాట్లాడిన ఆరుగురిలో తెలంగాణకు చెందిన మల్లికార్జున్ రెడ్డి ఉన్నారు. హైదరాబాద్​లోని మల్టీ నేషనల్ కంపెనీలో లక్షల రూపాయలు సంపాదించే జాబ్ వదిలేసి వ్యవసాయం చేయడానికి గల కారణాలను మోదీ అడిగి తెలుసుకున్నారు. 

‘‘రెడ్డి గారూ.. బీటెక్ చదివిన మీరు.. 2014 దాకా దిగ్గజ కంపెనీలో జాబ్ చేశారు. లక్షల్లో జీతం.. మంచి ఉద్యోగం వదిలేసి వ్యవసాయం చేస్తానంటే భార్యా నారాజ్ కాలేదా? హైదరాబాద్ వదిలేసి ఊళ్లో ఉంటానంటే పిల్లలు గుస్సా కాలేదా? అసలు మీరు వ్యవసాయాన్ని వృత్తిగా ఎంచుకోవడానికి కారణం ఏంటి?’’అని మల్లికార్జున్​ రెడ్డిని మోదీ ప్రశ్నించారు. దీనికి మల్లికార్జున్ రెడ్డి స్పందిస్తూ..‘‘నాకు వ్యవసాయం అంటే చాలా ఇష్టం. అందుకే ఉద్యోగం వదిలేసి ఊరికి వచ్చేశా. జమ్మికుంట కేవీకే సైంటిస్టుల సలహాలు, సూచనలతో ప్రకృతి వ్యవసాయం చేస్తున్న. తోటల పెంపకం, పశుపోషణ, కోళ్ల పెంపకం ద్వారా ఇంటిగ్రేటెడ్ వ్యవసాయం చేస్తున్న. ఈ పద్ధతిలో వ్యవసాయం చేస్తే రోజువారీ ఆదాయానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు. అగ్రికల్చర్​లో భాగంగా ఔషధ మొక్కల సాగుతో ఐదు మార్గాల్లో ఆదాయం వస్తున్నది. గతంలో సంప్రదాయ పద్ధతిలో 12 ఎకరాల్లో వ్యవసాయం చేస్తే రూ.6లక్షల ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఇంటిగ్రేటెడ్ అగ్రికల్చర్​తో రూ.12.35లక్షల ఆదాయం వస్తున్నది’’అని మోదీకి మల్లికార్జున్​రెడ్డి వివరించారు. తన శ్రమను గుర్తించిన పలు సంస్థలు అవార్డులతో సత్కరించాయన్నారు. ఇంటిగ్రేటెడ్ వ్యవసాయంపై ప్రచారం చేస్తున్నట్టు చెప్పాడు. కొంత మంది రైతులకు శిక్షణ కూడా ఇస్తున్నట్టు తెలిపాడు.

వడ్డీ లెక్కల్లో ఏదో పొరపాటు ఉంది: మోదీ

ప్రభుత్వం నుంచి అందుతున్న ప్రోత్సాహం గురించి ప్రధాని మోదీ అడగగా.. కిసాన్ క్రెడిట్ కార్డు, భూసార కార్డు, బిందు సేద్యం రాయితీ, పంటల బీమా స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్నట్టు మల్లికార్జున్ రెడ్డి వివరించాడు. కిసాన్ క్రెడిట్ కార్డు ద్వారా రూ.5 లక్షల లోన్ వచ్చిందన్నారు. లోన్ పై 7% వడ్డీ చెల్లిస్తున్నట్టు మోదీకి చెప్పగా.. ‘‘మీ దగ్గర ఏదో పొరపాటు జరుగుతున్నది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీ ఇస్తున్నాయి. మీరు ఒకసారి బ్యాంక్​కు వెళ్లి చెక్ చేసుకోండి’’అని సూచించారు. విద్యావంతుడిని కావడంతోనే రైతుగా రాణిస్తున్నట్టు మల్లికార్జున రెడ్డి చెప్పారు. తర్వాత, స్టూడెంట్స్, గ్రామస్తులతో పాటు మల్లికార్జున్​ రెడ్డి భార్యా, బిడ్డలతో మోదీ మాట్లాడారు. 

విద్యావంతులైన యువతను వ్యవసాయ రంగంలోకి వచ్చేలా ప్రోత్సహించాలన్నారు. వ్యవసాయంలో అండగా నిలుస్తున్న మల్లికార్జున్​ రెడ్డి భార్యను నారీశక్తిగా అభివర్ణించారు. ‘జన్ బాగిదారి’లో సంక్షేమ పథకాలను సరైన పద్ధతిలో అమలు చేయడానికి మల్లికార్జున్​ రెడ్డిలాంటి వారి సూచనలు అవసరం ఉంటాయని మోదీ అన్నారు. వీడియో కాన్ఫరెన్స్​లో కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ డైరెక్టర్ యోగేశ్ మోహన్ దీక్షిత్, కలెక్టర్ పమేలా సత్పతి, ఎల్డీఎం ఆంజనేయులు, సంక్షేమ శాఖ అధికారి సరస్వతి, డీఎంహెచ్​వో లలితాదేవి పాల్గొన్నారు.